బార్లీ జావ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ABN , First Publish Date - 2022-05-13T18:26:39+05:30 IST

బార్లీ గింజలలో చాలా పోషకపదార్థాలు ఉంటాయి. 100గ్రా ఉడికించని బార్లీలో 350 క్యాలరీలు, 75గ్రాముల పిండి పదార్థాలు, 13గ్రా ప్రొటీన్లు, 17గ్రా పీచు పదార్థాలు ఉంటాయి

బార్లీ జావ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఆంధ్రజ్యోతి(13-05-2022)

ప్రశ్న: బార్లీ జావ అన్ని కాలాలలో కూడా తాగవచ్చా? ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?


- డా. విజయసాగర్‌, నరసరావుపేట 


డాక్టర్ సమాధానం: బార్లీ గింజలలో చాలా పోషకపదార్థాలు 100గ్రా ఉడికించని బార్లీలో 350 క్యాలరీలు, 75గ్రాముల పిండి పదార్థాలు, 13గ్రా ప్రొటీన్లు, 17గ్రా పీచు పదార్థాలు ఉంటాయి. కేవలం 2 గ్రాములు కొవ్వులు ఉండడం విశేషం. బార్లీలో శరీరానికి శక్తిని అందించే బి విటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, సెలీనియం లాంటి ఖనిజాలూ ఎక్కువే. బార్లీని నీళ్లలో ఉడికించి జావగా కాస్తే, గింజలలోని కొన్ని పోషకపదార్థాలు ఆ జావ(బార్లీ నీళ్ల)లోకి చేరతాయి. జ్వరం ఉన్నప్పుడు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక పీచు పదార్థాలు తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న బార్లీ నీళ్లు తాగాలని చెబుతారు. 


కానీ జ్వరం లేనప్పుడు వట్టి నీళ్లను తాగడం కంటే ఉడికించిన బార్లీ గింజలనే అన్నానికి బదులుగా కానీ, గింజలు తొలగించని జావ అల్పాహారంగా కానీ తీసుకోవచ్చు. ఈ గింజలలో అధిక మోతాదులో ఉండే బీటాగ్లూకాన్‌ అనే పీచుపదార్థం చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది, పెద్ద పేగులలో మంచి బాక్టీరియా వృద్ధికి ఉపయోగపడుతుంది. ముడి బార్లీ గింజలలో ఉండే విటమిన్‌, బీటా కెరొటిన్‌, ల్యూటిన్‌, జియాగాంగ్టిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు జీవకణాల మరమ్మతులకు దోహదం చేస్తాయి. కాబట్టి ఉడికించిన బార్లీ గింజలను అన్ని వయస్సుల వారు తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Read more