ఆంధ్రజ్యోతి (09-06-2020):
ప్రశ్న: డాక్టర్! మాకు పెళ్లై మూడేళ్లు. ఆయనకు వీర్యకణాల లోపం ఉండడంతో, లాక్డౌన్కు ముందు వైద్యులను కలిసి మందులు తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఆ మందులు వాడుతూ, తరచుగా కలుస్తూ ఉండమని వైద్యులు సూచించారు. కానీ ఆయనకు కొత్తగా అంగస్తంభన సమస్య తలెత్తింది. దీనికి ప్రస్తుతం వాడుతున్న మందులే కారణమా? వైద్యులను కలవడానికి ప్రయాణ సౌలభ్యం లేని ఈ సమయంలో మేము ఎలా నడుచుకోవాలి? సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి, చిట్యాల.
డాక్టర్ సమాధానం: పూర్వం లేని అంగస్తంభన సమస్య కొత్తగా తలెత్తిందంటే, అందుకు కారణం మానసిక ఒత్తిడి అయి ఉండవచ్చు. ‘లాక్డౌన్లో దొరికిన ఏకాంతాన్ని ఉపయోగించుకుని, తరచుగా కలుస్తూ ఉండాలి’ అనే వైద్యుల సూచన మీ వారిలో ఒత్తిడిని పెంచుతూ ఉండి ఉండవచ్చు. ఫలితంగా అంగస్తంభన సమస్య కొత్తగా తలెత్తే వీలు లేకపోలేదు. అలాగే వీర్యకణాల పెరుగుదలకు వాడే మందుల్లో, హార్మోన్ మందుల వల్ల కూడా కొంతమేరకు అంగస్తంభన సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ఒత్తిడి తొలగేలా, ఆయనతో మసలుకోవడం ముఖ్యం. అదే సమయంలో హార్మోన్ మందులను ఆపి, మిగతా మందులను కొనసాగించి చూడాలి. అప్పటికీ సమస్య సర్దుకోకపోతే ఇంటికి చేరువలో ఉన్న ఆస్పత్రిలో యూరాలజిస్ట్ లేదా ఆండ్రాలజిస్ట్లను సంప్రతించవచ్చు. లాక్డౌన్ తొలగి చికిత్సను సూచించిన వైద్యులను కలిసేలోపు, ఇలా దగ్గర్లో అందుబాటులో ఉన్న వైద్యులను కలిసి తగిన సూచనలు పొందవచ్చు.
-డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
8332850090 (కన్సల్టేషన్ కోసం)