ఆనకట్ట కుంగుబాటుకు కారణమేమిటి?

ABN , First Publish Date - 2020-07-12T09:39:57+05:30 IST

మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ ఆనకట్ట మధ్యభాగంలో ఒకచోట కుంగిపోవడానికిగల కారణాలను ఇంతవరకు ఇంజనీరింగ్‌ నిపుణులు

ఆనకట్ట కుంగుబాటుకు కారణమేమిటి?

పటిష్టతకు పైసల కొరత


వైరా, జూలై 11: మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ ఆనకట్ట మధ్యభాగంలో ఒకచోట కుంగిపోవడానికిగల కారణాలను ఇంతవరకు ఇంజనీరింగ్‌ నిపుణులు విశ్లేషించలేకపోయారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పదేళ్ల నుంచి తరచూ రిజర్వాయర్‌ మట్టి ఆనకట్ట ఒకచోట కుంగటం, ఉపశమనం మాదిరిగా మరమ్మతులు చేయటం పరిపాటిగా మారింది. కుంగిన చోట ఆనకట్టను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరించటం లేదనే విమర్శలున్నాయి. అవసరమైన నిధులు కూడా ఇవ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో నీటిపారుదలశాఖ అధికారులు వివిధ పనులకు మంజూరైన నిధుల్లోనుంచి కొన్ని నిధులను మళ్లించి మరమ్మతులు చేయటం పరిపాటైంది. గతంలో మాదిరిగానే ప్రస్తుతం ఈ కుంగిన చోట మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు 1500మీటర్ల పొడవుతో 90ఏళ్లకు ముందు నిజాం హయాంలో రిజర్వాయర్‌ లోపల పక్క రాతి ఆనకట్ట దానికి ముందుభాగంలో సపోర్టింగ్‌గా మట్టి ఆనకట్ట నిర్మించారు.


అయితే పదేళ్ల కిందట ఈ మట్టి ఆనకట్ట 97-98-99చైన్ల మధ్య ఏడెనిమిది అడుగుల లోతు కుంగిపోయింది. 2010 సమయంలో కుంగిన మట్టి ఆనకట్ట విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్‌ అధికారులు ఇక్కడకు వచ్చి అనేక విధాలుగా పరీక్షించారు. ఆతర్వాత కుంగిన చోట బాగా లోతుగా మట్టి మొత్తాన్ని తొలగించి తిరిగి రోలింగ్‌ చేసుకుంటూ రెండు,మూడు స్టెప్పుల్లో మట్టితో నింపి పటిష్టం చేశారు. ఆ సమయంలో వైరా కాల్వల లైనింగ్‌వాల్‌ నిర్మాణం కోసం వచ్చిన నిధుల నుంచి దాదాపు రూ.60నుంచి రూ.70లక్షలు ఈ మరమ్మతులకు మళ్లించారు.


అంతే తప్ప ప్రత్యేకంగా నిధులు రాలేదు. అయితే మళ్లీ ఇదేచోట ఆనకట్ట గత ఏడాది కుంగింది. మళ్లీ హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్‌ అధికారులు వచ్చి పరిశీలించారు. ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినప్పటికీ ఈ కట్ట కుంగడానికి గల కారణాలను మాత్రం స్పష్టం చేయలేకపోయారు. కుంగిన చోట ఆనకట్ట కిందిభాగం నుంచి ఊట నీరు బయటకు వెళ్తున్నా ఊటబావులు లేక ఆనీరు బయటకు వెళ్లే పరిస్థితులు లేకుండా ఉందనే విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. 


మినీ ట్యాంక్‌బండ్‌ నిధులే మరమ్మతులకు

ప్రస్తుతం వైరా ఆనకట్టను రూ.ఐదున్నరకోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆనకట్ట కుంగిన చోట పూర్తిస్థాయి మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులివ్వటం లేదు. మినీ ట్యాంకుబండ్‌ అభివృద్ధి కోసం వచ్చిన నిధుల నుంచే కుంగిన ఆనకట్టకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న మట్టి ఆనకట్ట బరమ్స్‌ స్థానంలో మరికొన్ని బరమ్స్‌ నిర్మించి కుంగిన ఆనకట్టకు మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఈ మరమ్మత్తులు ఎంతకాలం వరకు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వాయర్‌ పటిష్టతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆనకట్ట కుంగడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి శాశ్విత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. 


ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ పి.శ్రీనివా్‌సను వివరణ కోరగా కుంగిన ఆనకట్ట వలన రిజర్వాయర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ నిపుణులు, తమ అధికారుల సలహాలు, సూచనలతో కుంగిన ఆనకట్టకు మరమ్మతులు చేసి పటిష్టం చేసే పనులు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-07-12T09:39:57+05:30 IST