Advertisement
Advertisement
Abn logo
Advertisement

నర్సింగ్ చదువుతున్న యువతితో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి.. ఓ రోజు స్నేహితులతో కలిసి.. భార్యను కిడ్నాప్ చేసి..

ఆమె బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. సెలవులపై సొంతూరికి వెళ్లే క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన ప్రియురాలినే పెళ్లి చేసుకున్న వారిలో ఎంత సంతోషం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ యువకుడు మాత్రం కొన్నాళ్ల తర్వాత భార్యను స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. తర్వాత జరిగిన పరిణామాలతో వారి జీవితం సమస్యల వలయంగా మారింది. అసలు ఏం జరిగిందంటే..

తెలంగాణలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన దామల్ల సుధాకర్‌, రజిని దంపతులకు శాంతి అనే కుమార్తె ఉంది. సుధాకర్ వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. వీరి కూతురు హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వస్తూ, పోతూ ఉండేది. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. ప్రేమికుల బలవంతంతో పెద్దలు కూడా పెళ్లి చేసేందుకు అంగీకరించారు. చివరకు అందరి సమక్షంలో ఏప్రిల్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకున్నారు.

ప్రేమకథ సుఖాంతమవడంతో కూతురు సంతోషంగా ఉంటుందిలే.. అని తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే కొత్త కాపురం పెట్టిన కొన్ని నెలలకే శాంతి జీవితంలో అశాంతి నెలకొంది. వివిధ కారణాలతో భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. కొన్నాళ్లు ఓపిగ్గా భరించిన శాంతి.. తర్వాత భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలంటూ బాలరాజూ పలుమార్లు.. అత్తగారింటికి వెళ్లి గొడవ చేసేవాడు. అయినా శాంతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో భార్యపై పగ పెంచుకున్నాడు. అదును కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఇటీవల ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుక ఉండగా.. సుధాకర్‌ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.

విషయం తెలుసుకున్న బాలరాజు తన స్నేహితులను పిలిపించాడు. భార్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. కంగారు పడిన శాంతి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత కొన్ని రోజులకు శాంతి.. వారి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చింది. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నర్సింగ్ చదువు పూర్తయిన తర్వాత.. కాపురానికి పంపిస్తామని శాంతి తల్లిదండ్రులు చెప్పారు. అప్పటికీ వినిపించుకోని బాలరాజు.. గత బుధవారం తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న శాంతిని మళ్లీ బలవంతంగా కిడ్నాప్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement