ఆ ఎరువులు ఏమయ్యాయి?’’

ABN , First Publish Date - 2021-04-05T08:45:51+05:30 IST

మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వచేసిన 50వేల క్వింటాళ్ల ఎరువుల బస్తాల లెక్కలు గాయబ్‌ అయ్యాయి.

ఆ ఎరువులు ఏమయ్యాయి?’’

  • 50 వేల క్వింటాళ్ల లెక్కలు గాయబ్‌!.. 
  • హైదరాబాద్‌ వరదల సమయంలో గోదాముల్లోకి నీరు’’
  • తడిసిన బస్తాలతోపాటు తడవనివీ మాయం
  • బీమా క్లెయిమ్‌తో సొమ్ము చేసుకున్న హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ
  • మార్క్‌ఫెడ్‌కు రూ.4.40 కోట్ల నష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో నిల్వచేసిన 50వేల క్వింటాళ్ల ఎరువుల బస్తాల లెక్కలు గాయబ్‌ అయ్యాయి. గత వానాకాలంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తినప్పుడు మూసాపేట్‌- సనత్‌నగర్‌ రైల్వే గూడ్స్‌ షెడ్‌ పరిధిలో ఉన్న మార్క్‌ఫెడ్‌  ఏజెంట్‌ గోదాముల్లోకి వరదనీరు చేరింది. దీంతో 40 వేల క్వింటాళ్ల యూరియా, 10 వేల క్వింటాళ్ల కాంప్లెక్స్‌ ఎరువులు కలిపి మొత్తం 50 వేల క్వింటాళ్లు నీళ్లల్లో తడిసినట్లు అవంతి ఏజెన్సీ బీమా క్లెయిమ్‌ చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గోదాముల్లో నిల్వచేసే ఎరువు లకు మెట్రిక్‌ టన్నుకు రూ.800 చొప్పున మార్క్‌ఫెడ్‌ అద్దె చెల్లిస్తుంది. ఇతర ఖర్చులు మరో రూ.200 కలిపి ఒక మెట్రిక్‌ టన్నుకు రూ.వెయ్యి వరకు హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ బిల్లు క్లెయిమ్‌ చేస్తుంది. 


నిర్వహణ లోపంతో.. 

మార్క్‌ఫెడ్‌కు, హ్యాండ్లింగ్‌ ఏజెన్సీకి మధ్య ఒక్క సీజన్‌కు తక్కువలో తక్కువగా రూ. 50 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే మార్క్‌ఫెడ్‌ అప్పగించిన ఎరువులు పాడవకుండా, నీళ్లల్లో తడవకుండా, గడ్డ కట్టకుండా, ఎవరూ లూటీ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత హ్లాండ్లింగ్‌ ఏజెన్సీకి ఉంటుంది. కానీ కోట్ల రూపాయల హ్యాండ్లింగ్‌ చార్జీలు మార్క్‌ఫెడ్‌ నుంచి తీసుకుంటున్న ఏజెన్సీ... ఎరువుల రక్షణను గాలికొదిలేసింది. పంట సీజన్‌ ప్రారంభమై రైతులకు పంపిణీ చేసేవరకు కూడా ఎరువులను కాపాడలేకపోతున్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్లకు ముందు మార్క్‌ఫెడ్‌ అప్పగిస్తున్న ఎరువులు నిర్వహణ లోపంతో దెబ్బతినడంతో నష్టం జరుగుతోంది. ఈక్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు మూసాపేట్‌ గోడౌన్లలో ఉన్న ఎరువుల బస్తాలు నీళ్లల్లో తడిసిపోయాయి. అయితే ఒప్పందంలో భాగంగా ఎరువుల బస్తాలకు ఇన్సూరెన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా నిర్వహణ ఏజెన్సీకే ఉంటుంది. ఒకవేళ ఎరువులకు నష్టం వాటిల్లితే... వాటి విలువ ఎంత ఉంటుందో, అంత మొత్తాన్ని సదరు హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు చెల్లించాలి. 


ఒప్పందానికి విరుద్ధంగా.. 

మూసాపేట గోడౌన్లలో ఎరువులు తడిసిన సందర్భంలో ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహారం జరిగింది. ఎరువుల బస్తాలకు బీమా చేసిన కాంట్రాక్టు ఏజెన్సీ... ఆ 50 వేల క్వింటాళ్లకు బీమా క్లెయిమ్‌ చేసుకుంది. ఇన్సురెన్స్‌ కంపెనీ నుంచి నష్టపరిహారం తీసుకోవడం ఒకెత్తయితే... మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన నష్ట పరిహారం (పాడైన ఎరువుల విలువ) మాత్రం చెల్లించలేదు. అయినప్పటికీ ఎరువులు నష్టపోయిన మార్క్‌ఫెడ్‌... నష్ట పరిహారం కోసం హ్యాండ్లింగ్‌ ఏజెన్సీపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదనేది అంతుచిక్కడం లేదు. ఎరువులు తడిశాయని బీమా క్లెయిమ్‌ చేసుకునే ప్రక్రియలో... తడిసిన పర్సంటేజీని పెంచి, తడవని పర్సంటేజీని తగ్గించి తప్పుడు లెక్కలు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 30 శాతం ఎరువుల బస్తాలను అందులోంచి మాయంచేసి, వరదలో కొట్టుకపోయినట్లు లెక్కలు రాసినట్లు తెలిసింది. మార్క్‌ఫెడ్‌ నుంచి నిర్వహణ ఖర్చులు తీసుకుంటూ ఎరువుల బస్తాలు కాపాడకపోవడం ఒకెత్తయితే... తప్పుడు లెక్కలు రాసి తడిసిన ఎరువుల బస్తాల లెక్కలు చూపి బీమా క్లెయిమ్‌ చేసుకోవడం ద్వారా హ్లాండ్లింగ్‌ ఏజెన్సీ రెండు విధాలా లబ్ధిపొందింది. మార్క్‌ఫెడ్‌కు 50 వేల క్వింటాళ్ల ఎరువులను షార్టేజ్‌ కింద చూపినప్పటికీ ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది. నిర్వహణ లోపంతో పాటు తప్పుడు లెక్కలతో మార్క్‌ఫెడ్‌కు కలిగిన నష్టం రూ.4.40 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఆ ఏజెన్సీతో మార్క్‌ఫెడ్‌ అధికారులు మిలాఖత్‌ కావడం వల్లే ఈ తతంగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఏజెన్సీ నుంచి పరిహారం ఇంకా రాలేదు 

మార్క్‌ఫెడ్‌ అప్పగించిన ఎరువులకు బీమా చేసే బాధ్యత హ్యాండ్లింగ్‌ ఏజెన్సీకే ఉంటుంది. ఒకవేళ ఎరువులకు నష్టం కలిగితే... నష్ట పరిహారాన్ని ఆ ఏజెన్సీనే క్లెయిమ్‌ చేసుకుంటుంది. అదేక్రమంలో ఎరువుల నష్టం విలువను మార్క్‌ఫెడ్‌కు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే వానాకాలంలో మూసాపేట్‌ గోడౌన్లలో ఎరువులు తడిసిన మాట వాస్తవమే! నష్టానికి సంబంధించిన లెక్కలన్నీ మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్నాయి. అయితే ఏజెన్సీ నుంచి ఎరువుల నష్టం సొమ్ము ఇంతవరకు రాలేదు.

విష్ణువర్ధన్‌రావు, జనరల్‌ మేనేజర్‌, టీఎస్‌ మార్క్‌ఫెడ్‌

Updated Date - 2021-04-05T08:45:51+05:30 IST