Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు నగరానికి ఏమైంది?.. నడిరోడ్డుపై పట్టపగలు దురాగతం

ఘటన చూస్తూనే అడ్డుకోలేని నిర్లిప్తత

మానవత్వం మంటగలిసిందా..? 

భయం, మనకెందుకులే, మనవాళ్లు కాదులే.. అనే కారణాలు

నేటి కాలంలో స్పందించే తీరు మారిందంటున్న నిపుణులు

సున్నితత్వాన్ని దూరం చేస్తున్న సోషల్‌ మీడియా 

 

గుంటూరు: ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి కుక్కను బంధించి తీసుకువెళ్తుంటే అక్కడే ఉన్న మరికొన్ని కుక్కలు అతనిపై పోరాడి దానిని కాపాడుకుంటాయి. దానికి ఏమైనా జరిగితే ఆ పాపంలో మిగిలినవి కూడా భాగస్వాములవుతాం.. అనే భావాన్ని అవి చూపెట్టాయి. ఆ మాత్రం ఆలోచన మనుషులకు రాకపోవడం శోచనీయమే!


రద్దీగా ఉండే ప్రధాన రహదారి.. పట్టపగలు.. ఓ యువకుడు యువతిని కసిగా కత్తితో పొడుస్తున్నాడు. జనం చూస్తూనే ఉన్నారు. ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. పొడిచి పారిపోతున్నా.. పట్టుకోలేదు. మనెకుందుకులే అనుకున్నారా..? మానవత్వం మరిచారా..? స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగిన ఈ ఘటన సాటి మనిషి కష్టంలో ఉంటే నేటి కాలంలో స్పందించే తీరును ప్రశ్నిస్తోంది.


గుంటూరు నగరంలో ఈ నెల 15న నడి రోడ్డుపై జరిగిన యువతి హత్య ఘటన సందర్భంలో అక్కడ ఉన్నవారు స్పందించిన తీరు ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజీని చూస్తే.. అక్కడ అంతమంది ఉండీ.. ఎందుకు ఆపలేకపోయారనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో మారుమూల జనసంచారం లేని ప్రాంతం కాదది. అర్ధరాత్రి కూడా కానేకాదు. పట్టపగలు రోడ్డుపై యువతిని కత్తితో పొడుస్తున్నా ఎవరూ ఆపలేదు. యువకుడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత గుమికూడారు తప్ప.. అంతవరకు ఎవరూ అడుగు ముందుకు వేయలేదు. ఏ ఒక్కరైనా కనీసం ఒక రాయి తీసుకుని నిందితుడిపైకి విసిరినా రమ్య బతికి ఉండేదేమో...!

 

సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు..

గతంలో చాలా ఘటనల్లోనూ ఇదే జరుగుతోంది. దారుణాన్ని అడ్డుకోకుండా.. కేవలం సెల్‌ఫోన్లలో చిత్రీకరించి దానిని పదిమందికి షేర్‌ చేయడంలో మాత్రం ఉత్సాహం చూపుతున్నారు. రమ్య ఘటన సీసీ ఫుటేజి బయటకు వచ్చిన తర్వాత అది సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అయింది. అక్కడ ఉండి ఆపలేనివారు కూడా ఈ ఫుటేజీని ఇతరులకు పంపారు. ఆ ఘటన జరిగినపుడు అక్కడే ఉన్నాం.. అని చెప్పుకొన్నారే తప్ప దానిని ఎందుకు అడ్డుకోలేకపోయామా? అని ప్రశ్నించుకోలేదు. ఈ నిర్లిప్తతే మానవత్వాన్ని మంటగలుపుతోంది. సామాజిక బాధ్యతను తెలియజేస్తోంది.


మనవాళ్లు కాదులే అనా?

మన ఇంటి ఆడవారినా ఎవరైనా చూస్తేనే కోపం వస్తుంది. అదే అసభ్యంగా మాట్లాడితే చంపేయాలన్న ఆక్రోశం రావడం స హజం. కానీ వేరే అమ్మాయికి ఏదైనా కష్టం కలిగితే పట్టించుకోం. చాలామంది మనకెందుకులే అనుకుంటారు. ఈ ప్రవృత్తే రమ్య హత్యను అడ్డుకోలేదా..? ఎవరైనా అడ్డు తగులుతారనే భయం ఉంటే నిందితుడికి అంత ధైర్యం వచ్చేదా? ఈ ఘటనతో ఆడ పిల్లకు సమాజం భద్రత నిస్తుందనే భరోసా ను దూరం చేసిన వారమయ్యాం.


గతంలోనూ ఇలా ఉండేదా?

ఇప్పుడు మనుషుల్లో మానవత్వం దూరం అవుతోందనేది పరి శీలకుల భావన. దీని కారణాలెన్నో.. గతంలో ఉన్న ఉమ్మడి కు టుంబవ్యవస్థ ఇప్పుడు లేదు. బంధాలు.. వాటి విలువలు తెలి యని పరిస్థితి. అర్బన్‌లో పక్కింటివారు ఎవరో కూడా ఎరుక ఉం డదు. బతుకు వేగం పెరిగింది... అందులో పడి కాలంతో పాటు పరిగెత్తడం మినహా పక్కన ఏం జరుగుతుందనేది చూసుకోలేక పోతున్నాం. ఇప్పటికీ పల్లెటూరికి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే.. ఎవ రింటికి బాబూ అని అవసరం లేకున్నా అడుగుతారు.   ఇటువం టి సంఘటన అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. కానీ పట్టణాల్లో ఎవరికి ఎవరో? 


సెల్‌ఫ్లోన్ల ప్రభావమూ..

సెల్‌ఫోన్ల ప్రభావంతో అవసరమైన విషయాలపై స్పందించక పోవడం.. అనవసర విషయాలపై అతిగా స్పందించడం జరుగు తోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి అకృత్యాలను చూసే దృష్టికోణం మారిపోతోందని అంటున్నారు. నేరాలు, ఘోరాలు సెల్‌ఫోన్లలో చూస్తున్నవారు ఎదురుగా అటు వంటి ఘటనలే జరుగుతున్నా మిన్నకుండి పోతున్నారు. ఒక మ నిషి రోజుకు ఒక గంట మాత్రమే స్మార్ట్‌ ఫోను వాడాలి.. కానీ ప్రస్తుతం రోజుకు సగటున 8గంటలకు పైగానే చాలమంది స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్నారు.. అంటే నెలకు 240 గంటలు...మనిషి తన జీవి త కాలంలో 28 సంవత్సరాలు ఫోనుకే ఉపయోగిస్తున్నారు. 


తల్లిదండ్రులు అండగా ఉండాలి

యుక్తవయసులో ఉన్న యువతతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి. తెలిసీ తెలియక ప్రేమోన్మాదుల కోరల్లో చిక్కుకుని వేధిం పులకు గురవుతున్న అమ్మాయిలు ఆ బాధను తల్లిదండ్రులతో పంచుకోలేకపోతున్నారు. ఇంట్లో తెలిస్తే తిడతారనే భయమే దీనికి ముఖ్య కారణం. ఆడపిల్లల ప్రవర్తనలో మార్పులు ఉంటే తల్లిదం డ్రులు గమనించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్నేహితుల ద్వారా  అయినా సమస్యను తెలుసుకునేం దు కు కృషిచేయాలి. వేధింపులు మొదలైనపుడు ఆడపిల్లకు అండగా ఉండి ధైర్యం నింపాలి.


సామాజిక మాధ్యమాలతో జాగ్రత్త

సోషల్‌ మీడియాలో అనవసర విషయాలపై దృష్టిపెట్టి కొంతమంది యువత నష్టపోతోంది. కొందరు యువకులు చదువు మధ్యలో మానేసి స్నేహితుల నుంచి ఖరీదైన బైకులు తీసుకుని ఫొటోలు దిగి వాటి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు. అమ్మాయిల పోస్టులకు లైకులు కొడుతూ వారిని ప్రేమ అనే ఉచ్చులోకి దింపి మాయమాటలు చెబుతుంటారు. తర్వాత తాము చెప్పింది వినకుంటే దాడులకు తెగబడుతుంటారు. అటువంటి వారిపట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి.


కొసమెరుపు: సమాజంలో ఏదైనా ఘటన జరిగినపుడు తక్షణం స్పందించేవారూ ఉన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆపదలో ఉన్నవారిని ఎందరో ఆదరించారు. అయినవారు ముందుకు రాకపోయినా మేమున్నామంటూ మృతదేహాలను ఖననం చేశారు. పక్కవారికి తమకు తోచిన సాయం అందించనవారు ఉన్నారు.. కానీ రోడ్డుపై అత్యంత కిరాతకంగా యువతిని హత్య చేస్తున్నా అక్కడున్న వారు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

 

నిర్లిప్తత అత్యంత ప్రమాదకరం..

రమ్య హత్య నేటి సమాజపు నడవడికకు అద్దం పట్టే ఘటన. హత్యను చూసేవారు భయం, ఇతర కారణాలతో ముందుకు రారు. ఇటువంటి నిర్లిప్తత అత్యంత ప్రమాదకరం. అన్ని జాగ్రత్తలు తల్లిదండ్రులే తీసుకోవాలి. వారి అవసరాలు తీర్చడానికి ఎటువంటి శ్రద్ధ పెడతామో, ప్రేమను అందించే విషయంలో తల్లిదండ్రులు అంతే శ్రద్ధ పెట్టాలి. సమాజం నుంచి ఎటువంటి సహకారం ఆశించే పరిస్థితులు ప్రస్తుతం లేవు.   

-  డాక్టర్‌ మురళీకృష్ణ, మానసిక వైద్యనిపుణుడు 

Advertisement
Advertisement