Abn logo
Apr 1 2021 @ 12:30PM

ఫాంహౌస్‌లో అసలేం జరిగింది.. బాలుడు ఎలా చనిపోయాడు!?

  • బాలుడి మృతిపై అనుమానాలు
  • యజమాని ఇంటి ముందు ఆందోళన
  • రూ.6 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం

హైదరాబాద్/చంపాపేట : ఫాంహౌస్‌లో ఓ బాలుడి మృతి మిస్టరీగా మారింది. మృతుడి కుటుంబసభ్యుల ఆందోళనతో బాలుడి ప్రాణానికి రూ.6 లక్షలు ఖరీదు కట్టారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఐటగోని అంజయ్య (ప్లంబర్‌), భార్య వసంత, కుమారులు ఆనంద్‌(17), రాఖీ (13) మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. చంపాపేట డివిజన్‌ కర్మన్‌ఘాట్‌ దుర్గానగర్‌ కాలనీలోని బద్దం రాములు గౌడ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రాములు కుమారుడు ఉదయ్‌కుమార్‌ తన పిల్లలతో కలిసి మొయినాబాద్‌లోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వారి వెంట ఆనంద్‌ను తీసుకెళ్లాడు. సాయంత్రం 6 ప్రాంతంలో ఉదయ్‌కుమార్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి ఆనంద్‌ నీళ్లలో పడి చనిపోయాడని చెప్పారు.

వెంటనే రాములు మృతుడి తండ్రి అంజయ్య, కుమారుడు రాఖీని వెంటబెట్టుకొని ఫాంహౌస్‌కు వెళ్లాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు వారు గుర్తించారు. అప్పటికే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడి తండ్రితో తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వెంట రాములు, ఆనంద్‌కుమార్‌ రాకపోవడంతో అంజయ్యకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం అంజయ్య కుటుంబ సభ్యులు రాములు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. స్థానిక కార్పొరేటర్‌ సమక్షంలో మృతుడి కుటుంబానికి 6 లక్షలు ఇచ్చేందుకు రాములు అంగీకరించాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటున్నట్లు ప్రకటించి కార్పొరేటర్‌ వెళ్లి పోయారు.

రూ. 6 లక్షలకు అంగీకరించేది లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన కొనసాగించారు. ఆనంద్‌ను హత్య చేశారని, చిన్న నీటి గుంతలో పడి ఎలా చనిపోతాడని అనుమానం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్‌ పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురాకుండా నేరుగా నర్సిరెడ్డిగూడెం పంపేలా రాములు రాజకీయ పలుకుబడిని ఉపయోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాలుడు ఎలా చనిపోయాడు? అసలు ఫాంహౌస్‌లో ఏం జరిగిందనేది తెలియలేదు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement
Advertisement