మీ నిధులు ఏమవుతున్నాయి?

ABN , First Publish Date - 2020-11-28T09:58:12+05:30 IST

‘రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన నిధులు సద్వినియోగమవుతున్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా..

మీ నిధులు ఏమవుతున్నాయి?

తెలుసుకోవాల్సిన అవసరం లేదా?

అటవీ, వణ్యప్రాణి పరిరక్షణ

నిధులపై కేంద్రానికి హైకోర్టు ప్రశ్న


అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన నిధులు సద్వినియోగమవుతున్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ వివరాలను పరిశీలించాల్సిన అవసరం లేదా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల మళ్లింపు జరిగిందా లేదా? ఆ నిధులు ఏమయ్యాయి? తదితర వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయనిపక్షంలో సంబంధిత అధికారులను కోర్టుకు పిలిపించి వివరణ అడుగుతామని హెచ్చరించింది.


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్‌ బాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘‘అటవీ, వన్యప్రాణుల పరిరక్షణ కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.1734.81 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని సద్వినియోగం చేయలేదు. పైగా... అధికభాగం నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. ఇది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ అండ్‌ ఫండ్‌ యాక్ట్‌ (కంపా)కు విరుద్ధం’’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరినాధ్‌ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు అందిస్తామని ధర్మాసనానికి తెలిపారు.

Updated Date - 2020-11-28T09:58:12+05:30 IST