పరిహారమేదీ ?

ABN , First Publish Date - 2022-06-29T07:28:37+05:30 IST

జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను కోల్పోయిన అన్నదాతలకు ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పూర్తిస్థాయి పరిహారం అందకపోవడదం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నా యి.

పరిహారమేదీ ?
తాత్కాలిక పునరావాసంలో గుండెగావ్‌ గ్రామస్థులు (ఫైల్‌)

పరిహారం కోసం ఏళ్ల నుంచి అన్నదాతల ఎదురుచూపులు 

జిల్లాలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు అందని డబ్బులు 

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న పరిహారం లెక్కలు 

కంటి తుడుపు చర్యలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు 

నిర్మల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను కోల్పోయిన అన్నదాతలకు ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పూర్తిస్థాయి పరిహారం అందకపోవడదం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నా యి. రైతులు ఏళ్ల నుంచి ఈ పరిహారం డబ్బుల కోసం పడిగాపులు కా స్తున్న పట్టించుకునే వారే కరువయ్యారంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కంటితడుపు చర్యలతో దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మా ణం, పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌, కాలేశ్వరం హైలేవల్‌ 27, 28వ నంబర్‌ కాలువల నిర్మాణాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూ ములకు ఇప్పటి వరకు కూడా పరిహారం అందకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట తాము భూములు ఇచ్చేందుకు వ్యతిరేకించినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల భరోసా మేరకు తాము త్యాగాలు చేయాల్సి వచ్చిందంటున్నారు. భూములు కోల్పోయి తాము ఉపాధిని సైతం నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సారవంతమైన భూములకు ప్రభుత్వం తక్కువ మొత్తంలోనే పరిహారాన్ని ప్రకటించినప్పటికీ తాము అభివృద్ధి కోసం భూములు ఇచ్చేందుకు అంగీకరించామని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ పరిహారంలో కొంతమొత్తం ఒక్కసారి కాకుండా దశల వారీగా అందించారని, మిగతా డబ్బుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోందంటున్నారు. సదర్‌మాట్‌ బ్యారేజీ కింద మిగతా 53 ఎకరాలకు దాదాపు రూ.4కోట్ల పరిహారాన్ని రైతులకు అందించాల్సి ఉంది. పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టు కింద గుండెగావ్‌ గ్రామస్థులకు పరిహారం కోసం రూ.63 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పరిహారం ప్రతిపాదనలకు ప్రభు త్వం ఆమోదం తెలపలేదు. దీంతో పాటు నిధుల విషయమై ఇప్పటికీ స్పష్టత కరువైందంటున్నారు. ఈ నిధులతో ఇళ్లు కోల్పోయిన గుండెగావ్‌ గ్రామస్థులకు 137 ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందంటున్నారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 27,28వ నంబర్‌ ప్యాకేజీ హైలెవల్‌ కాలువల కింద భూములు కోల్పోయిన వారికి కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారాన్ని అందించలేదు. ప్యాకేజీ నంబర్‌ 27 కింద ఇంకా 263 ఎకరాలకు పరిహారాన్ని అందించాల్సి ఉం ది. అలాగే 28వ నంబర్‌ హైలేవల్‌ కాలువ కింద మొత్తం 562.30 ఎకరాల కు సంబంధించిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం రైతులు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారి గోడు అరణ్యరోదనగానే మారిందంటున్నారు. ఇకనైనా సర్వం కోల్పోయి ఆర్థికభారంతో తల్లడిల్లుతున్న తమకు వెంటనే పరిహారం డబ్బులను అందించాలని రైతులు కోరుతున్నారు. 

సదర్‌మాట్‌ రైతులకు గోస

కాగా సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం కోసం 805.39 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూముల పరిహారం డబ్బులను మాత్రం అందించడం లో ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేసింది. రైతులు చాలాసార్లు పరి హారం డబ్బుల కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటి వరకు 752.36 ఎకరాలకు సంబంధించిన రూ. 73.05 కోట్లను పరిహారం కింద పంపిణీ చేసినప్పటికీ మరో 53 ఎకరాలకు సంబంధించిన రూ. 4,15,736 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం రైతులు ఆందోళలనలు చేస్తున్నప్పటికీ వారి గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటున్నారు. సారవంతమైన భూములను బ్యారేజీ కోసం త్యాగం చేసినప్పటికి సర్కారు తమపై కఠినవైఖరి అవలంభిస్తుండడం సమంజసం కాదంటూ వారు వాపోతున్నారు. 53 ఎకరాలకు సంబంధించిన రూ.4,15,736 కోట్లను వెంటనే పంపిణీ చేయాలని రైతాంగం కోరుతోంది. 

హైలెవల్‌ కాలువల పరిహారంపై గందరగోళం

నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లోని మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ప్యాకేజీ నంబర్‌ 27, 28 కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. 27వ నంబర్‌ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన రైతులకు కొంత మేరకు పరిహారం డబ్బులను అందించినప్పటికీ 28వ ప్యాకేజీకాలువ కింద భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. 28వ ప్యాకేజీ కింద 562 ఎకరాల భూమికి సంబంధించి పరిహారం చెల్లించాల్సిఉంది. అయితే ప్యాకేజీ నంబర్‌ 27వ కాలువ కింద 64 ఎకరాల భూమి కోసం గానూ 111.78 కోట్లను రైతులకు చెల్లించినప్పటికీ మరో 263 ఎకరాల భూమికి పరిహారాన్ని అందించాలి. ఈ రెండు ప్యాకేజీల కింద భూములను కోల్పోయిన రైతులు పరిహారం డబ్బుల కోసం ఏళ్ల నుంచి ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తుతోందంటున్నారు. 

దయనీయంగా గుండెగావ్‌ బాధితుల దుస్థితి

భైంసా మండలంలో పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఇళ్లు, ఇతర ఆస్థులను కోల్పోయిన గుండెగావ్‌ బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటి వరకు వారి ఇళ్లనిర్మాణం కోసం రూపొందించిన ప్రతిపాదనలకు మోక్షం దక్కడం లేదు. దాదాపు 137 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు గానూ సంబంధిత అధికారులు రూ.63 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించి సర్కారుకు పంపారు. చాలా ఏళ్ల క్రితం ఈ ప్రతిపాదనలు రూపొందినప్పటికి ఇప్పటి వరకు వాటికి మోక్షం దక్కడం లేదంటున్నారు. ప్రతిఏటా వర్షకాలంలో గుండెగావ్‌ వాసులు పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ వరద నీటి ముంపుకు గురవుతుండడం సాధారణమయ్యింది. అయితే తాత్కలికంగా వీరికి పునరవాసం కల్పిస్తూ సర్కారు చేతులు దులుపుకుంటుందే తప్ప వారిని శాశ్వత ప్రాతిపాదకన ఆదుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2022-06-29T07:28:37+05:30 IST