జాప్యం వెనుక జరిగిందేమిటి?

ABN , First Publish Date - 2021-07-30T06:49:52+05:30 IST

ఆక్సిజన్‌ అందక..

జాప్యం వెనుక జరిగిందేమిటి?

ఆక్సిజన్‌ సరఫరా నిర్వాహకులే బాధ్యులా? 

రుయా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలేవీ?


తిరుపతి: ఆక్సిజన్‌ అందక దారుణ మరణాలు సంభవించిన రుయా ఆసుపత్రి ఇప్పటికీ అనుమానాల పుట్టగానే కొనసాగుతోంది. సంఘటన జరిగిన రెండున్నర నెలల తర్వాత రుయా అధికారులు పోలీసు కేసు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆక్సిజన్‌ అందక చనిపోలేదని మొదట చెప్పిన రుయా అధికారులు, ఆ తర్వాత 11 మంది చనిపోయారని తేల్చారు. తరువాత ఆ సంఖ్యను 18కి సవరించారు. పరిహారాల వివాదం భగ్గుమనడంతో గుట్టుచప్పుడు కాకుండా 23మంది చనిపోయారని లెక్కగట్టారు. అసలు  ఆక్సిజన్‌ అందక చనిపోయినట్లు తమకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సమాచారం ఇవ్వనే లేదని కేంద్రం చెబుతోంది. ఇన్ని దాపరికాల నడుమ తాజాగా ఆక్సిజన్‌ సరఫరా నిర్వాహకులే కారణమంటూ ఏకంగా పోలీసు కేసు పెట్టారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులు ఆక్సిజన్‌ సరఫరా చేసే శ్రీభరత్‌ ఫార్మా వారే అని  అలిపిరి పోలీసులకు రుయా సూపరింటెండెంటు భారతి ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై కేసు నమోదు కూడా అయిపోయింది. మరి ఇంతకాలం ఎందుకు పట్టిందన్నదే అంతుచిక్కని రహస్యం. 


ఇందుకేనా జాప్యం 

రుయా ఘటన జరిగినప్పటినుంచి ఇటు విపక్షాలు, అటు సామాజికవేత్తలు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ వచ్చారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం సైతం స్పందించింది. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లోనూ రుయా విషాదాన్ని ప్రతిపక్షాలు గుర్తుచేసి బాధ్యులెవరని నిలదీశాయి. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్‌ సరఫరా చేసే సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. 23 మరణాలకు కారణభూతమైన దారుణ సంఘటనపై ఇంత లేటు స్పందనేమిటన్నదే ప్రశ్న. మరి రుయా అధికారులకు ఈ సంఘటనలో బాధ్యత ఏమీ లేదా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆక్సిజన్‌ బ్యాకప్‌ బాధ్యత ఆస్పత్రి యాజమాన్యమే చూసుకోవాలంటూ లిండే ఇండియా కంపెనీ ఘటన జరిగిన రెండురోజుల్లోనే రుయా సూపరింటెండెంట్‌కు లేఖ రాసింది. ఆక్సిజన్‌ ప్లాంట్‌లో అలార్మింగ్‌ వ్యవస్థ ఉండాలని, సుశిక్షితులైన ఆక్సిజన్‌ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని....ఇలా ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై పలు సూచనలు చేసింది. కాగా లిండే కంపెనీ ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటే శ్రీభరత్‌ ఫార్మాపై కేసు నమోదు కావడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. 


ప్రత్యామ్నాయం ఎందుకు చూసుకోలేదు?

ఆక్సిజన్‌ నిల్వలను క్షేత్రస్థాయిలో ఆసుపత్రి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్న క్రమంలో అవసరాన్ని బట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. కానీ ఇవేమీ ఇక్కడ జరిగిన దాఖలాలు లేవు. కనీసం లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అందుబాటులో లేని సమయంలో కనీసం సిలిండర్ల రూపంలో అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ను ప్రత్యామ్నాయంగా ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారనే ప్రశ్నకు సమాధానం లేదు. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆ సమయంలో అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేరంటున్నారు. కేవలం జూనియర్‌ డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రమే ఉన్నారని జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత రుయా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడ ఉన్న బాధితుల బంధువులు వాపోయారు. ఆక్సిజన్‌ నిల్వలు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని ముందుగానే ఆక్సిజన్‌ సరఫరా చేసే కంపెనీకి తెలియజేశామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో అదే విషయాన్ని ముందుగా కనీసం బాధితుల బంధువులకు తెలియజేసి వున్నా లేక ఇతర ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఉన్నా ప్రాణ నష్టం వాటిల్లేది కాదని, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే మృతుల బంధువులు అధికారులతో మొరపెట్టుకున్నారు. అలాగే మృతుల బందువుల్లో ఇద్దరు రుయా ఘటనకుపూర్తి బాధ్యులు ఆసుపత్రి నిర్వాహకులేనని కోర్టును కూడా ఆశ్రయించారు. 

Updated Date - 2021-07-30T06:49:52+05:30 IST