అంతా బినామీలకే!

ABN , First Publish Date - 2020-06-04T08:36:08+05:30 IST

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి..

అంతా బినామీలకే!

మాకు గుర్తింపు ఏది?

మంత్రి వెలంపల్లిపై సీనియర్ల ఆగ్రహం

పశ్చిమ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

మంత్రికి వ్యతిరేకంగా 200 మంది భేటీ

సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం


(విజయవాడ- ఆంధ్రజ్యోతి): ‘దుర్గగుడిని మొత్తం మంత్రి అనుచరులే కబ్జా చేశారు. నిలువునా దోచేస్తున్నారు. కరోనా సాయం పేరిట వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు. తన బినామీలకు లక్షలాది రూపాయల శానిటైజర్ కాంట్రాక్టును, కోట్లాది రూపాయల విలువైన పీపీఈ కిట్ల తయారీ కాంట్రాక్టును అప్పగించారు. వైసీపీ గెలుపు కోసం ఐదేళ్లు నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, సీనియర్ నాయకులను పక్కన పెట్టేశారు. మంత్రి చర్యలతో నియోజకవర్గంలో పార్టీ పరువుపోతోంది. ఈ విషయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయమని కోరదాం.’

- విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 200మంది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఇది.


రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏడాదిగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీలోని వర్గ విభేదాలు బుధవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి వెలంపల్లి పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారని బుధవారం నాటి సమావేశంలో పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులను ఎదుర్కొని ఐదేళ్లపాటు వైసీపీ గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించిన వారిని కాదని, తన బినామీలు, అనుచరులకే మంత్రి ప్రాధాన్యం ఇస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు పార్టీని పణంగా పెడుతున్నారని విమర్శించారు. మంత్రి ఒంటెత్తు పోకడను నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం భవానీపురంలోని వైసీపీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడి కార్యాలయంలో సమావేశమయ్యారు.


ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో ఉన్నవారికి మంత్రి గుర్తింపు ఇవ్వకుండా తన వెంట ఉన్న వారికి, బినామీలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో ఉన్న సీనియర్‌లను అణగదొక్కుతున్నారని అభిప్రాయపడ్డారు. నగరంలో కార్పొరేటర్ల సీట్లు కేటాయింపులోనూ మంత్రి తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్నారని, ఆయన అనుచరులు డబ్బులు తీసుకుని కార్పొరేటర్‌ సీట్లు అమ్ముకున్నారని దీంతో పార్టీలో తొలి నుంచి కష్టపడిన వారికి మొండిచెయ్యి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు, సత్రాలు కమిటీల్లో కూడా తన సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాలను అణగదొక్కుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచించినప్పటికీ మంత్రి ఆ సూచనలను తుంగలో తొక్కి, పార్టీతో సంబంధంలేని వ్యక్తులకు, వ్యాపారులకు, తన సామాజికవర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీట్లు అడిగిన సీనియర్లను కొందరిని పక్కనపెట్టి, మరికొందరిని వేరొక డివిజన్‌లో పోటీచేయాలని మంత్రి సూచించారని సమావేశంలో పాల్గొన్న ఓ సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీచేసే అభ్యర్థుల్లో ఎక్కువ మంది పార్టీకి సంబంధంలేని వ్యక్తులని, వారిని తొలగించి పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంత్రి వ్యవహార సరళిపై ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకర్గంలో అత్యధికంగా ఉన్న మాల సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై పలువురు ఎస్సీ మాల నాయకులు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో మంత్రికి మాల సామాజికవర్గం తమ సత్తా చూపుతుందని ఆ సామాజికవర్గ నాయకులు పలువరు హెచ్చరించారు. పార్టీ సీనియర్‌ నాయకులు కొప్పుల రమణారెడ్డి, సొరగాని రామిరెడ్డి, దాడి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన సుమారు 200 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T08:36:08+05:30 IST