పాజిటివ్స్‌పై నిఘా ఏది?

ABN , First Publish Date - 2020-09-23T08:17:48+05:30 IST

రామాంతపూర్‌కు చెందిన ఓ దంపతులకు కరోనా వచ్చింది. ఇద్దరూ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

పాజిటివ్స్‌పై నిఘా ఏది?

ట్రేసింగ్‌ మరిచిన అధికారులు

స్వేచ్ఛగా తిరిగేస్తున్న రోగులు

హోం క్వారంటైనూ అంతంతే

పట్టించుకోని వైద్యశాఖ అధికారులు

సదుపాయాలను పరిశీలించని వైనం

మందుల కిట్ల విషయంలోనూ అలసత్వం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):రామాంతపూర్‌కు చెందిన ఓ దంపతులకు కరోనా వచ్చింది. ఇద్దరూ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. అధికార యంత్రాంగం నుంచి వారికి ఎలాంటి సమాచారం అందలేదు. ఓ వారం గడిచిన తరువాత భర్తకు దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. దాదాపు వారం పాటు బాధితుడు ఆస్పత్రిలో నే ఉన్నాడు. అప్పటికే పాజిటివ్‌గా ఉన్న అతడి భార్య రెండు, మూడు సార్లు ఆస్పత్రికి వచ్చి వెళ్లింది. వారిపై ఎటువంటి నిఘా లేదు. వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా? లేదా అన్న విషయమే పట్టించుకోలేదు. ఇదీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఒకరో ఇద్దరో కాదు చాలామంది కరోనా పాజిటివ్‌లు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు. మందుల కోసమో లేక ఇతర అవసరాల కోసమో వాళ్లే వచ్చేస్తున్నారు. ఇటువంటివారి పై ఎటువంటి నిఘా ఉండటం లేదు. మొదట్లో కొంచెం హడావుడి చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు పట్టన్నట్లుగా వ్యవహారిస్తోంది.


కరోనా వచ్చిన కొత్తలో ఒకరికి వైరస్‌ వచ్చిదంటే చాలు అత ను ఎక్కడి నుంచి వచ్చాడు, వైరస్‌ ఎలా సోకింది. ఎవరెవరిని కలిశారు? ఇలా అన్ని రకాలుగా దృష్టి సారించేవారు. ఆగమేఘాల మీద ఆ ఇంటికి వెళ్లి అన్ని వివరాలు సేకరించే వారు. వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ కూడా పర్యవేక్షించేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ వస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసే విధానానికి వైద్య ఆరోగ్యశాఖ స్వస్తి పలికింది. అవసరమైతే వారే వచ్చి చేసుకుంటారులే అనే ధోరణితో ఉంది.


ఆరోగ్య పరీక్షలే లేవు..

ఇంటిలో ఉండే పాజిటివ్స్‌ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. అతని జ్వరం, ఆయాసం వంటివి తరచు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వచ్చి గమనించాలి. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోతే ఆస్పత్రులకు తరలించాలి. కానీ ఎవరు పాజిటివ్స్‌ ఇళ్లకు వచ్చి ఆరోగ్య వివరాలు సేకరించడం లేదు. మొదట్లో ఒకరికి పాజిటివ్‌ అని తేలితే మరుసటి రోజునే వారికి ప్రతి రోజు ఫోన్‌ చేసి సమాచారం సేకరించే వారు. ఇప్పుడు కనీసం ఫోన్‌ చేసే దిక్కులేకుండా పోయింది. 


ఎవరి కిట్టు వారే తెచ్చుకోవాలి

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారింటికి వైద్య సిబ్బంది వచ్చి మందులతో కూడి న కిట్లు అందజేయాలి. ఆ ఇంటిని శానిటైజ్‌ చేయాలి. కానీ ప్రస్తుతం ఇవేమీ చేయడం లేదు. కరోనా వచ్చింది.. కిట్లు ఇస్తారా! అంటే యూపీహెచ్‌సీకి వచ్చి తీసుకోండి అని సమాధానమిస్తున్నారు. దీం తో అవసరమైన వారు వెళ్లి కిట్లు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు వెళ్లడంలేదు. నిజానికి కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉంటే ఆ ఇంటిని వైద్య ఆరోగ్యశాఖ పరిశీలించాలి.


ఆ వ్యక్తి ఉన్న గది క్వారంటైన్‌కు అనుకూలం గా ఉందా? అతని వల్ల ఇతరులకు వైరస్‌ సోకే ముప్పు ఉందా? వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సదుపాయాలు లేకపోతే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పాజిటివ్స్‌ హోం క్వారంటైన్‌ అయితే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోవడంలేదు. తమ ఇంటిలో సౌకర్యంగా లేకపోతే బాధితులే  ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లి ఉంటున్నారు. 

Updated Date - 2020-09-23T08:17:48+05:30 IST