సబ్‌ ప్లాన్‌ నిధులు ఏమాయె?

ABN , First Publish Date - 2020-07-02T05:59:53+05:30 IST

అక్కరకు వచ్చినప్పుడు మాత్రమే పాలకులకు, పాలక పార్టీలకు క్రింది కులాలు గుర్తుకొస్తాయి. వారి సంక్షేమం, అభివృద్ధిపై ఎంతగానో ప్రేమను ఒలకపోస్తాయి. అక్కర తీరగానే క్రింది కులాలు కానీ, వారి అభివృద్ధి కానీ అస్సలు గుర్తుకు రాదు. మళ్ళీ...

సబ్‌ ప్లాన్‌ నిధులు ఏమాయె?

కేటాయించిన నిధులను సబ్‌ప్లాన్‌ చట్టంలో చెప్పినట్లుగా ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే వినియోగిస్తున్నారా? వీటిపై సమీక్ష లేవి? మానిటరింగ్‌ కమిటీలేవి? సామాజిక తనిఖీలు ఎక్కడ? ఇత్యాది ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానాలు లేవు. ఒక ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్టిన చట్టబద్ధమైన పథకాన్ని, అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం అమలు చేయకపోవటం రాజ్యాంగ విహితమేనా?


అక్కరకు వచ్చినప్పుడు మాత్రమే పాలకులకు, పాలక పార్టీలకు క్రింది కులాలు గుర్తుకొస్తాయి. వారి సంక్షేమం, అభివృద్ధిపై ఎంతగానో ప్రేమను ఒలకపోస్తాయి. అక్కర తీరగానే క్రింది కులాలు కానీ, వారి అభివృద్ధి కానీ అస్సలు గుర్తుకు రాదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తారు. పాత పథకాలకు పాతరేయటమో, లేదా తూతూ మంత్రంగా అమలు చేయటమో చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పథకం గతి కూడా అంతే. ఈ పథకానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నా, అవి ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి.అసమాన సమాజంలో వెనుకబడిన కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, వాటిని ఖచ్చితంగా, సక్రమంగా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్నది రాజ్యాంగ సంకల్పం. పూనా ఒడంబడిక సందర్భంలోనే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ అణగారిన వర్గాల ప్రత్యేక నిధుల కేటాయింపుపై చర్చ చేశారు. 1975లో ఇందిరాగాంధీ దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక నిధుల పేరిట కేటాయింపులు చేశారు. దళిత, గిరిజన కులాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా, దశాబ్దాలుగా అవి కాగితాలకే పరిమితమయ్యేవి. అమలులో కనిపించేవే కావు. దీంతో మరోమారు ఈ నిధుల కేటాయింపు అంశం తెరపైకి వచ్చి ప్రత్యేక నిధుల కొరకు దళితుల ఐక్య పోరాటాలు జరిగాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా 2013లో ఉమ్మడి ఏ.పీ. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి షెడ్యుల్డ్‌ కులాలు, షెడ్యుల్డ్‌ తెగల సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ తీసుకు వచ్చారు. ఈ సబ్‌ ప్లాన్‌ ద్వారా జనాభా ప్రాతిపదికన దళిత, గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో నిధులను సబ్‌ప్లాన్‌కు కేటాయించేలా చట్టం కూడా తెచ్చారు. దాదాపు 40 విభాగాలలో నిధులను ఆయా శాఖలకు కేటాయిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలలో 90:10, మరి కొన్ని పధకాలలో 60:40 షేరింగ్‌లో అమలు జరుగుతాయి కూడా.


అప్పటి ఉపముఖ్య మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, పలు జిల్లాల పర్యటనల అనంతరం నివేదికనూ సమర్పించారు. దాదాపు రూ.12 వేల కోట్లు ఆ నాటి బడ్జెట్‌లో కేటాయించారు. ఈ నిధుల వ్యయంపై ఎస్సీ, ఎస్టీ కమీషన్ల పర్యవేక్షణ, నిధుల అమలుకు నోడల్‌ ఏజన్సీలు, సోషల్‌ ఆడిట్‌లు, రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి మోనటరింగ్‌ కమిటీలు ఇత్యాది అంశాలనూ చట్టంలో పొందుపరిచారు. బడుగుల బాగు కొరకు తీసుకువచ్చిన అలాంటి బృహత్తర సబ్‌ప్లాన్‌ ఏమయ్యింది? సబ్‌ప్లాన్‌కు నిధుల కేటాయింపు జరుగుతుందా? కేటాయించిన నిధులను సబ్‌ప్లాన్‌ చట్టంలో చెప్పినట్లుగా ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే వినియోగిస్తున్నారా? వీటిపై సమీక్ష లేవి? మానిటరింగ్‌ కమిటీలేవి? సామాజిక తనిఖీలు ఎక్కడ? ఇత్యాది ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానాలు లేవు. ఒక ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్టిన చట్టబద్దమైన పథకాన్ని, అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం అమలు చేయకపోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం? ఈ మాత్రానికి చట్ట సభలు, చట్టాలు ఎందుకు? నవ్యాంద్ర ప్రదేశ్‌లో ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం రూ.40 వేల కోట్లు కేటాయించినట్లు లెక్కలు. 2014–-2015 తొలి ఏడాది రూ.4,576 కోట్లు కేటాయించగా, చివరి ఏడాది 2018-–2019కి రూ.11,228 కోట్లు కేటాయించారు. ఏ ఏడాది నిధులు ఆ ఏడాదే ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్నా, 50 శాతం నుంచి 70 శాతం వరకు మాత్రమే ఖర్చు జరిగిన్నట్లు అధికారిక లెక్కలు. 2019–-2020 బడ్జెట్‌లో జగన్‌ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు వేటాయించారు. దీనిలో 74.70 శాతం ఖర్చు చేసినట్లు పద్దు చూపారు. అంటే మిగిలిన రూ.3,750 కోట్లు ఏమయ్యాయో తెలీదు. ఇలా చట్ట ప్రకారం బడ్జెట్‌లలో కాస్తో, కూస్తో సబ్‌ప్లాన్‌ అంచనాలను కేటాయింపుల్లో చూపించి, ఆచరణలో పెద్ద ఎత్తున ఇతర పధకాలకు మళ్ళిస్తుంటారు.


ఖర్చు కాని నిధులను మరుసటి ఏడాది కేటాయింపులకు జత చేయాలని ఉన్నా, జత చేయరు. దీంతో నిధుల మళ్ళింపును అడ్డుకునేందుకే తీసుకువచ్చిన ఉప ప్రణాళికకు నిధుల మళ్ళింపు తప్పటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులను పసుపు కుంకుమ పథకానికి వళ్ళించినట్లు ఆరోపణలొస్తే, జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి, ఇతర చెల్లింపులకు మళ్ళిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తి స్థాయిలో అమలు చేయటం ఒక బేతాళ ప్రశ్న ఐతే, ఎన్నో పోరాటాల ఫలితంగా చట్టబద్దత కల్పించబడ్డ సబ్‌ప్లాన్‌పై దళిత, గిరిజన వర్గాలలో చైతన్యం లేకపోవటం మరో బాధాకరమైన ప్రశ్న. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి అంటే కేవలం ఎస్సీ, ఎస్టీలను కార్పొరేషన్‌ రుణాలకే పరిమితం చేశారు. వాడల్లో, కాలనీలలో శాశ్వత అభివృద్ధి ఫలాలను అందించకుండా, రుణాల సబ్సిడీల మిగులు కొరకు అర్జీలు పట్టుకొని దగ్గరకు రానివ్వని బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్న దుస్థితి. ఇప్పుడు దళిత, గిరిజన కులాలలో ఉప కులాల వారీగానూ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో సబ్‌ప్లాన్‌ నిధలను ఆయా కార్పొరేషన్‌ల వారీగా కేటాయించ వచ్చు. ఖర్చు చేయవచ్చు. పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఆడిట్‌ చేయవచ్చు. కానీ అలా జరగటం లేదు. ఇందుకు ప్రధాన కారణం దళిత, గిరిజన వర్గాల పట్ల పాలకుల వివక్షతా భావమే ప్రధాన కారణం. ఏది ఏమైనా ఆర్థిక వేత్త అమర్థ్యసేన్‌ చెప్పినట్లు ‘దారిద్యానికి మూలం నిధుల కొరత కాదు. పేదరిక నిర్మూలన పథకాలను సరైన రీతిలో అమలు చేయకపోవటమే’ అన్న మాటను పాలకులు పరిగణనలోకి తీసుకోనంత కాలం యాక్షన్‌ లేని ఇలాంటి సబ్‌ప్లాన్లు ఎన్ని పెట్టినా ఏం ప్రయోజనం...?

పోతుల బాలకోటయ్య

Updated Date - 2020-07-02T05:59:53+05:30 IST