ఏం తమాషా చేస్తున్నారా..!

ABN , First Publish Date - 2021-12-05T07:10:28+05:30 IST

ఏం తమాషాలు చేస్తున్నారా.. కొమ్ములేమైనా వచ్చాయా.. అంటూ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఆర్‌సీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం తమాషా చేస్తున్నారా..!
స్థాయీ సంఘం సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి

ఆర్‌సీవోల భాగోతం మొత్తం బయటపెడతాం 

నిరుపేద విద్యార్థులను పట్టించుకోవడంలేదు 

డబ్బులు తీసుకొని ఫైరవీకారులకు కొమ్ముకాస్తున్నారు

జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ తీవ్ర ఆగ్రహం 

నల్లగొండ, డిసెంబరు 4: ఏం తమాషాలు చేస్తున్నారా.. కొమ్ములేమైనా వచ్చాయా.. అంటూ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి ఆర్‌సీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో పలు స్టాండింగ్‌ కమిటీల సమావేశాలు  శనివారం నిర్వహించారు. 6వ స్థాయీ సంఘం సమావేశం సమయంలో సాంఘీక సంక్షేమశాఖ, గురుకులాల పనితీరుపై సమీక్ష జరుగుతుండగా ఎస్సీ, బీసీ గురుకులాల ఆర్‌సీఓ (రీజినల్‌ కోఆర్డినేటర్‌)లు గైర్హాజరుకావడంతో పలువురు సభ్యులతోపాటు చైర్మన్‌ నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. జడ్పీ స్టాండింగ్‌ కమిటీలు, జనరల్‌ బాడీ సమావేశాలకు హాజరుకారని, నిరుపేద విద్యార్థులను పట్టించుకోరన్నారు. డబ్బులు తీసుకొని ఫైరవీకారులకు కొమ్ము కాస్తారు తప్ప ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోరని చెప్పారు. మీ మొత్తం భాగోతం బయటపెడతానని, అవసరమైతే కలెక్టర్‌కు, గురుకులాల సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మూడుసార్లు సమావేశాలకు రాలేదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు నిరుపేద విద్యార్థులకు సీటు కేటాయించమని కోరితే అనేక నిబంధనలు పెడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని, అదే కొందరు విద్యార్థి సంఘాల నేతలు వెళితే రూ.15వేల వరకు తీసుకొని సీట్లు కేటాయిస్తున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ అంశంపై కలెక్టర్‌కు లేఖరాయాలంటూ జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారికి సూచించారు. 


గురుకులాల ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు

సీట్లు అమ్ముకుంటూ కొందరు ఆర్‌సీవోలు గురుకులాల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు ఆర్‌సీవోలకు లేఖలు పంపిస్తే స్పందించడంలేదని, అదే ఇతర అక్రమ మార్గాల ద్వారా మాత్రం సీట్లు కేటాయిస్తున్నారని హెచ్చరించారు. 6వ స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ నారబోయిన స్వరూపరాణి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలను ఎన్నిసార్లు తనిఖీలు చేసినా వారిలో మార్పు రావడం లేదన్నారు.  


రైతులు ఆందోళనకు  గురికావొద్దు: ఎమ్మెల్యే భాస్కర్‌రావు 

జిల్లాలో సన్న రకం ధాన్యం ఎంత దిగుబడి వచ్చినా జిల్లాలోని మిల్లర్ల ద్వారా కొనుగోళ్లు చేయిస్తానని, అవసరమైతే ఏపీలోని మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేయిస్తానని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చ జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సన్నరకం ధాన్యం వైపు రైతులు మొగ్గుచూపుతున్నారని అయితే ప్రభుత్వం పేర్కొన్న విధంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. జడ్పీ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఇరుగు పెద్దులు, 5వ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ కంకణాల ప్రవీణ, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, సీఈవో వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T07:10:28+05:30 IST