Abn logo
Jun 21 2021 @ 23:29PM

రైతు చైతన్య సదస్సుల జాడేది?

- వ్యవసాయంపై రైతులకు సూచనలు కరువు

- సాగు మెళకువలు తెలపడంలో అధికారులు కీలకం

- ఇష్టారీతిలో ఎరువుల వాడకం

- సదస్సులు ఏర్పాటు చేయాలంటున్న రైతులు

బెజ్జూరు, జూన్‌ 21: వ్యవసాయ సాగులో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం మే నెలలో మన తెలంగాణ-మనవ్యవసాయం పేరుతో అన్ని గ్రామాల్లో చైతన్యసదస్సులు నిర్వహించేవారు. వ్యవ సాయ అనుబంధశాఖల అధికారులు పాల్గొనేవారు. సాగులో ఏ విత్తనాలు వాడాలి.. ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలి.. చీడపీడల నివారణకు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి.. అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించేవారు. ఐతే రెండేళ్లుగా రైతు సదస్సులు నిర్వహించడం లేదు. వానాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. అధికారులు మాత్రం గ్రామాలవైపు చూడటం లేదన్న విమర్శలు న్నాయి. దీంతో రైతులకు దిశానిర్దేశం చేసేవారు కరువ య్యారు. రైతులు వారికి నచ్చిన పంటలు వేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. జిల్లాలో అధికంగా పత్తిపంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రైతులంతా వర్శాధారం పైనే ఆధారపడి సాగు చేస్తారు. రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతు సయ న్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఇంతవరకు వాటితో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనతెలంగాణ- మన వ్యవసాయంతో అధికారులు భూసార పరీక్షల ఆవశ్యకత, పంట మార్పిడి పద్ధతి, పునరావాస పంటల గురించి, ఆధునిక పద్ధతిలో సాగు విధానం, ఏ సమయంలో ఏ పంటలు వేసుకోవాలి అనే విషయాలపై గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించేవారు. వీటితో పాటు అధిక వర్షాలు కురిస్తే ఎలా సాగుచేయాలి. లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించేవారు. ఈ సూచనలతో రైతులకు మేలు జరిగేది. 

అవగాహన లేమితో నష్టాల పాలు..

ప్రభుత్వం రైతులకు సాగులో వివిధ రకాల సూచ నలు అందించినప్పుడే వారికి అన్నివిధాల మేలు జరుగుతుంది. రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోతుండటంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. రైతు చైతన్య సదస్సులతో రైతులకు అన్నిరకాల పంటలపై అవగాహన కలిగి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నందున అధికారులకు వాటికే సమయాన్ని కేటా యిస్తున్నారు. ప్రభుత్వం కూడా సదస్సులపై ఎలాంటి ప్రకటన చేయని కారణంగా సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించే వారు లేకుండా పోయారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సాగులో సలహాలు, సూచనలతో పాటు ఎలాంటి పంటలు ఏ సమయంలో వేయాలి అనే దానిపై అవగాహన కల్పిం చాలని కోరుతున్నారు.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లాలో ఈ ఏడాది రైతాంగం అధికంగా పత్తిసాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పదిహేను మండలాల పరిధిలో అత్యధికంగా 3.35లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగుచేసే అవకాశం ఉందని అధికారులు బావిస్తున్నారు. 54వేల ఎకరాల్లో వరి, 46వేల ఎకరాల్లో కంది, పదివేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లాలో అధికంగా రైతులు నిరక్ష్య రాస్యులే కావడంతో వారికి పంటల సాగులో సరైన మెలకువలు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  భూసార పరీక్షల ఆవశ్యకత, పంట మార్పిడి పద్ధతి, పునరావాస పంటల గురించి, ఆధునిక పద్ధతిలో సాగు విధానం, ఏ సమయంలో ఏ పంటలు వేసుకోవాలి అనే విషయంపై గ్రామాల్లోని రైతులకు  ఎలాంటి  సూచనలు అందడం లేదు. దీంతో రెండేళ్లుగా రైతులు వారికి ఇష్టం వచ్చిన పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతు చైతన్య సదస్సులపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో అన్నదాతలు  ఇబ్బందులు పడుతు న్నారు.

యేటా నిర్వహించాలి..

- గడ్డం శ్రీనివాస్‌, రైతు, బెజ్జూరు

రైతు చైతన్య సదస్సుతో ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం రైతు చైతన్య సదస్సులు నిర్వహించాలి. సాగు పద్ధతులు తెలుసుకోవడం వల్ల రైతులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు సాధించేందుకు చైతన్య సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయి. 

రైతు వేదికల్లోనే అవగాహన కార్యక్రమాలు..

- రాజుల నాయుడు, ఏవో 

రాష్ట్రప్రభుత్వం రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు గ్రామాల్లో రైతువేదికలు ఏర్పాటు చేసింది. సాగులో సలహాలు అందించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయి. వీటి ద్వారానే తమ సిబ్బంది రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతినెలా సమావేశాలు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేసి వ్యవసాయంలో అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.