డెంగ్యూ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి?: టీజీ

ABN , First Publish Date - 2021-12-01T05:04:15+05:30 IST

దేశంలో డెంగ్యూ నియంత్రణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ప్రశ్నించారు.

డెంగ్యూ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి?: టీజీ
మాట్లాడుతున్న టీజీ వెంకటేష్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబరు 30: దేశంలో డెంగ్యూ నియంత్రణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ప్రశ్నించారు. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నను లేవనెత్తారు.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సుదీర్ఘమైన సమాధానాన్ని రాతపూర్వకంగా తెలియజేసింది. గతంలో పోలిస్తే డెంగ్యూ కేసులు చాలా వరకు తగ్గాయని తెలిపింది. 713 ఆసుపత్రుల్లో 17 అఫెక్స్‌ రెఫరల్‌ ల్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తూ వాటి నియంత్రణకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇప్పటి దాకా దేశంలో 7.26 లక్షల డెంగ్యూ పరీక్షలు నిర్వహించామని, డెంగ్యూ వ్యాధి నివారణకు రాష్ట్రాలకు అదనంగా కూడా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 15 మంది సలహాదారుల బృందం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సలహాలను అందజేస్తూ డెంగ్యూ నియంత్రణకు విశేష కృషి చేస్తోందని వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగించే ప్రధానమంత్రి కుసుం పథకం ఎలా కొనసాగుతుందని, ఆ పథకంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వివరాలను రాజ్యసభ సభ్యులు టీజీ కోరారు. కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 30 శాతం కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ రైతులకు సోలార్‌ పంప్‌సెట్లను ఏర్పాటు చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 18 వాట్ల సామర్థ్యం గల 72వేల తరహా సోలార్‌ పంపు సెట్లను అమర్చినట్లుగా కేంద్రమంత్రి వివరించారని టీజీ తెలిపారు. 


Updated Date - 2021-12-01T05:04:15+05:30 IST