Abn logo
Feb 12 2020 @ 01:37AM

బీజేపీకి ‘ఢిల్లీ’ ప్రశ్నలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కనీవినీ ఎరుగని స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్న ముస్లిం ఓటర్లూ, హిందూ ఓటర్లూ కలిసికట్టుగా బిజెపిని ఎందుకు తిరస్కరించారు? షాహిన్ బాగ్‌నూ పాకిస్థాన్‌తో పోలుస్తూ చేసిన ప్రకటనల్ని ప్రజలు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? హిందూత్వ భావనలకు బిజెపి మాత్రమే ప్రతినిధి అని ఓటర్లు ఎందుకు భావించలేదు? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చగల ఏకైక నేత అని, ఢిల్లీని ఆయనకు అప్పగిస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఢిల్లీ ప్రజలు ఎందుకు అనుకోలేదు?

‘ఆయన మూడ్ బాగా లేదు.. మీరు ఆయనను కలుసుకుంటే మీరు కోరుకున్న సమాధానం రాకపోవచ్చు. ఇప్పట్లో కలుసుకోకపోవడమే మంచిది..’ అని గత ఆదివారం హోంమంత్రి అమిత్ షా కార్యాలయ అధికారి ఒకరు అమరావతి నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు చెప్పడంతో వారు ఉసూరుమని తిరిగి వెళ్లిపోయారు. ‘నేను ఇప్పుడు వేరే పనుల్లో బిజీగా ఉన్నాను. తర్వాత ఎప్పుడైనా కలుద్దాం..’ అని ఆయన తనకు ఫోన్ చేసిన ఒక ఎంపీకి కూడా చెప్పినట్లు తెలిసింది. శనివారం నాడు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు తెలియగానే అమిత్ షా మూడ్ చెడిపోయినట్లు అర్థమవుతోంది. దీంతో ఆదివారం ఆయన కేంద్రమంత్రుల్నీ, పార్టీ ఎంపీల్నీ, సీనియర్ నేతలను తన ఇంటికి పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

తామెంత కష్టపడ్డా ఫలితాలు ఆమ్ ఆద్మీపార్టీకి అనుకూలంగా ఎలా వస్తున్నాయన్న విషయంపై వారు తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. అన్నిటికన్నా మించి బిజెపికి అనుకూలంగా విపరీతంగా వ్యాఖ్యానాలు గుప్పించే రిపబ్లిక్ టీవీ, స్టార్ ఏబిపి, టైమ్స్ నౌ ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా బిజెపి పరాజయం చెందుతున్నట్లు తేలడంతో వారు దిగ్భ్రాంతులయ్యారు. అయినా ఇవి ఎగ్జిట్ పోల్స్ కాని, ఎగ్జాట్‌ పోల్స్ కాదని, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారు సాయంత్రం నాలుగు గంటలవరకు వచ్చిన సమాచారం పైనే ఆధారపడ్డారని బిజెపి నేతలు తమలో తాము అనుకుని సంతృప్తి చెందారు. నిజానికి ఢిల్లీలో బిజెపి ప్రభంజనం వీస్తుందని అమిత్ షా ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రకటించారు.

తాము 55 సీట్లు గెలుచుకుంటామని బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఓట్ల లెక్కింపు ఘట్టం ప్రారంభమయ్యే ముందు కూడా చెప్పుకున్నారు. కాని ఢిల్లీ ప్రజలు బిజెపి పరాజయాన్ని ముందే తమ మనసుల్లో ముద్రించుకున్నారన్న విషయం ఆ పార్టీ నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకూ గ్రహించలేకపోయారు. గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడినప్పుడు పెద్ద సంఖ్యలో హాజరై మాటిమాటికీ హర్షధ్వానాలు చేసిన బిజెపి ఎంపిలు మంగళవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై చర్చకు సమాధానమిస్తున్నప్పుడు అంత పెద్ద సంఖ్యలో కనపడలేదు సరికదా వారి ముఖాలు వెలవెలబోయినట్లు కనపడ్డాయి. పార్టీ వ్యూహకర్త అమిత్ షా సభలో కనపడకపోగా మోదీ గంభీరమైన ముఖంతో తప్పనిసరై వచ్చినట్లు కనపడ్డారు.

ఈ ఎన్నికల ఫలితాలగురించి బిజెపి నేతలు ప్రజలను తప్పు పట్టేందుకు ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే సరిగ్గా 8 నెలల క్రితమే ప్రజలు ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లను బిజెపికి కట్టబెట్టారు. కాని ఈ 8 నెలల్లో ఏ పరిణామాలు జరిగాయని వారు బిజెపిని అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారు? ఢిల్లీ ఎన్నికల్లో బిజెపికి సరైన ప్రత్యామ్నాయం ఉన్నది కనుక వారికి బిజెపిని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేకపోయింది. బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం కనపడితే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక ఏడాదిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీలు సరిగా పనిచేస్తే జాతీయ పార్టీల కంటే వాటికే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారని, భారత దేశం నిజమైన ప్రజాస్వామ్య సమాఖ్య దేశమని ప్రజలు భావిస్తారని కూడా దాదాపు తేలిపోయింది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో ప్రజలు వెలిబుచ్చే అభిప్రాయం దేశ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనడంలో కొంత వాస్తవం లేకపోలేదు. దేశంలో ఎక్కడైనా మోదీ పేరుతోనే ఎన్నికలు గెలుచుకోగలమని, స్థానిక నాయకుల అవసరం అంతగా లేదని భావించే బిజెపి ఆలోచనా విధానంలోనే పొరపాటు ఉన్నదని స్పష్టమైంది. అన్నిటికన్నా మిన్నగా పూర్తిగా హిందూత్వ వాదాన్ని ప్రయోగించి దేశవ్యాప్తంగా అధికారాన్ని సొంతం చేసుకోగలమనే అభిప్రాయం లోపభూయిష్టమైనదని అర్థమవుతున్నది.

బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి అమిత్ షా జనవరి 20 రోజున తప్పుకుని ఉండవచ్చు కాని ఢిల్లీ ఎన్నికల వ్యూహరచన పూర్తిగా ఆయన చేతుల మీదుగానే సాగిందని బిజెపి నేతల్ని ఎవర్ని అడిగినా చెబుతారు. జరిగింది ఒక రాష్ట్ర ఎన్నికలైనా బిజెపి నేతలు సార్వత్రక ఎన్నికలు జరుగుతున్నంత సీన్‌ను ఢిల్లీలో సృష్టించారు. మొత్తం హిందూ జాతీయవాదాన్ని ఎన్నికల ఎజెండాగా ప్రవేశపెట్టారు. కేవలం 70 చిన్న చిన్న అసెంబ్లీ సీట్లలో గెలిచేందుకు బిజెపి ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, దాదాపు 250 మంది పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, చిన్నాచితకా నేతల్ని, వేలాది కార్యకర్తల్ని రంగంలోకి దించారు.

అమిత్ షా స్వయంగా ఇంటింటికీ ఒక సామాన్య కార్యకర్తగా తిరిగారు. వందలాది బూత్ కమిటీల సభ్యులతో మాట్లాడారు. రాత్రి పొద్దు పోయేవరకూ నిద్రాహారాలు మాని వ్యూహరచన చేశారు. ఢిల్లీ ఓటర్లను మత ప్రాతిపదికగా విడగొట్టేందుకు తీవ్ర యత్నాలు చేశారు. జామియా, జెఎన్‌యులో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల దాడులు, షాహిన్ బాగ్ ప్రదర్శనపై తీవ్ర వ్యాఖ్యలు, పౌరసత్వ చట్టంపై తీవ్ర స్థాయిలో ప్రచారం వంటివి జరిగాయి. అమిత్ షా దాదాపు 50 సభల్లో ప్రసంగిస్తే మోదీ రెండు భారీ ర్యాలీల్లో ప్రసంగించారు. ఇద్దరి ప్రసంగాలు అధికంగా 370 అధికరణ రద్దు, త్రిపుల్ తలాఖ్, సీఏఏ, రామమందిర నిర్మాణంపైనే కేంద్రీకృతమయ్యాయి.

ఢిల్లీ ఎన్నికలు షాహిన్ బాగ్ ప్రదర్శన భవిష్యత్‌ను తేల్చేస్తాయని వారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఎంపిలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి ఉభయ సభల్లో చేసిన ప్రసంగం టైమింగ్‌ను కూడా ఢిల్లీ ఎన్నికల సమయంలోనే నిర్ణయించారనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రసంగంలో ప్రధాని పౌరసత్వ చట్టంపై మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఆఖరుకు రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటు గురించి మోదీ స్వయంగా లోక్‌సభకు వచ్చి గంభీరంగా ప్రకటన చేసేందుకు స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా కొద్ది సేపు వాయిదా వేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇవేవీ ఓటర్లపై ప్రభావం చూపలేదు.

మరి అమిత్ షా, మోదీ ఇంత తీవ్ర స్థాయిలో వోటర్లను మత ప్రాతిపదికగా చీల్చేందుకు ప్రయత్నించినా ఓటర్లు ఎందుకు చీలిపోలేదు? పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కనీవినీ ఎరుగని స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్న ముస్లిం ఓటర్లూ, హిందూ ఓటర్లూ కలిసికట్టుగా బిజెపిని ఎందుకు తిరస్కరించారు? షాహిన్ బాగ్‌నూ పాకిస్థాన్‌తో పోలుస్తూ చేసిన ప్రకటనల్ని ప్రజలు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? హిందూత్వ భావనలకు బిజెపి మాత్రమే ప్రతినిధి అని ఓటర్లు ఎందుకు భావించలేదు? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చగల ఏకైక నేత అని, ఢిల్లీని ఆయనకు అప్పగిస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఢిల్లీ ప్రజలు ఎందుకు అనుకోలేదు? తాను సారథ్యం వహించే ప్రతి ఎన్నికల పోరాటాన్ని అదే చివరి ఎన్నికల పోరుగా భావించి హోంమంత్రి అమిత్ షా చెమటోడ్చి గల్లీ గల్లీ తిరిగి ప్రసంగాలు చేసినా ప్రజలు ఆయనను ఎందుకు పట్టించుకోలేదు? బిజెపి వేసిన బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, కోర్ కమిటీల సభ్యులు, పన్నా ప్రముఖ్‌లూ, వివిధ రాష్ట్రాలనుంచి దిగిన వేలాది కార్యకర్తలు ఓటర్లను బిజెపికి ఎందుకు అనుకూలంగా మార్చలేకపోయాయి?

ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సింది బిజెపి నేతలే అని వేరే చెప్పనక్కర్లేదు. ముస్లింలు సంఘటితంగా ఓటు వేశారు కాని, హిందువులు సంఘటితంగా లేరు అని వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్ బుక్కుల్లోనూ వాపోతే సరిపోదు. దేశమంతా తమలాగా ఆలోచిస్తున్నదని, తమ మాదిరే ప్రజలు కూడా ఆలోచించి బిజెపికి ఓటు వేస్తారని భావించడానికి వీలు లేదు. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది తమ జీవన పరిస్థితులను మెరుగుపరచడానికేనని, తమ ఆలోచనలకూ, ప్రజల ఆలోచనలకూ మధ్య వైరుధ్యం ఉన్నదని గ్రహించకపోతే బిజెపి భవిష్యత్‌లో జరిగే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి దిగ్భ్రాంతి చెందాల్సి ఉంటుంది.

కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, త్రిపుల్ తలాఖ్, పౌరసత్వ చట్టం, రామమందిర నిర్మాణానికి సన్నాహాలు వెంటవెంటనే చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అవి బిజెపికి పెద్దగా ఉపయోగపడినట్లు కనపడలేదు. బహుశా వీటన్నిటినీ వరుసగా కాకుండా సరైన రాజకీయ సమయంలో చేసి ఉంటే కొంత ఫలితం ఉండేదేమో. ఒకే సారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిజెపికి ఇలాంటి ఎజెండానే తప్ప మరే ఎజెండా లేదేమో అన్న అభిప్రాయం కూడా ప్రజలకు వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి అభిప్రాయం ఏర్పడిన తర్వాత అభివృద్ది గురించి ఎన్ని ఉపన్యాసాలిచ్చినా, ఎంత సుదీర్ఘంగా బడ్జెట్ కాగితాల్ని చదివినా ఫలితం ఏముంటుంది?

అటల్ బిహారీ వాజపేయికీ, లాల్ కృష్ణ ఆడ్వాణీలకు మధ్య వ్యత్యాసాన్ని చూసినట్లే నరేంద్రమోదీకీ, అమిత్ షాకు మధ్య అంతరాన్ని వ్యత్యాసం చూస్తున్నారనిపిస్తోంది. గత ఎన్నికల వరకు అమిత్ షా కేవలం పార్టీ అధ్యక్షుడుగా, వ్యూహకర్తగా మాత్రమే రంగంలో దిగారు. 2019 ఎన్నికల తర్వాత అమిత్ షా హిందూత్వ విధానాలకు ప్రతీకగా మారారు. ఈ దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన హోంమంత్రిగా కంటే బిజెపి మత పరమైన ఎజెండాను అమలు చేసే నేతగానే ఆయన ఎక్కువ గుర్తింపు పొందారు. దీని వల్ల నరేంద్రమోదీ ఏదైనా అభివృద్ది చేసి ఉన్నాసరే అది ఈ ప్రచారం వెనుక మరుగున పడిపోయింది. మోదీకూడా అమిత్ షా బాటన నడిచే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని సరిదిద్దుకుని అభివృద్దికీ, ఎజెండాకూమధ్య సమతుల్యత పాటించకపోతే బిజెపి మళ్లీ పూర్వపు దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందనడం కంటే, తనను తాను ఓడించుకుని కేజ్రీవాల్ గెలుపునకు కారణమైందనే చెప్పాలి. దేశంలో తన బలం ఎక్కడో బలహీనత ఎక్కడో గ్రహించుకునే స్థితి కాంగ్రెస్‌కు ఇప్పుడిప్పుడే వస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నదని, ప్రాంతీయ పార్టీలకు అంత విలువనివ్వక్కర్లేదని కాంగ్రెస్ భావించి విర్రవీగితే ఆ పార్టీ కోలుకునే పరిస్థితి దరిదాపుల్లో ఉండదు. ఒకప్పుడు మొత్తం 545 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలిగిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం సగం స్థానాల్లో కూడా సరైన అభ్యర్థులను నిలబెట్టగలిగిన స్థితిలో లేదు. బిజెపితో ముఖాముఖి పోటీపడగలిగిన సీట్లు కనీసం 200 కూడా లేవు.

ఈ 200 సీట్లలో దృష్టి కేంద్రీకరించి బిజెపిని బలంగా ఎదుర్కొని మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీల విజయానికి వ్యూహాత్మకంగా తోడ్పడితే తప్ప జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశాలు లేవు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఏర్పడడం, వాటి నేతలు తమ ఓటు బ్యాంకులేమిటో గ్రహించి అందుకు తగ్గట్లుగా వ్యూహరచన చేసుకోవడం, స్థానిక అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుండడంతో జాతీయ పార్టీలకు వాటిని ఎదుర్కోవడం అంత సులభంకాదని ఢిల్లీ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి.స్థూలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను సూచిస్తున్నాయనడంలో సందేహం లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement