Abn logo
Apr 9 2020 @ 19:44PM

అప్పటి స్పానిష్ ఫ్లూతో కరోనాకు పోలికా.. అసలు నిజం ఇది..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 15 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 89,873 మందిని ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో 14 వేల మందికి పైగా కోవిడ్-19 సోకి మరణించారు. ఈ మహమ్మారి వల్ల స్పెయిన్, ఇటలీలో వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే.. ప్రపంచానికి ఇలాంటి ఉపద్రవాలు ఎదురుకావడం కొత్త కాదు కానీ కరోనాకు, 1918లో కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూకు దగ్గర సంబంధముందనేది కొందరి వాదన.


ప్రజా జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఈ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తీరును అప్పటి స్పానిష్ ఫ్లూతో కొందరు పోలుస్తున్నారు. స్పానిష్ ఫ్లూకు సంబంధించి చేదు జ్ఞాపకాలుగా చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ఛాయాచిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ స్పానిష్ ఫ్లూ పుట్టుపూర్వోత్తరాలేంటి? కరోనాను స్పానిష్ ఫ్లూతో పోల్చడం వెనకున్న కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వివరిస్తూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


స్పానిష్ ఫ్లూకు సాక్ష్యాలుగా మిగిలిన కొన్ని దృశ్యాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


స్పానిష్ ఫ్లూ. తొలుత స్పెయిన్‌లో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో దీనికి స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు. 1918 జనవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. 1920 డిసెంబర్‌తో ఈ మహమ్మారి కనుమరుగైంది. అంటే.. దాదాపు రెండేళ్ల పాటు ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ సోకి రెండేళ్ల వ్యవధిలో 5 కోట్ల మంది చనిపోయారంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో స్పానిష్ ఫ్లూ చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఈ స్పానిష్ ఫ్లూ వల్ల 5 కోట్ల మంది చనిపోతే అందులో 1.7 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. అంటే.. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో 43 శాతం మంది భారతీయులే. ఈ ఫ్లూ వ్యాపించే నాటికి యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులోకి రాలేదు. స్పానిష్ ఫ్లూ మనుషుల అపరిశుభ్రత వల్లే పుట్టిందని చెబుతుంటారు. 

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుల నుంచి కాపాడుకునేందుకు సైనికులు సొరంగాల మాదిరిగా పెద్ద పెద్ద కందకాలు తవ్వుకుని అందులో తలదాచుకునేవారు. అలా తవ్విన కందకాలు అపరిశుభ్రతకు కేంద్రంగా మారి.. ఆ పరిస్థితుల వల్లే స్పానిష్ ఫ్లూ పుట్టింది. తొలుత ఓ సైనికుడిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. తీవ్ర జ్వరం రావడం, చివరికి నుమోనియా బారిన పడి ఆ సైనికుడు మరణించాడు. ఆ సైనికుడి నుంచి మరికొందరు సైనికులకు ఈ వైరస్ వ్యాపించింది. అలా యూరప్ దేశాలకు ఇది విస్తరించింది. అప్పట్లో విమాన సౌకర్యాలు అంతగా అందుబాటులో లేనప్పటికీ.. నౌకలు, రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే వారి నుంచి ఇది ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లు తెలిసింది. భారత్‌లో ఈ వైరస్ లక్షణాలు తొలుత ముంబై పోర్టు‌లో పనిచేసే ఓ ఉద్యోగిలో కనిపించాయని చెబుతారు.

ముంబై పోర్టులో పనిచేసే ఓ ఉద్యోగికి తీవ్ర జ్వరం రావడంతో మలేరియాగా భావించి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో మలేరియా లక్షణాలేవీ కనిపించకపోవడంతో వైద్యులకు కారణమేంటో అంతుచిక్కలేదు. ఈలోపే ఆ వైరస్ అతని నుంచి ఇతరులకూ వ్యాపించింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక తిరిగి ముంబైకి ఓడ మార్గంలో చేరుకున్న సైనికుల ద్వారా అతనికి సోకిందని తర్వాత తెలిసింది. అలా ముంబై నగరం మొత్తం విస్తరించింది. అక్కడి నుంచి దేశం మొత్తం పాకింది. గుజరాత్‌లో మహాత్మ గాంధీ గడిపిన ఆశ్రమంలో కూడా ఒకరికి ఈ వైరస్ సోకింది. అతని వల్ల గాంధీకి కూడా ఈ వైరస్ సోకింది. అప్పుడు గాంధీ వయసు 48 ఏళ్లు. ఈ వైరస్ నుంచి కోలుకోవడానికి కేవలం ద్రవ రూపంలోనే గాంధీ ఆహారం తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆయన ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.

భారత్‌లో అప్పట్లో వైద్య సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేవు. ఆసుపత్రుల్లో సరిపడా పడకలు ఉండేవి కావు. దీంతో.. చేసేదేమీ లేక వైరస్ సోకిందని తెలిసినా ఇంటి వద్దే మంచాన పడి చావు కోసం ఎంతోమంది ఎదురుచూసిన పరిస్థితి. దాదాపు రెండేళ్లలో 2 కోట్ల మంది చనిపోవడంతో కొందరిని దహనం చేసేందుకు కట్టెలు కూడా లేక గంగా నదిలో శవాలను వదిలే వారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు గంగా నది నీటితోనే కాక శవాలతో కూడా ఉప్పొంగిందని ఆ ఉపద్రవానికి సాక్ష్యంగా మిగిలిన కొందరు పెద్దలు చెప్పారు.

స్పానిష్ ఫ్లూకు, కరోనా వైరస్‌కూ దగ్గర పోలికలున్నాయనేది కొందరి వాదన. వారి వాదనను ఒకసారి పరిశీలిస్తే.. ఇవి రెండూ వేరువేరు దేశాల్లో వెలుగుచూసినప్పటికీ ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీరు ఒకేలా ఉందంటున్నారు. జ్వరం, నుమోనియా స్పానిష్ ఫ్లూ లక్షణాలు. కరోనా కూడా జ్వరంతో పాటు ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి శ్వాస సంబంధ సమస్యతో మనిషి మరణించేలా చేస్తుంది. భారత్‌లో ముంబై నుంచి స్పానిష్ ఫ్లూ విస్తరించింది.

కరోనా కూడా ముంబైలో, మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 857 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోని పలు ప్రాంతాలను కరోనాకు హాట్‌స్పాట్‌లుగా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. స్పానిష్ ఫ్లూ కూడా తొలుత వృద్ధులనే బలి తీసుకుంది. అయితే... కొన్నాళ్లకు కోట్ల మంది యువత కూడా ఈ వైరస్ బారిన పడి మరణించారు. కరోనా వైరస్ కూడా ఎక్కువగా వృద్ధులపైనే ప్రభావాన్ని చూపుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, పౌష్టికాహారం తీసుకోని వారిలో స్పానిష్ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. కరోనా కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది.


ఇలా కొన్ని దగ్గర సంబంధాలున్నప్పటికీ.. ఈ రెండింటికీ పోలిక పెట్టడమే అసంబద్ధం. అప్పటి వైద్య సదుపాయాలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వందేళ్ల క్రితం ఫ్లూ వచ్చిందని, ఇప్పుడు మళ్లీ వచ్చిందనే వాదన పస లేనిది. వందేళ్ల క్రితం ఒక వైరస్‌ సోకిందని నిర్ధారించడానికే వారాల వ్యవధి పట్టేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలతో కొన్ని గంటల వ్యవధిలోనే వైరస్‌ను నిర్ధారించి తగిన చికిత్సను అందించవచ్చు. లేనిపోని అపోహలతో, పోలికలతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేయకుండా ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలనేది వైద్య నిపుణుల మాట.
ఇది కూడా చదవండిImage Caption

స్పానిష్ ఫ్లూకు సాక్ష్యాలుగా మిగిలిన కొన్ని దృశ్యాలివి..

Advertisement
Advertisement
Advertisement