Advertisement
Advertisement
Abn logo
Advertisement

డబ్బులిస్తామంటూ ప్రకటనలు.. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు ఈ దేశాలు ప్రకటించిన వరాలివి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. మహమ్మారి విలయతాండవం చేయడంతో లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగాలు, ఉపాధి లేక కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు శక్తివంతమైన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. మహమ్మారి వ్యాప్తికి కళ్లెంపడి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఏకైక మార్గం వ్యాక్సినే అని ప్రపంచ దేశాలు గట్టిగా నమ్మాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టీకాను కనుకొనేందుకు విస్తృత ప్రయోగాలు జరిగాయి. యుద్ధ ప్రతిపాదికన శాస్త్రవేత్తలు కొవిడ్ వ్యాక్సిన్ రూపొందించారు. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు మళ్లీ ఓ తలనొప్పి మొదలైంది. ప్రజలు కొవిడ్ టీకాను విశ్వసించకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలో ప్రజలు స్వతంత్రంగా ముందుకొచ్చి టీకా తీసుకునేలా ప్రపంచంలోని కొన్ని దేశాలు రకరకాల తాయిలాలను ప్రకటించాయి. కోట్లాది రూపాయలను ఆఫర్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయా దేశాలవైపు ఓ లుక్కేస్తే...


సెర్బియా..

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సెర్బియా తీసుకున్న నిర్ణయం.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి డబ్బులు ఇవ్వనున్నట్టు మే మొదటి వారంలో ప్రకటించి.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచేసింది. దేశ అధ్యక్షుడు అలగ్జాండర్ ప్రకటించిన విధంగానే.. మే 31లోపు వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు తలా 3వేల సెర్బియన్ దినార్‌లను (ఇండియన్ కరెన్సీలో రూ. 2,187) సెర్బియా ప్రభుత్వం అందించింది. 


యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా..

జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు (18ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కొద్ది రోజుల క్రితం బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన బైడెన్.. యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అమెరికా రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రజలకు భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేస్తున్నాయి. 


న్యూయార్క్: పౌరులు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం కోసం న్యూయార్క్.. ‘వ్యాక్స్ అండ్ స్క్రాచ్’ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న 18 ఏళ్ల పైబడిన యువతకు న్యూయార్క్ లాటరీ టికెట్లను ఆఫర్ చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న యువత ఈ లాటరీ టికెట్ల ద్వారా 20 డాలర్ల నుంచి అత్యధికంగా 5 మిలియన్ డాలర్ల వరకు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.36కోట్ల వరకు) గెలుచుకోవచ్చని న్యూయార్క్ ప్రకటించింది. ప్రైజ్‌మనీ భారీగా ఉండటంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. 


ఓహియో: ఓహియో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. యువతను వ్యాక్సిన్‌వైపు మళ్లీంచేందుకు భారీ ఆఫర్ ప్రకటించింది. ‘వ్యాక్స్ ఏ మిలియన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న యువతను లాటరీ విధానంలో ఎంపిక చేసి.. ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే అబ్బి‌గైల్ బుగెన్స్కే అనే 22ఏళ్ల యువతి వారం రోజుల క్రితం 1 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 7కోట్లు) గెలుచుకుంది. 


కాలిఫోర్నియా: యువతను ఆకర్షిచేందుకు కాలిఫోర్నియా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840కోట్లు) భారీ ఆఫర్‌ను ప్రకటించింది. జూన్ 15 నాటికి వ్యాక్సిన్ వేసుకున్న వారు.. ఈ లాటరీలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని ప్రకటించించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంత మందిని లాటరీ విధానంలో ఎంపిక చేసి విజేతలకు ప్రైజ్‌మనీ అందించనున్నట్టు తెలిపింది. ఇజ్రాయిల్..

వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచంలోనే మొట్టమొదటగా తాయిలాలలను ప్రకటించిన దేశం ఇజ్రాయెల్. ‘గ్రీన్ పాస్’ల ద్వారా ఇజ్రాయెల్ తమ దేశ పౌరుల దృష్టిని ఆకర్షించింది. గ్రీన్‌పాస్‌ల ద్వారా కొన్ని ప్రయోజనాలను కల్పించి.. జిమ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో వాటిని ఉపయోగించుకుని.. టీకా తీసుకున్న ప్రజలు లబ్ధిపొందేలా ప్రణాళికలు రూపొందించింది. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొవిడ్ నిబంధనలను ఆ దేశం సడలించింది.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement