ప్యాకెట్ పాలు వాడుతుంటారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. రోజూ పాలు తాగితే..

ABN , First Publish Date - 2021-12-22T20:37:40+05:30 IST

రోజూ పాలు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది? పాలు తాగితే జలుబు చేస్తుందని, లేదంటే లావు అయిపోతారని అంటుంటారు. కొంత మంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, మరికొంతమంది హానికరమని భయపెట్టిస్తుంటారు

ప్యాకెట్ పాలు వాడుతుంటారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. రోజూ పాలు తాగితే..

రోజూ పాలు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది? పాలు తాగితే జలుబు చేస్తుందని, లేదంటే లావు అయిపోతారని అంటుంటారు. కొంత మంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, మరికొంతమంది హానికరమని భయపెట్టిస్తుంటారు. నిజంగా పాలు తాగితే ఇలా జరుగుతుందా? పాలు విషయంలో అనేక మందికి రకరకాలైన అపోహలు, అనుమానాలు ఉన్నాయి. దీంతో అసలు రోజూ పాలు తాగొచ్చా? తాగకూడదా? ఒకవేళ తాగితే ఏ వయసు నుంచి తాగాలి. ఇలాంటి గందరగోళంపై నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం. 


పాలు తాగడం వల్ల జలుబు చేస్తుంది అనేది అపోహ మాత్రమేనని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. పాలు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది తప్ప హాని జరగదు. పైగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. పాలు తాగితే కొవ్వు పెరుగుతుంది అనడం ఏ మాత్రం నిజం కాదని తోసిపుచ్చుతున్నారు. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా కూడా ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పాలు తాగాలనే సూచిస్తున్నారు. అంటే రోజూ పాలు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్యం దరిచేరదంటున్నారు. అలాగే మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవంటున్నారు.


ఇక గర్భిణీలు పాలు తాగితే కడుపులో ఉండే బిడ్డకు కావాల్సినంత కాల్షియం సమృద్ధిగా అందుతుంది. అంతేకాదు పిండం కూడా ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇక ఏడాదిలోపు పిల్లలకు పాలు ఇవ్వకుంటేనే మంచిదంటున్నారు. పాలల్లో కొవ్వు శాతం ఉండడం వల్ల పిల్లలు జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఏడాది దాటిన పిల్లలకు పాలు ఇస్తూ ఉండాలి. పిల్లల్లో చలాకీతనం పెంచుతుంది. పేగుల్లో ఉండే క్రిమలు నశిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మంచి రక్తాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. కాకపోతే చిన్నపిల్లలకు ఆవుపాలు ఇస్తే మాత్రం త్వరగా అరుగుతాయని సూచిస్తున్నారు. పాలల్లో ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్, అయోడిన్ వంటి పోషకాలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కచ్చితమైన నిష్పత్తిలో దొరికేది పాలలోనే. కనుక రోజూ తాగడం వల్ల కండరాల పుష్టిగా ఉంటాయి. ఇక ఆవుపాలు వ్యాయామం చేసే వారికి అధికంగా మేలు చేస్తాయని చెబుతున్నారు.


పాలు తాగడం వల్ల బరువు పెరుగుపోతామనడం అపోహ మాత్రమని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. లావు తగ్గడానికి పాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. పాలల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్ బరువును తగ్గించేందుకు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే కొంత మంది ప్యాకెట్ పాలు తాగొద్దంటారు. ఇది కూడా అపోహ మాత్రమేనని తోసిపుచ్చుతున్నారు. దీంట్లో కూడా ఏ మాత్రం నిజం లేదు. డెయిరీల్లో ముందుగానే పాలను శుభ్రం చేసి కొవ్వు శాతం సమానంగా ఉండేలా చేస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతలో ఉంచి చల్లబరుస్తారు. దీంతో బాక్టీరియా చనిపోతుంది. కాబట్టి ప్యాకెట్ పాలు సురక్షితమే. వీటిలో పోషకాలు కూడా ఏ మాత్రం తగ్గవంటున్నారు. అంతేకాకుండా ప్యాకెట్‌లో వచ్చే పాలు నేరుగా కూడా తాగొచ్చని కూడా సూచిస్తున్నారు. బయట దొరికే పాలు మాత్రం వేడి చేసుకుని తాగాలని చెబుతున్నారు. ఇక షుగర్ పేషెంట్లు కూడా పాలు తాగొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. షుగర్ అనేది వృత్తి రీత్యా, లేదంటే జీవనవిధానం వల్లే వస్తుంది తప్ప పాలు తాగడం వల్ల రాదని వివరిస్తున్నారు. రోజూ పాలు తాగడం ద్వారా డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా నివారించవచ్చుకోవచ్చని చెబుతున్నారు. 


పాలు ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పడానికి ఎలాంటి నిస్సందేహం లేదంటున్నారు.  రోజూ పాలు తాగడం వల్ల శరీర కండరాలకు విశ్రాంతి కల్గిస్తుంది. ఇక రాత్రి పడుకునే ముందు తాగితే మరి మంచిది. మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య పోతుంది.  గోరువెచ్చని పాలు తీసుకుంటే మరి మంచిది. అంతేకాదు మెదడను ప్రశాంతంగా ఉంచుతుంది. పిల్లలు, పెద్దలు అందరికీ మంచిది. రోజూ తీసుకోవడం వల్ల జుట్టు కూడా బలపడుతుంది. ఇక పాలల్లో పసుపు కలిపి తాగితే దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తగ్గుంది. గోరువెచ్చని పాలు రాత్రి పూట తీసుకుంటే ఉదయం కల్లా పొట్టను శుభ్రం చేస్తుంది. దీంతో మలబద్ధకం పోతుంది. కడుపులో ఏ సమస్యలున్నా పోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు అధిక మోతాదులో పాలు తీసుకోకుంటే ఇంకా మంచిది అని సూచిస్తున్నారు.

Updated Date - 2021-12-22T20:37:40+05:30 IST