ఏలూరుకు ఏమైంది? నమోదవుతున్న కేసుల్లో సగం ఇక్కడే

ABN , First Publish Date - 2020-07-25T20:42:39+05:30 IST

తక్కువ విస్తీర్ణంలో అధిక జనాభా.. వెలుతురు సరిగా లేని చిన్న చిన్న నివాసాలు.. ఒకే ఇంట్లో అధికంగా నివసించే సభ్యులు.. అనవసరంగా రోడ్లపై తిరిగేవారు.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా తిరేగ వారు.

ఏలూరుకు ఏమైంది? నమోదవుతున్న కేసుల్లో సగం ఇక్కడే

కారణాలనువిశ్లేషిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ

రోడ్లపై యథేచ్ఛగా సంచారం

భౌతిక దూరమూ మరిచారు


ఏలూరు అర్బన్‌(ఆంధ్రజ్యోతి): తక్కువ విస్తీర్ణంలో అధిక జనాభా.. వెలుతురు సరిగా లేని చిన్న చిన్న నివాసాలు.. ఒకే ఇంట్లో అధికంగా నివసించే సభ్యులు.. అనవసరంగా రోడ్లపై తిరిగేవారు.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా తిరేగ వారు.. భౌతిక దూరం పాటించని వారు.. రెడ్‌జోన్‌లలో ఏర్పా టుచేసిన బారికేడ్లను ధ్వంసం చేసి బయటకు వచ్చేయడం వంటి కారణాల వల్లే జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వీటితోపాటు కరోనా టెస్ట్‌ ఫలితాల్లో నెలకొన్న జాప్యం మరో కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో కరోనా అడుగు పెట్టిన మార్చి 31 నుంచి ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏలూరు, రూరల్‌ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. నిత్యం నిర్ధారణయ్యే కేసుల్లో సగటున 40-50 శాతం కేసులు జిల్లావ్యాప్తంగా ఉంటే.. మిగిలినవి ఏలూరు పరిసర ప్రాంతా నివే కావడం.. ఇక్కడి తీవ్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు జిల్లాలో 7,890 కేసులు నమోదు కాగా, ఇందులో సగం వరకు ఇక్కడే ఉన్నట్టు సమాచారం. 


ఈ ప్రాంతాల్లోనే అధిక కేసులు

కొత్తపేట, తూర్పు వీధి, 12 పంపుల సెంటర్‌, గన్‌బజార్‌, ఫిలాస్‌పేట, శివగోపాలపురం, తంగెళ్ళమూడి, యాదవ్‌నగర్‌ల తోపాటు 8, 9, 10 డివిజన్లలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది. వీటి తోపాటు నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ నిత్యం కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నప్పటికీ వన్‌టౌన్‌, టూ టౌన్‌ ఏరి యాల్లో కొన్ని ప్రాంతాల పరిధిలో మాత్రమే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 18 నుంచి జిల్లాలో ఒక్కసా రిగా భారీగా నమోదవుతున్న కేసుల్లో గురువారం వరకూ నగరానికి, పరిసర ప్రాంతాలకు చెందిన 1,340 కేసులు ఉన్నా యి. ఆ ప్రకారం 18న నమోదైన కేసుల్లో ఏలూరు, సమీప ప్రాంతాల పరిధిలో 207 కేసులు, 19న 172, 20న 261, 21న 263, 22న 245, 23న 192 24న 200పైగా కేసులు ఉన్నాయి. మొత్తం మీద శనివారం నుంచి శుక్రవారం వరకూ వారం రోజుల్లో సుమారు 1,540 కేసులు నమోదయ్యాయి.


ప్రస్తుతం ఏలూరు నగర పరిధిలో 67 రెడ్‌జోన్లు ఉన్నాయి. వీటి నుంచి ఎవరూ బయటికి రాకుండా బారికేడ్లను కర్రలతో ఏర్పాటు చేసినప్పటికీ, పలు చోట్ల వాటిని ధ్వంసం చేయడం లేదా కర్రల సందుల్లోంచి దూరి బయటకి వచ్చేస్తూ జన సమూహాల్లో అందరితో కలిసి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు తిరిగేస్తుండటమో కరోనా వ్యాప్తి కొనసాగింపునకు ఒక కారణంగా చెప్తున్నారు. అత్యవసర పనులు ఉంటేనే స్వీయ భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, వాటిని పెడచెవిన పెడుతున్నట్లు తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే రుజువవుతుంది. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణా చర్యలు, కంటైన్మెంట్లలో భద్రత, ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, నిర్వహణలకు సిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టాప్‌ స్థానంలోవున్న ఏలూరులో కరోనాను కట్టడి చేయాలంటూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం లేదా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ వచ్చే వరకూ సాధ్యమయ్యేలా లేదని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


11.5 కిలోమీటర్ల విస్తీర్ణం.. రెండు లక్షల జనాభా 

ఏలూరు నగర విస్తీర్ణం 11.5 కిలోమీటర్ల వైశాల్యం కాగా, ఇంత తక్కువ విస్తీర్ణంలో 50 డివిజన్లలో రెండు లక్షల జనాభాకుపైగా నివసిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంతో కూడిన చిన్న చిన్న ఇళ్లల్లో ఎక్కువ సంఖ్యలో జనసాంద్రత ఉంటోంది. దీనికి అనుగుణంగానే ప్రణాళికాబద్దంగా విశాలమైన రోడ్లు, ఇళ్ల నిర్మాణం లేవు. ఫలితంగా గాలి, వెలుతురు దారాళంగా చొరబడని ఇళ్లల్లో ఎక్కువ మంది నివసిస్తుండడం వల్ల సంబంధిత కుటుంబంలో ఏ ఒక్కరికి పాజిటివ్‌ లక్షణాలు సోకినా, వైరస్‌ నిర్ధారణ అయ్యేలోగా మిగతా కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందడానికి కారణమవుతోందని గుర్తించారు. ఒక ఇంట్లో పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయిన తరువాత, తిరిగి అదే కుటుంబం లేదా నివాస గృహంలో ఉంటున్న పది నుంచి 14 మంది కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకిన ఘటనలు ఏలూరులో ఇప్పటి వరకూ 16 వరకూ వెలుగు చూశాయి.

Updated Date - 2020-07-25T20:42:39+05:30 IST