Kakinada Municipal Corporation: మేయర్‌ కుర్చీపై వైసీపీ కన్ను.. అందుకే ఇలా చేస్తోందా?

ABN , First Publish Date - 2021-09-08T06:56:38+05:30 IST

కాకినాడ కార్పొరేషన్‌లో..

Kakinada Municipal Corporation: మేయర్‌ కుర్చీపై వైసీపీ కన్ను.. అందుకే ఇలా చేస్తోందా?

ఏం జరుగుతోంది..

మేయర్‌ మార్పుపై వైసీపీ వ్యూహాలు?

ఆగిన కార్పొరేషన్‌ నూతన భవనం పనుల శంకుస్థాపన 


కాకినాడ: కాకినాడ కార్పొరేషన్‌లో మేయర్‌ కుర్చీపై వైసీపీ కన్నేసిందా, అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అత్యాధునిక హంగులతో రూ.38 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న కాకినాడ కార్పొరేషన్‌ నూతన భవనం పనుల శంకుస్థాపన కార్యక్రమం వ్యూహాత్మకంగానే వాయిదా పడుతూ ఉండడం వెనుక కుర్చీ మార్పే కారణమనే వాదన వినవస్తోంది. తమ పార్టీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరపడానికే వాయిదా వెనుక అసలు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఈనెల 15వ తేదీ తర్వాతే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని ప్రచారం జరుగుతుండడం వెనుక ఇదే వ్యూహం ఉన్నట్టు చెబుతున్నారు.


వాస్తవానికి ఈనెల 15తో మేయర్‌ సుంకర పావని పదవీకాలం నాలుగేళ్లు పూర్తవుతుంది. నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మేయర్‌ను మార్పు చేసుకునే అవకాశం ఉంది. అప్పట్లో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్యాబలం అధికంగా ఉండడంతో ఆ పార్టీ తరపున పావని మేయర్‌ పదవి చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత కార్పొరేటర్లు కొందరు వైసీపీలోకి దూకారు. కొందరు పార్టీలో చేరకపోయినా వైసీపీ మనుషులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌లో బలాబలాలు తారుమారయ్యాయి.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి బలం తగ్గిపోయి వైసీపీకి బలం పెరిగింది. మేయర్‌గా టీడీపీ తరపున పావని మేయర్‌గా ఉన్నా అన్ని అజెండాలు వైసీపీ వర్గం చెప్పినట్టే ఆమోదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కొత్త మేయర్‌ పేరు కార్పొరేషన్‌ భవన శిలాఫలకంపై వేసి, నూతన భవనం పనులకు శంకుస్థాపన చేయాలని చూస్తున్నట్టు, అందుకే ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తున్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-09-08T06:56:38+05:30 IST