Aug 2 2021 @ 05:02AM

అమ్మాయి ఎదురు తిరిగితే?

పూర్ణ, అర్జున్‌ అంబటి, రాకేందు మౌళి ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగణ దర్శకుడు. ఈ నెల 13న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రిజ్వాన్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘థియేటర్లలో విడుదల చేయాలని ఇన్నాళ్లూ ఎదురుచూశాం. తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని అనువదిస్తున్నాం. అయితే, తమిళనాడులో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అమాయక మహిళ, ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగా మాట్లాడలేని వ్యక్తి... ఎదురు తిరిగితే? తీవ్రంగా స్పందిస్తే? ఎలా ఉంటుందనేది చిత్రకథ. కళ్లతోనే పూర్ణ అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అగ్ర నాయికలతో మహిళా పాధాన్య చిత్రాలు చేస్తారు. నేనింకా ఆ స్థాయికి రాలేదు. కానీ, నన్ను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీయడం సాహసం. కొత్త తరహాలో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నయనతారలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనుంది’’ అని పూర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్‌ అంబటి, రాకేందు మౌళి, సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి, సహ నిర్మాత ఖుషి పాల్గొన్నారు.