ఒక కవిత ఏం చేయగలదు?

ABN , First Publish Date - 2021-07-12T05:51:00+05:30 IST

ఒక కవిత ఒక ప్రాణిని కాపాడదు ఒక్క ఉదుటున ‘‘హల్క్‌’’లా భయంకరంగా ఇంతై ఇంతింతై పెరిగి పెరిగి కటిక చీకట్లో ఇరుకువీధిలో...

ఒక కవిత ఏం చేయగలదు?

ఒక కవిత ఒక ప్రాణిని కాపాడదు

ఒక్క ఉదుటున ‘‘హల్క్‌’’లా భయంకరంగా

ఇంతై ఇంతింతై పెరిగి పెరిగి

కటిక చీకట్లో ఇరుకువీధిలో రౌడీల దాడి ఆపదు.


నీ అబలత్వం నీ పేదతనం నీ చర్మంరంగూ

మార్చి వేసి నిన్ను వాళ్ళతో సరి సమానం

చెయ్యలేదు నీ కవిత.


ఒక కవిత

ఒక తుపాకీ గుండు ఆపలేదు

ఒక బాంబు పేలకండా ఆపలేదు

నీ ఇంటిగుమ్మంలో ‘‘ఎకె-47’’ చేసే బీభత్సం

ఆపలేదు


నీ చేతిలో కవితతో సహా

నువ్వు వెయ్యబోయే ఆ ఒక్క అడుగూ

నీ ఆఖరి అడుగు కావచ్చు.


ఒక్క పేలుడు చాలు

నీ కవిత ఉన్న కాగితం దుమ్ము కణాలై

పొగలో కలిసే ఉపమానాలు

మరిచిపోయే రూపకాలు.


ఒక కవిత గడిచిన కాలాన్ని వెనక్కి తిప్పదు

చేసిన తప్పులని చెరిపేయదు

జ్ఞాపకాలని

కత్తిరించి కాపీ చేసి అతికించదు

ఒక కవిత చరిత్రలో భయానక దృశ్యాలని

తొలగించదు, కానీ 


ఒక కవిత ప్రేమించగలదు

ఒకే సమయంలో

నీ చేతితో చెయ్యికలిపి చెట్టాపట్టాల్‌ వెయ్యగలదు 

నిన్ను తిట్టనూ గలదు


ఒక కవిత నీ అసత్యాల గూటిని చీల్చగలదు

ఒక కవిత నిన్ను సీతాకోకచిలుకగా మార్చగలదు

ఎగిరే ఈగలా మాత్రం కాదు

నువ్వు ఇప్పటికే ఎగురుతున్నావు, కానీ

ఒక కవిత నిన్ను హాయిగా గాలిలో తేలుస్తుంది

నువ్వు జాగ్రత్తగా అడుగులు వేసే అవసరం లేదు


ఒక కవిత నిన్ను నీకే పరిచయం చేయగలదు

నిశ్శబ్దంగా.

దాచినవి నిషేధించబడ్డవీ

కనుగొనడంలో నీకు సాయం చేయగలదు ఒక కవిత


ఒక కవిత కొన్నిసార్లు అద్దంలా

నీ కంటిలో పొరనీ నీ ధ్యేయాన్నీ చూడటానికి

సాయపడుతుంది


మరొక్కసారి ఆలోచిస్తే

ఒక కవిత ఒక జీవితాన్ని కాపాడుతుంది

మీ ముత్తాత గుసగుసలాడుతూ

చెప్పిన తెలివైన భాషణలలా

శ్రుతుల్లో నిబిడీకృతతత్వంలా 


ఒక కవిత 

ఒక తుపాకీ గుండుని ఆపదు

కానీ, ద్వేషాన్ని మింగి

ఒక సీసంలాగా 

తిరిగి దూసుకొపోయే

శబ్దతరంగఘోషలా


అప్పుడు

ఆ గదిలో ఉల్లేఖనాలన్నీ బుడగల్లా తేల్తాయి

బూచులూ భూతాలూ రౌడీలూ గూండాలూ 

      వ్రేళ్ళు విరుచుకొని

తలలూపుతారు, వ్రాసిన కవిత చెప్పేమాటలకి.

ఇది విడ్డూరం; ఇది వక్రోక్తి!


కలం కత్తి కంటే శక్తివంతమైనదని వాళ్ళంటారు

కానీ మా పేటలో రచయితలు బహుకొద్దిమంది

యోధులే ఎక్కువమంది

రాత్రింపగళ్ళుపనిలేక తిరిగే పనికిమాలినవాళ్ళూ

డ్రాపౌట్లూ-

గిరగిరతిరిగే నీలం ఎరుపు రంగులు

మా పేటలో పహరా కాస్తూంటాయి ఎల్లప్పుడూ

మాపై నేరారోపణ చేస్తూ.


నా పేటలో ఎక్కువ మంది 

రచయితలే ఉంటే--

మీ పేటలో ప్రతి వీధిలో ప్రతి సందులో ప్రతి కూడలిలో

న్యాయమందిరంలో శాసనసభలో రాజధానిలో

వాళ్ళందరూ పేజీలపై సిరా చిందించి

వాళ్ళ అంతర్హృదయాలని విప్పి

ఒకటో రెండో కవితలు

రాయడానికి ఒప్పుకొని ఉంటే 

మనం ఎక్కడ ఉంటామో అని ఆశ్చర్యపడతాను, నేను

ఈ జనానికి ఒక్క కవిత ఎంత సాధించగలదో అని!

మూలం:  డేరియస్‌ వి. డాత్రీ

అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు


Updated Date - 2021-07-12T05:51:00+05:30 IST