గర్భిణి స్త్రీలకు మూడో నెలలో నీరసంగా ఉంటే..?

ABN , First Publish Date - 2021-07-17T21:39:48+05:30 IST

మొదటి మూడు నెలల్లో కొంత మంది గర్భిణి స్త్రీలకు ఎలాంటి ఆహారమూ సహించదు. అయినా కూడా కడుపులోని బిడ్డ సక్రమంగా ఎదగడానికి సరైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా రెండు గంటలకోసారి ఆహారం తీసుకోవడం మంచిది

గర్భిణి స్త్రీలకు మూడో నెలలో నీరసంగా ఉంటే..?

ఆంధ్రజ్యోతి(17-07-2021)

ప్రశ్న: నాకిప్పుడు మూడోనెల. కాస్త నీరసంగా ఉంటోంది. ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది?


- సుచరిత, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మొదటి మూడు నెలల్లో కొంత మంది గర్భిణి స్త్రీలకు ఎలాంటి ఆహారమూ సహించదు. అయినా కూడా కడుపులోని బిడ్డ సక్రమంగా ఎదగడానికి సరైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా రెండు గంటలకోసారి ఆహారం తీసుకోవడం మంచిది. బాగా వేడిగా కానీ చల్లగా కానీ కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న ఆహారం తీసుకుంటే కడుపులో తిప్పడం తగ్గుతుంది. రోజుకు రెండు సార్లు పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. రెండు పూటలా పప్పు ఆహారంలో భాగం కావాలి. అలాగే ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. ఒకసారి పండ్లు తప్పనిసరి. తల్లికి, బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు కలిగిన బాదం, వాల్నట్స్‌, పిస్తా పప్పు కూడా  తినడం మంచిది. నూనె, పంచదార ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా, బయట ఆహారం తినకుండా ఇంట్లో వండిన ఆహారం తినడమే సురక్షితం. ఒకవేళ ఆహారం తినకుండా ఎక్కువ సేపు ఉండవలసిన అవసరం వస్తే కొబ్బరినీళ్లు, ఏదైనా పండ్లు, మజ్జిగ లాంటివి తీసుకోవడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-17T21:39:48+05:30 IST