ఏం జరిగింది.. ఏం చేద్దాం..!

ABN , First Publish Date - 2021-04-19T06:34:22+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో..

ఏం జరిగింది.. ఏం చేద్దాం..!
పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిలిచిన... వెలుపలకు వస్తున్న వాహనాలు(ఫైల్ ఫొటో)

‘తిరుపతి’ ఎన్నికపై ప్రధాన పార్టీల సమీక్ష

ఎన్నికల సంఘం స్పందన కోసం నిరీక్షిస్తున్న టీడీపీ, బీజేపీ

స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో తెలుగుదేశం 

గెలుపుపై ధీమా ఉన్నా, ఆధిక్యతపై వైసీపీలో గుబులు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ సరళి, తమ విజయావకాశాలు, ప్రత్యర్థుల అవకాశాలు, ఆధిక్యత అంచనాలపై ప్రధాన పార్టీల్లో సమీక్షలు, తర్జనభర్జనలు మొదలయ్యాయి. సత్యవేడు సెగ్మెంట్‌లో పోలింగ్‌ సక్రమంగా జరిగిందని దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ భావిస్తున్నాయి.  శ్రీకాళహస్తిలో అక్కడక్కడా టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు జరిగినా పోలింగ్‌లో చెప్పుకోదగ్గ అక్రమాలేవీ జరగలేదన్న భావన ప్రతిపక్ష పార్టీల్లో వ్యక్తమవుతోంది. తిరుపతి సెగ్మెంట్‌ విషయంలో మాత్రం వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని మండిపడుతున్నాయి. తిరుపతి సెగ్మెంట్‌లో టీడీపీ నేతలు మాత్రమే పోలింగ్‌ సందర్భంగా కనిపించారు తప్ప క్యాడర్‌ ఏమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటరు లోపల, ఆవరణలో భారీ సంఖ్యలో బయటి వ్యక్తులు, వాహనాలు ఉండగా కేవలం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, మబ్బు దేవనారాయణరెడ్డి వంటి నలుగురైదుగురు టీడీపీ నేతలు మాత్రమే అక్కడకు వెళ్లి అభ్యంతరం చెప్పగలిగారు. వారిలో నరసింహయాదవ్‌, శ్రీరామ్‌ చినబాబు, దేవనారాయణరెడ్డి రోడ్డుపై బైఠాయించి అరెస్టయ్యారు. వందల సంఖ్యలో వాహనాలు దొంగ ఓటర్లను నగరంలోకి తరలిస్తుండగా సుగుణమ్మ, దంపూరి భాస్కర్‌ యాదవ్‌, నరసింహయాదవ్‌, ఆర్సీ మునికృష్ణ వంటి నలుగురైదుగురు నేతలే అక్కడక్కడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓటర్లను నేరుగా అడ్డుకునే క్రమంలో పార్టీ నేత శ్రీధర్‌ వర్మ ఒక్కరే అరెస్టయ్యారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏజంట్లు, ఇతర కార్యకర్తలు ఏమయ్యారన్నది ప్రశ్న. ఒకవేళ వారిని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు గురి చేసినా, లేక పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని వున్నా టీడీపీ నేతలు ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోయారన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం లభించడం లేదు.


పోలింగ్‌ రోజే అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు కాబట్టి, మంగళవారం దాకా రెండు రోజుల పాటు ఎన్నికల సంఘం స్పందన కోసం ఆ పార్టీ నేతలు నిరీక్షిస్తున్నారు. ఏదో ఒక చర్య ఉంటుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ చర్యలు లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీ నేతలు కూడా తాము కేంద్రంలో ఉన్నందున తమ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తప్పనిసరిగా స్పందిస్తుందన్న అంచనాతో ఉన్నారు. అందుకే ఒకరిద్దరు నేతలు పోలింగ్‌ రోజే ఎన్నికలు రద్దవుతాయంటూ మాట్లాడారు. అలాగని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే బీజేపీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది తెలియరావడం లేదు. మరోవైపు పోలింగ్‌ రోజు బీజేపీ నేతలు శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్‌, అభ్యర్థి రత్నప్రభ మినహా మరెవరూ నగరంలో కనిపించలేదు. భానుప్రకా్‌షరెడ్డి అనారోగ్యంతో ఉండగా, మిగిలిన నాయకులు, శ్రేణుల కదలికలు కనిపించలేదు. మిత్రపక్షమైన జనసేన నేతలు సైతం నగరంలో ఎక్కడా తన ఉనికి చాటుకున్నట్టు లేదు. ఆ పార్టీ కార్యకర్తలూ ఎక్కడా అగుపించలేదు.  వైసీపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు.


కాకుంటే లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తంమీద పోలింగ్‌ శాతం తగ్గడం.. ప్రత్యేకించి తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిల్లో గణనీయంగా తగ్గడంతో మెజారిటీ విషయంలో తడబాటుకు లోనవుతున్నారు. గతంలో చెప్పినట్టు 4-5 లక్షల మెజారిటీ వస్తుందని ఇప్పుడు ధీమాగా చెప్పలేకపోతున్నారు. అంతర్గత సంభాషణల్లో 2-3 లక్షల నడుమ మెజారిటీ వస్తే అదే గొప్ప అనేటట్టు నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో ప్రయాసపడి బయటి వ్యక్తుల్ని రప్పించి ఓట్లు వేయించకుండా ఉండుంటే ఈ సెగ్మెంట్‌లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉండేదన్న వ్యాఖ్యలూ నేతలు చేస్తున్నట్టు ప్రచారమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందన కోసం రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఆసక్తిగా వేచి చూస్తోంది.

Updated Date - 2021-04-19T06:34:22+05:30 IST