దావోస్‌లో జగన్ ఏమి సాధించారు?

ABN , First Publish Date - 2022-06-01T10:08:07+05:30 IST

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో లండన్‌ మీదుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లారు. మరి అక్కడికి వెళ్లి ఆయన సాధించిందేమిటి...

దావోస్‌లో జగన్ ఏమి సాధించారు?

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో లండన్‌ మీదుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లారు. మరి అక్కడికి వెళ్లి ఆయన సాధించిందేమిటి? ఇది, ప్రజలు వేస్తున్న ప్రశ్న. రాష్ట్రంలోనే అందుబాటులో ఉండే కంపెనీల ప్రతినిధులను దావోస్‌లో కలుసుకుని ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా ఉంది. ఇండియాలో ఉండే అదే అరబిందో, అదే అదానీ, అదే గ్రీన్‌కోతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకునేందుకు. దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చు పెట్టి దావోస్ వరకు వెళ్లడం అవసరమా? కుదిరిన ఒప్పందాలు కూడా గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ గ్రీన్ కో సంస్థ కర్నూలు జిల్లాలో భారీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు నొకదాన్ని చేపట్టింది. కానీ జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా సౌర, పవన విద్యుత్తు ఒప్పందాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చెయ్యడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపొయ్యాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళకు ఇప్పుడు జగన్‌ అక్కడికి వెళ్లి పంప్డ్‌ హౌస్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభించారు. ఇప్పుడు దావోస్‌లో అదే సంస్థతో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి అంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడి అరబిందో కంపెనీతోనే దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం చేసుకొన్నారు. గ్రీన్‌ ఎనర్జీపైనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని అధికారంలోకి వచ్చాక జగన్‌ తిరగదోడారు. ఆ తర్వాత పెట్టుబడులను, ఉద్యోగాల సంఖ్యను తగ్గించి అదే అదానీ సంస్థతోనే మరో ఒప్పందం చేసుకున్నారు. గౌతమ్‌ అదానీ పలుమార్లు స్వయంగా అమరావతికి వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ పరం చేశారు. మళ్ళీ అదే అదానీ సంస్థతో దావోస్‌లో, గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. చివరికి జరిగింది, ఒరిగింది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుదుర్చుకొన్న ఒప్పందాలపై ఆరోపణలు చేసి, అధికారంలోకి వచ్చాక వాటినే తిరగతోడి, మూడేళ్ళ తర్వాత మన దేశంలో, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే అదే కంపెనీలతో దావోస్ వెళ్ళి మళ్ళీ ఒప్పందాలు కుదర్చుకుని ‘నేను దాహోస్ వెళ్ళి పెట్టుబడులు తెచ్చానని’ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు! జగన్‌రెడ్డి దావోస్‌ పర్యటనతో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయని. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ. 1.25లక్ష కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన మంత్రులు, పార్టీ నేతలు గొప్పలు చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో జగన్ రెడ్డి బృంధాన్ని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? అలా వస్తారని ఆశపడటం కూడా అత్యాశే అవుతుంది.


పెట్టుబడిదారులు పేరంటానికి వచ్చినట్లు రారని, ఒక చోట పెట్టుబడికి భరోసా ఉందని నమ్మకం కుదిరినప్పుడే మదుపులు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని అనిల్ అంబానీ ఒకసారి అన్నారు. అంతేకాదు, ఒప్పందం అన్నది మనకి ఆసక్తి ఉంది అనగానే అవతలి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి సంతకాలు పెట్టేదికాదు. ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడి సమర్థత, వ్యక్తిత్వం, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును బట్టి మాత్రమే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తారు. కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ఎందుకు వస్తారు? పీపీఏల సమీక్షల పేరుతో అందరినీ భయ బ్రాంతులకు గురిచేసి, పెట్టుబడిదారులను తరిమేశారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్పకాలంలో కాకపోయినా దీర్ఘకాలంలో అయినా ప్రయోజనం ఉంటుందని, అదీ స్థిరంగా ఉంటుందని పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించడం ప్రధానం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలిగించడం అంత సులభంగా జరిగే పనేనా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా? 24 గంటలు కరంటు ఇచ్చే పరిస్థితి ఉందా? అధ్వాన్న రహదారులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్తు వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి ఆంధ్రప్రదేశ్‌ని అంధకారం చేశారు. అందుకే 24గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని కేటీఆర్ గొప్పగా చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకుండానే ‘అక్కడ కరెంటు లేదు. నీళ్లు లేవు. రహదారులు బాగాలేవు అని’ ఆయన చెప్పారు. ఈ మాటలను కేటీఆర్ ఒక రాజకీయ సభలో మాట్లాడలేదు. క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో రియల్టర్లు, బిల్డర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ పరువు పోయిందంటే పోదూ మరి! 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆకర్షణలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది. అదే 2018–19లో తెలుగుదేశం ప్రభుత్వం 19,671 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబరు –2021 జూన్‌ మధ్యలో తమిళనాడు 30 వేల కోట్లు, కర్ణాటక 1.49 లక్షల కోట్లు, తెలంగాణ 17,709 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగా, 2019 అక్టోబర్–2021 జూన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రూ. 2,577 కోట్లు మాత్రమే ఆకర్షించింది. 2018–19లో జీవీఏ లెక్కల ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు 10.24 శాతం కాగా. 2020–21లో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు మైనస్‌ 3.26 శాతం. నమోదు అయింది. ఇది సున్నా శాతం కంటే తక్కువ. 2019 అక్టోబర్ నుంచి 2020 డిసెంబర్ మధ్య కాలంలో ఏపీకి కేవలం 1975 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్‌డిఐలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా వచ్చిన ఎఫ్‌డిఐల్లో రాష్ట్రానికి వచ్చింది కేవలం 0.32శాతం మాత్రమే. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి భయానక వాతావరణం నెలకొనడం, ప్రతిపనిలో నీకది – నాకిది అనే ఫార్ములాకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయారు. రాష్ట్రంలో గత మూడేళ్ళలో రూ.17లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. వైసిపి నాయకుల బెదిరింపులకు భయపడి పారిపోయిన పరిశ్రమలు, పెట్టుబడులను ఒకసారి పరిశీలిస్తే కియా(17) అనుబంధ పరిశ్రమలు, రూ. 2వేల కోట్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మెడ్ టెక్ జోన్, హెచ్‌సీఎల్, లూలూ కంపెనీ, రూ. 2,200 కోట్లు – 7వేల ఉద్యోగాలు, అదానీ రూ. 70వేల కోట్లు, బీఆర్ షెట్టి సంస్థలు రూ. 12వేల కోట్లు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు రూ. 50 వేల కోట్లు, రేణిగుంటలో రిలయన్స్ రూ. 15 వేల కోట్లు, వరల్ట్ బ్యాంకు రుణాలు వెనక్కి రూ. 2,100 కోట్లు, ఏషియన్ బ్యాంకు రుణాలు వెనక్కి రూ. 1,400 కోట్లు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ వెనక్కి రూ. 24వేల కోట్ల పెట్టుబడి, విశాఖ రుషికొండలోని ఐటి సెజ్‌లో 14 కంపెనీలు పరార్, మిలీనియం టవర్స్ ఖాళీ. గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి 8కంపెనీలు వెళ్లిపోయాయి.


తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానం సంతరించుకొన్నది. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు పాలనలో చూపిన సమర్థత, నిరంతర శ్రమ, సరళీకృత విధానాలు, పలు సంస్కరణలు సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి దోహదపడ్డాయి. పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి ఐదేళ్లు అన్ని విధాలా అవిరళ కృషి జరిగింది. భారత వాణిజ్య యవనికపై తనదైన ముద్రవేశారు చంద్రబాబు. ఆయన బ్రాండ్‌తోనే పెట్టుబడులు బారులు తీరాయి. ఆటోమోబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారత్‌పోర్జ్, హీరో గ్రూపు రాగా, ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసియల్, ఓల్టాస్ వంటి సంస్థలు వచ్చాయి. 


రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయటి నుంచి పెట్టుబడులు రావాలి. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు, లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు? 

యనమల రామకృష్ణుడు

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2022-06-01T10:08:07+05:30 IST