Abn logo
Apr 6 2021 @ 00:30AM

ఏమి సాధిస్తారు?

శనివారం నాడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్-–సుక్మా జిల్లాల సరిహద్దుల్లో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు మాటువేసి చేసిన హంతకదాడి గురించి ఇంకా పూర్తి సమాచారం అందవలసే ఉన్నది. దండకారణ్యంలోని లోతట్టు ప్రాంతం కావడం, భద్రతాదళాలు 22 మంది, తెలియని సంఖ్యలో మావోయిస్టులు మరణించడం కారణంగా, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితితో సంఘటన పూర్వాపరాల గురించిన వివరాలు తెలియడం లేదు. మావోయిస్టులు పక్కా పథకం రచించి, తమకు పూర్తి సానుకూలమైన భౌతిక నైసర్గిక పరిసరాలలో ఈ ఊచకోత నిర్వహించారని అర్థమవుతున్నది. భద్రతాదళాలు వారిని ఏ మేరకు ప్రతిఘటించగలిగాయి, ఏకపక్ష దాడి కాకుండా ప్రతిఘటన ఉండి ఉంటే అది ఎట్లా జరిగింది మున్ముందు తెలుస్తాయి. తీవ్ర సంచలనం, దిగ్ర్భాంతి కలిగించే ఇటువంటి దాడి ద్వారా మావోయిస్టులు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు, మావోయిస్టుల సవాల్ పై ప్రభుత్వ ఆలోచనావిధానం ఎట్లా ఉన్నది- ఇప్పుడు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. 


ప్రాణనష్టం ఎవరికి జరిగినా బాధాకరమే. తమ సహచరులను భద్రతాబలగాలు హతమార్చినప్పుడు న్యాయాన్యాయాల చర్చతో దాన్ని నిలదీసే మావోయిస్టులు ఇప్పుడీ హత్యాకాండను ఏ రీతిగా సమర్థించుకోగలరు? ఇద్దరు తెలుగు యువజవాన్లతో సహా, మృతులందరూ పేద కుటుంబాల నుంచి వచ్చి పోలీసు విధులు నిర్వహిస్తున్నవారే. మావోయిస్టులు చెబుతున్న సిద్ధాంతాలు ఆశయాలు వారికేమీ తెలియవు. తమ విధినిర్వహణ మాత్రమే వారికి తెలుసు. ఎంతో జీవితం ముందున్న ఈ యువకులను చంపి మావోయిస్టులు సాధించేదేమిటి? 


ఛత్తీస్‌గఢ్‌ను స్థావరంగా చేసుకుని మావోయిస్టులు, తమను కనిపెట్టడానికి వచ్చే భద్రతాదళాలపై దాడులు చేస్తున్నారు. దట్టమైన దండకారణ్యం నడిమధ్యన కొంత ప్రాంతం మావోయిస్టుల పూర్తి అధీనంలో ఉన్నదని, వారే అక్కడ తమ పద్ధతిలో ప్రభుత్వం నడుపుతున్నారని దానిని ప్రత్యక్షంగా చూసి వచ్చిన జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు రాశారు. మావోయిస్టుల ఆశయాలతో తాము కూడా ఏకీభవిస్తామని ఎన్టీయార్ దగ్గరి నుంచి కేసిఆర్ దాకా అందరూ అంటూ వచ్చారు. కానీ, వారి పద్ధతులతో అందరూ ఏకీభవించరు. సామాజిక పరివర్తన కోసం విశాల ప్రజానీకాన్ని సంఘటితం చేసి, రాజకీయంగా చైతన్యపరచాలి కానీ, అడవులలో దాక్కొని, కొద్దిమంది సాయుధ దళాలతో, కొంత ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల సాధించే శాశ్వత ఫలితాలేమిటి? గుణపాఠం చెబుతామని, ప్రతీకారం తీర్చుకుంటామని, సమూలంగా తుడిచిపెడతామని హత్యాకాండ అనంతరం ప్రభుత్వం చెబుతున్నమాటలు కూడా నిర్మాణాత్మకమైనవి కావు. సంఘటన తీవ్రత కారణంగా ఆవేశకావేశాలు పోలీసు సిబ్బందిలోను, మృతుల కుటుంబసభ్యులలోను ఉండవచ్చును కానీ, ప్రభుత్వానికి క్షణికావేశాలు ఉండకూడదు. నక్సలైట్ ఉద్యమం పుట్టి ఇప్పటికి యాభైసంవత్సరాలు దాటింది. అనేక పర్యాయాలు ప్రభుత్వం ఆ ఉద్యమంపై తీవ్ర అణచివేత అమలుచేసింది. కొన్నిసందర్భాలలో నక్సలైట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని, ఇక ఆ ఉద్యమం ముగిసినట్టే అనుకున్నారు. కానీ, అట్లా జరగకపోగా దేశవ్యాప్తం అయింది. అణచివేత కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యక్రమాలు దాదాపు లేకుండా పోయాయి కానీ, ఛత్తీస్ గఢ్, ఆంధ్ర–-ఒరిస్సా సరిహద్దు అరణ్యాలు వారికి ఇప్పటికీ స్థావరాలుగా ఉన్నాయి. ఖండించినా, కొత్తగా మొలకలెత్తుతున్న సమస్య మూలాలను గుర్తించి, పరిష్కరించాలి కానీ, కన్నుకు కన్ను తరహాలో ప్రతిజ్ఞలు చేయడం మావోయిస్టుల మార్గాన్ని అనుసరించడమే అవుతుంది 


మావోయిస్టుల ఉనికి కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలన్నిటికి మూలం రాజకీయాలలో, పరిపాలనలో ఉన్నది. రాజకీయ వైఫల్యాల కారణంగా తీవ్ర ఆచరణలను కోరే ఉద్యమాలు వస్తాయి. నాయకుల వైఫల్యాలను పోలీసులు, భద్రతాబలగాల ద్వారా తుడిచిపెట్టలేము. మావోయిస్టుల వంటి వారికి ఆదరణ ఇవ్వవలసిన పరిస్థితి స్థానిక ప్రజలకు ఎందుకు వస్తున్నదో గుర్తించి, వారిని గెలుచుకోగలిగితే ఫలితాలు సాధించవచ్చు.


ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ఈ మధ్య మావోయిస్టులు ప్రకటించారు. అయితే, దండకారణ్యం నుంచి భద్రతాదళాలను ఉపసంహరించాలని, అన్ని రకాల గాలింపు చర్యలను నిలిపివేయాలని షరతులు విధించారు. ముఖ్యమంత్రి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నట్టుగా, ఉత్తర మధ్య భారతంలో విస్తృతమైన పౌరసమాజం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు చర్చలు జరగడానికి కారణం అనేకమంది తటస్థులు, పెద్దమనుషులు చొరవతీసుకోవడం. దేశవ్యాప్తంగా సకలరంగాలలో ఉన్న పెద్దలు ముందుకు వచ్చి, లక్షలాది మంది ఆదివాసుల జీవితాలు ముడిపడి ఉన్న సమస్య విషయంలో శాంతియుత పరిష్కార మార్గాలను అన్వేషించవలసి ఉన్నది. 


బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించేవారితో సహా, ప్రజాస్వామిక వాదులు, సమాజ హితైషులందరూ బిజాపూర్ దాడిని ఖండించవలసి ఉన్నది. ఈ తరహా సంఘటనలు ఇదే తరహాలో మరిన్ని దాడులకు దారితీస్తాయని, ఈ పరంపరలో సమాజం తన సున్నితత్వాన్ని, ఔచిత్యాన్ని కూడా కోల్పోతుందని గుర్తించాలి. ప్రజల ఆమోదాన్ని పొందే పనులు చేయడం ద్వారా మాత్రమే, ప్రభుత్వమైనా మావోయిస్టులైనా తమ ఉనికికి మన్నన పొందుతారు. గాంధీ చెప్పినట్టు, గమ్యం ఒక్కటే కాదు, గమనం కూడా ఉదాత్తంగా ఉండాలి.