ఎందుకీ టీకాల సంబరాలు : సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2021-10-22T20:20:05+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో గొప్ప మైలురాయిని

ఎందుకీ టీకాల సంబరాలు : సిద్ధరామయ్య

బెంగళూరు : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో గొప్ప మైలురాయిని దాటినందుకు సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. భారత దేశ జనాభాలో కేవలం 21 శాతం మందికి (29 కోట్ల మందికి) మాత్రమే వ్యాక్సిన్ డోసులు రెండూ అందాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించడం లేదన్నారు. 


అక్టోబరు 21 ఉదయం 10 గంటలకు 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను ప్రజలకు ఇచ్చి, చరిత్ర సృష్టించినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సిద్ధరామయ్య శుక్రవారం ఓ ట్వీట్ ఇచ్చారు. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అనేది అలంకారప్రాయ సంఖ్యగా వినిపిస్తుందన్నారు. అయితే ఈ మహమ్మారి ఇంకా తీవ్రంగా ఉందన్నారు. దేశంలోని 139 కోట్ల మందిలో కేవలం 29 కోట్ల మందికి మాత్రమే పూర్తిగా టీకాకరణ జరిగిందన్నారు. అంటే జనాభాలో 21 శాతం మంది మాత్రమే సంపూర్ణంగా వ్యాక్సినేషన్ పొందారని తెలిపారు. బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. జనాభాలో కేవలం 21 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేసినందుకా? అని నిలదీశారు. అమెరికా జనాభాలో 56 శాతం మంది, చైనా జనాభాలో 70 శాతం మంది, కెనడా జనాభాలో 71 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్లను పొందారని చెప్పారు. భారత దేశ జనాభాలో కేవలం 21 శాతం మందికి మాత్రమే సంపూర్ణ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. సంబరాలు చేసుకోవడానికి ముందు ఉన్నత ప్రమాణాలను పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. 


కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి  అక్టోబరు 21 ఉదయం 10 గంటల వరకు ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్లు దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఓ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది 1,400 కేజీల బరువుగల భారీ ఖాదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందలాది కట్టడాలను మూడు రంగులతో ప్రకాశవంతం చేశారు. 


Updated Date - 2021-10-22T20:20:05+05:30 IST