అరసవల్లిలో షాడో!

ABN , First Publish Date - 2021-01-09T05:08:43+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుడి దేవాలయం తరచూ వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక షాడో నేత.. పాలక మండలి సభ్యుడి ముసుగులో స్వామివారికి వచ్చే కానుకల ఖర్చు విషయంలో మితిమీరి ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. గతంలో ఆదిత్యుడికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల మాయం విషయంలో రేగిన వివాదంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్‌ నివేదికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.

అరసవల్లిలో షాడో!

 పాలక మండలి సభ్యుడి ముసుగులో ఓ నేత అక్రమాలు

సొంత ఖాతాలోకి ‘బంగారు మకరతోరణం’ నిధులు  

భక్తుల కానుకల ఖర్చులోనూ కొరవడిన స్పష్టత

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుడి దేవాలయం తరచూ వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక షాడో నేత.. పాలక మండలి సభ్యుడి ముసుగులో స్వామివారికి వచ్చే కానుకల ఖర్చు విషయంలో మితిమీరి ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. గతంలో ఆదిత్యుడికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల మాయం విషయంలో రేగిన వివాదంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్‌ నివేదికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. స్వామి వారికి బంగారు మకర తోరణం చేయించే విషయంలో షాడో నేత ఆధిపత్యం కొనసాగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి గత ఏడాది రథసప్తమి నాటికే ఆదిత్యుడిని బంగారు మకరతోరణంతో అలంకరించాలని ఆలయ కమిటీ భావించింది. ఇందుకు గత ఏడాది భక్తుల నుంచి సుమారు రూ.64 లక్షలు నగదు సమకూరింది. ఈ డబ్బులతో ఆదిత్యుడికి ప్రస్తుతం ఉన్న వెండి మకరతోరణం స్థానంలో బంగారు మకరతోరణం చేయించాలని కొందరు భక్తులు నిర్ణయించారు. ఇదే అదనుగా షాడో నేత.. మకరతోరణం విషయంలో తలదూర్చి అన్నీ తానై వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మకరతోరణం తయారీకి భక్తులు అందించే నగదు బహుమతులను నిబంధనల ప్రకారం ఆదిత్యుడి ఆలయానికి చెందిన దేవదాయ శాఖ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఆలయ అభివృద్ధి పనుల కోసం భక్తులు ఇచ్చిన నగదుకు వెంటనే రసీదులు ఇవ్వాలి. కానీ కొంత కాలంగా భక్తులు ఇచ్చే కానుకల నగదును దేవదాయ శాఖ ఖాతాకు జమ చేయడం లేదని తెలుస్తోంది. మకర తోరణం నిధులను షాడో నేత తన ఖాతాకు మళ్లించుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు ఆలయంతో షాడో నేతకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక ఎమ్మెల్యే సిఫారసుతో పాలక మండలి కమిటీ సభ్యుడిగా చోటు దక్కించుకుని.. ఆలయంలో హవా సాగిస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆదిత్యుడికి బంగారు మకరతోరణం చేయించాలని ఆలయ కమిటీలో సభ్యులంతా నిర్ణయించడం శుభ పరిణామమే. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం భక్తుల నుంచి నగదు స్వీకరించడం మంచిదే. ఆదిత్యుడి ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉండగా... కమిటీ సభ్యుని ఖాతాకు నగదు బహుమతులు ఎలా మళ్లిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది రథసప్తమి నాటికే రూ.64 లక్షలు రాగా, తరువాత కాలంలో ఇంకా ఎంత మొత్తం నగదు కానుకలు వచ్చాయనే దానిపై అధికారులకూ స్పష్టత లేకపోవడం గమనార్హం. వచ్చిన ప్రతి పైసా షాడోకు మళ్లించడంతో ఆయన ఆ మొత్తంతో బంగారం కొనుగోలు చేసి, మకరతోరణం కోసం వినియోగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయానికి వచ్చే కానుకలను ఖర్చు చేసేముందు పాలక మండలి తీర్మానం అవసరం. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వామి కోసం కొనుగోలు చేస్తే, తప్పనిసరిగా టెండర్ల ప్రాతిపదికన ప్రకటన జారీ చేయాలి. కానీ షాడో ఆదేశాలతో మకరతోరణం కోసం ఎవరు ఎంత ఇచ్చినా వెంటనే బంగారం కొనుగోలు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఏడాది రథసప్తమి నాటికైనా ఆదిత్యుడికి బంగారు మకరతోరణం అలంకరిస్తారో.. లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది. 


త్వరలోనే మకరతోరణం అలంకరణ...

భక్తులు మకరతోరణం కోసం ఇచ్చిన ప్రతి పైసాతో బంగారం కొంటున్నారు. ఆలయ పాలక మండలి సభ్యుడు ఈ వ్యవహారం చూస్తున్నారు. ఇప్పటికే సగం ఆభరణం రూపకల్పన పూర్తయింది. ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు రాస్తున్నాం. మకరతోరణం త్వరలోనే పూర్తిచేసి స్వామికి అలంకరిస్తాం.

- హరిసూర్యప్రకాష్‌, ఈవో, అరసవల్లి

Updated Date - 2021-01-09T05:08:43+05:30 IST