ఏమైంది?

ABN , First Publish Date - 2021-01-11T07:22:24+05:30 IST

మన విషాదాలు అన్నీ అనవసరమైనవే అవసరమైన వాటికి కన్నీరు మిగల్చలేదు...

ఏమైంది?

మన విషాదాలు అన్నీ అనవసరమైనవే 

అవసరమైన వాటికి కన్నీరు మిగల్చలేదు 

ఖర్చు లెక్కపెట్టి, పద్దు చెప్పేంత ఓపిక లేదు 

విధివశాత్తు కలిసి ఉంటున్నాం అందరం 

దూరం వల్లనే విడిపోలేదు ఎవరమూ 


నేటిలో రేపటిని చూశాం

దూరంలో మాత్రమే బంధాన్ని నిలుపుకున్నాం  

ఇవ్వాళ రేపయినా రాకపోతుందా అని ఆశపడ్డాం 

ఎంత అందమైంది మన చేతకానితనం!


ఇంత విచక్షణతో ఇన్ని పనులు చేశాక 

చివరకు ఏం మిగిలిందని?

మనం రాసుకున్న పద్యాలు

రానివ్వని ఉదయాలు 

ప్రేమేమో అనుకుని మోసే భారాలు 


ఇకపై ఏం జరిగినా 

ఎవరికీ పట్టదు 

నిన్ను నువ్వు తప్ప

ప్రశ్నలడటానికి ఇంకెవరూ లేరు 

సరే, ఇక నిశ్శబ్దంగా ఉందాం 

శ్రియ ప్రసాద్‌


Updated Date - 2021-01-11T07:22:24+05:30 IST