మన మధ్య యేముంది...?

ABN , First Publish Date - 2020-09-07T06:21:20+05:30 IST

అంకమ్మ బావిలో వేసిన పాతాళభైరవి కొక్కేలకు పారేసుకున్న వస్తువుల్లా ఇన్నిన్ని జ్ఞాపకాలు చిక్కాయి!...

మన మధ్య యేముంది...?

అంకమ్మ బావిలో వేసిన పాతాళభైరవి కొక్కేలకు

పారేసుకున్న వస్తువుల్లా ఇన్నిన్ని జ్ఞాపకాలు చిక్కాయి!

ఊరిచెరువు గట్టుమీద చింతచెట్టు తొఱ్ఱలో

చిన్నప్పుడు అపురూపంగా దాచుకున్న గోలీల్లా

ఇన్నిన్ని స్మృతులు యిప్పుడు హఠాత్తుగా బయటపడ్డాయ్‌!!

నెమలిపింఛం కట్టతో నెత్తిన కొట్టి

ధైర్యం తాయెత్తు కట్టిన షరీఫ్‌ దాదావు నువ్వే కదూ?!

ఆంజనేయస్వామి గుడిలో ఛాలీసా పారాయణం చేసిన

బవిరిగడ్డపు బషీర్‌ బాబావు నువ్వే కదూ?!

చేతిసంచిలో ఎర్రపళ్ళపొడి పొట్లాలను తీసుకువచ్చి

మా నిద్రమొఖాలపై యింత సుప్రభాతం పోసిన సలీంతాతవు కదూ నువ్‌?!

పీరు పట్టుకుని నువ్‌ నిప్పుల గుండం తొక్కుతున్నప్పుడు

శూలం పట్టుకుని నడుస్తున్న శివుడిలా కనిపించేవాడివి.

నువ్‌ పెట్టిన ఖర్జూరం, నువ్‌ పంచిన సేమ్యా

భలేగుండేవి కరీం... తలపుకొస్తే నోట్లో నీళ్ళూరతాయిప్పటికీ.

కాకెంగిలితో ఒంటిబెల్లో మనం తిన్న నూగుజీడీ

గోటీదెబ్బకు గీరుకుపోయిన నా కాల్చిప్పను నయంచేసిన నీ ఉమ్మిచెమ్మ

పచ్చిమామిడాకు తోరణంలా

నన్ను లోలోపలికి పిలుస్తూనే ఉంటాయి ఎంతో స్నేహంగా.

మన మధ్య యేముంది...?

గాఢంగా వ్యాపించిన మైత్రీ సుగంధం

శతాబ్దాలుగా అల్లుకున్న భౌగోళిక బంధుత్వం తప్ప!

ఎలాంటి అంట్లూ అడ్డంకులు లేకుండా

ఒకరింట్లో ఒకళ్ళం బొంగరాల్లా తిరిగేమే?!

అదేంటి మరి?

వాడీ రోజు మన మధ్య యినుప గోడలు కడుతున్నాడు

స్మశానాలు తవ్వుతూ శవపంచనామాలు చేస్తున్నాడు.

ఈ మట్టితో నీకున్న బంధుత్వానికి సాక్ష్యాలు చూపించమంటున్నాడు.

ప్రవరలు, గోత్రనామాల ప్రహరీలు నిర్మిస్తున్నాడు.

జెండా చెట్టని నువ్వు, అశ్వత్థవృక్షమని నేను

యిద్దరం ఒకే చెట్టుకు చుట్టుకున్న దారపు పోగులమని తెలీదా వాడికి!?

దిలీప్‌ కుమార్‌ అభినయాన్ని, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని

ఒకే మనసుతో ఆనందించే రెండు కళ్ళమనీ, రెండు చెవులమనీ తెలీదా వాడికి!?

మన మధ్య యేముంది...?

నందిరాజు విజయ్‌కుమార్‌

95027 60757


Updated Date - 2020-09-07T06:21:20+05:30 IST