మార్చేస్తామని.. మాయచేసి!

ABN , First Publish Date - 2021-08-22T05:17:26+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ‘నాడు-నేడు’తో సమూల మార్పులు తీసుకొచ్చామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తొలిదశ పనులు పూర్తయినట్టేనని చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిస్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు. ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కొన్ని మండలాల్లో మూడో వంతు కూడా పూర్తవ్వని పరిస్థితి. ఫర్నీచర్‌, తాగునీరు, ప్రహరీ, గోడలకు రంగులు, నిరంతర నీటి వసతి, గ్రీన్‌ చాక్‌బోర్డు, వంట గది, ఇంగ్లిష్‌ ల్యాబ్‌, విద్యుత్‌, ఇతర మరమ్మతులు వంటి పది మౌలిక వసతులు కల్పించాలి. కానీ కొన్నిచోట్ల గదులు నిర్మించి మమ అనిపించేశారు.

మార్చేస్తామని.. మాయచేసి!
ఎచ్చెర్ల : ‘నాడు-నేడు’లో అభివృద్ధి చేయని చిలకపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు

- ‘నాడు-నేడు’లో పైపై మెరుగులే

- పది అంశాలతో కూడిన మౌలిక వసతులేవీ?

- తొలి విడత విజయవంతమైనట్టు చెబుతున్న ప్రభుత్వం

- పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని ప్రకటనలు

- క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు

(ఎచ్చెర్ల/ రాజాం/ టెక్కలి రూరల్‌/ రేగిడి /నరసన్నపేట/ ఆమదాలవలస/ కాశీబుగ్గ/ రణస్థలం/ లావేరు/ భామిని/ జలుమూరు)

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ‘నాడు-నేడు’తో సమూల మార్పులు తీసుకొచ్చామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తొలిదశ పనులు పూర్తయినట్టేనని చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిస్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు. ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కొన్ని మండలాల్లో మూడో వంతు కూడా పూర్తవ్వని పరిస్థితి. ఫర్నీచర్‌, తాగునీరు, ప్రహరీ, గోడలకు రంగులు, నిరంతర నీటి వసతి, గ్రీన్‌ చాక్‌బోర్డు, వంట గది, ఇంగ్లిష్‌ ల్యాబ్‌, విద్యుత్‌, ఇతర మరమ్మతులు వంటి పది మౌలిక వసతులు కల్పించాలి. కానీ కొన్నిచోట్ల గదులు నిర్మించి మమ అనిపించేశారు. ఇంకొన్నిచోట్ల పాత గోడలకే రంగులు అద్దారు. మరుగుదొడ్లు ఉన్నచోట నీటి వసతి లేదు. వంట గదుల ఊసే లేదు. ఇంగ్లిష్‌ ల్యాబ్‌, గ్రీన్‌ చాక్‌బోర్డుల జాడే లేదు. కానీ ఇవన్నీ పూర్తి చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది. 

- ఎచ్చెర్ల మండలంలో ‘నాడు-నేడు’ పథకం కింద మూడో వంతు పాఠశాలలే ముస్తాబయ్యాయి. మొత్తం 105 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. తొలివిడత ‘నాడు-నేడు’కు 37 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రాఽథమిక పాఠశాలలు 20, ప్రాథమికోన్నత 6, ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. బుడగట్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణం జరగలేదు. అల్లినగరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. 

- టెక్కలి మండలం బొరిగిపేట ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో ‘నాడు-నేడు’ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బయటకు రంగులు వేసి ఆసక్తిగా మార్చినా..లోపల మాత్రం అధ్వానంగా ఉంది. తాగునీటి వసతి అంతంతమాత్రమే. చేతులు కడుక్కునే స్థలంలో కుళాయి ట్యాపులు అమర్చలేదు. భగవాన్‌పురం పాఠశాలలో చాలావరకూ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. టెక్కలి బాలికోన్నత పాఠశాలలో ఇప్పటికీ భవన నిర్మాణ పనులు జరుగుతునే ఉన్నాయి. దీంతో వరండాలో విద్యార్థులు కూర్చోవలసి వస్తోంది. 

- రేగిడి మండలంలో 81 పాఠశాలలకుగాను తొలివిడతగా 42 పాఠశాలలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రూ.9.15 కోట్లు మంజూరయ్యాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. ఖండ్యాం హైస్కూల్‌లో మాత్రం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.  

- రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. పాఠశాల అభివృద్ధి పనులకుగాను రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. మరుగుదొడ్లు, రక్షణ గోడ పనులు అరకొరగా సాగుతున్నాయి.  

- నరసన్నపేటలోని దేశవానిపేట పాఠశాలలో అరకొరగానే నాడు-నేడు పనులు జరిగాయి. బాలికల మరుగుదొడ్లకు సంబంధించి ఇప్పటికీ పైకప్పులు వేయలేదు. దీంతో పాఠశాలకు హాజరైన విద్యార్థినులు అసౌకర్యానికి గురయ్యారు. పాఠశాల మైదానం లోతుగా ఉండడంతో వర్షపు నీరు చేరింది. బురదమయంగా మారింది. 

- ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని 12 పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులకు ప్రభుత్వం రూ.4.69 కోట్లు మంజూరు చేసింది. కానీ చాలాచోట్ల పీఎంసీ కమిటీల పేరిట అధికార పార్టీ నాయకులే పనులు చేస్తున్నారు.  చాలావరకూ పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆమదాలవలస లక్ష్మీనగర్‌ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా గదులు లేవు. పైపైనే రంగులు అద్దినట్టు ఆరోపణలున్నాయి. 

- కాశీబుగ్గ ఉన్నత పాఠశాలకు ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా రూ.1.16 కోట్లు మంజూరు చేశారు. కేవలం నాలుగు గదులను మాత్రమే పూర్తిచేశారు. మిగతావి పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫ్లోరింగ్‌ పనులు జరగలేదు. స్టోర్‌ రూమ్‌కు బయట మాత్రమే రంగులు వేసి మరమ్మతులు చేశారు. ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా ఉంది. 

- రణస్థలం ప్రాథమికోన్నత పాఠశాలకు నాడు-నేడు పథకంలో భాగంగా మౌలిక వసతులకు రూ.11.60 లక్షలు మంజూరు చేశారు. రూ 2.50 లక్షలతో శుద్ధ జల ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా..ఇంతవరకూ వినియోగంలోకి తేలేదు. దీంతో విలువైన పరికరాలు మూలకు చేరాయి.   

- లావేరు జడ్పీ ఉన్నత పాఠశాలకు ‘నాడు-నేడు’కు రూ.30 లక్షలు మంజూరయ్యాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు సక్రమంగా పూర్తికాలేదు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభమైనా భవనాలు అందుబాటులోకి రాలేదు.

- భామిని మండలంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవనాలు దయనీయంగా ఉన్నాయి.  బొడ్డగూడ పాఠశాలకు భవనం లేదు. మూడేళ్ల కిందట భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగించారు. బురుజోల ప్రాథమిక పాఠశాలదీ అదే పరిస్థితి. తొలుత పాఠశాలకు నిధులు మంజూరు చేసినా.. తరువాత వేరే చోటుకు మళ్లించారు. భామిని పాఠశాల ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉంది. చెంతనే కాలువలు ఉండడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.  

- జలుమూరు ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. గదులు లేకపోవడంతో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఒక గది, వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్న గదులను నేలమట్టం చేసి ‘నాడు-నేడు’ పనులు ప్రారంభించగా, నేటికీ పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చొవాల్సి వస్తోంది.  గత ఏడాది రూ.89 లక్షలు నాబార్డు నిధులు మంజూరైనా, పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాలేదు. దీంతో ఈ పనులను ఈ ఏడాది ‘నాడు-నేడు’ కింద మార్పు చేసి తల్లిదండ్రుల  కమిటీకి అప్పగించారు. నేటికీ పూర్తికాలేదు. దీనిపై హెచ్‌ఎం సీహెచ్‌ గోవింద వద్ద ప్రస్తావించగా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే తరగతిలో బోధిస్తున్నట్టు చెప్పారు. పాఠశాలను మరోచోట నిర్వహించేందుకు డీఈవో అనుమతి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. 

Updated Date - 2021-08-22T05:17:26+05:30 IST