Abn logo
Aug 26 2020 @ 00:45AM

కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి?

ఏఐసిసి సభ్యులంతా రాహుల్‌ను నేతగా ప్రతిపాదిస్తే ఆయన అందుకు అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఆయన తనకు అనుగుణంగా పార్టీని స్వేచ్ఛగా నిర్మించగలుగుతారా? పార్టీలో పేరుకున్న రుగ్మతలను దూరం చేయగలరా? ఆ తర్వాత దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం దిశగా ప్రజలు ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయా? చెప్పడం కష్టం. మోదీకి ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు కనీసం బలమైన ప్రతిపక్షమైనా జాతీయ స్థాయిలో ఏర్పడాలని కోరుకోవడం ఆత్యాశ కాదు.


‘గత ఆరునెలలుగా దేశం ఎన్నో రకాల సంక్షోభాలను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఆర్థిక వ్యవస్థ పతనోన్ముఖంగా సాగుతోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. పేదరికం రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటన్నికి తోడు భారత భూభాగంలోకి చైనా ప్రవేశించి దురాక్రమణకు పాల్పడింది.’ అని సోమవారంనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన తీర్మానంలో పేర్కొంది. ఇలాంటి వాక్యాలు కమ్యూనిస్టు పార్టీల తీర్మానాల్లోనూ కనపడతాయి. ప్రతిపక్షంలో ఉన్నవారెవరైనా దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇట్లాగే వ్యాఖ్యానిస్తారు. కాని పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే దేశంలో ప్రతిపక్షాలు ఎందుకు బలపడడం లేదు? ప్రతిపక్ష పార్టీలకు బలపడే శక్తి సామర్థ్యాలు కరువయ్యాయా? లేక ప్రజలు వాటిని ప్రతిపక్షాలుగా గుర్తించడం లేదా? వారు తమ పార్టీ సమావేశాల్లో వాస్తవాలనే ప్రస్తావిస్తున్నప్పటికీ ఎందుకు మొక్కుబడి తీర్మానాలుగా మిగిలిపోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు కూడా వామపక్ష పార్టీల తీర్మానాలుగా ఎందుకు కనపడుతున్నాయి?


కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ ప్రవాహ శీలత కోల్పోయినట్లు కనపడుతోంది. లేదా కాలానికి ఎదురీదుతున్నట్లు కనపడుతోంది. నిజానికి వర్కింగ్ కమిటీ తీర్మానంలో ప్రస్తావించిన అంశాలనన్నిటినీ కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ తరుచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. కొద్ది నెలలుగా ఆయన రోజూ నరేంద్రమోదీ పాలనపై మౌఖిక దాడులు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల ముందు రాఫెల్ కుంభకోణంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. పార్టీ పరాజయం చెందిన తర్వాత కొంతకాలం దిగ్భ్రాంతికి లోనై నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా మళ్లీ కోలుకుని విమర్శలను కురిపిస్తూనే ఉన్నారు. పిఎం కేర్స్ నిధి నుంచి ఫేస్‌బుక్‌తో బిజెపి మిలాఖత్ కావడం వరకూ రాహుల్ వ్యాఖ్యలు చేయనిరోజు లేదు.


అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా సంఘటితంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో గొంతు కలిపే సీనియర్ నేతలు అంతగా లేకపోవడం ఇందుకు ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడంటూ కనపడకపోవడం మరో కారణం. అంతేకాదు, ఏ పరిస్థితినైనా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజల్లో తనపై అభిమానం చెక్కుచెదరకుండా ఉండేందుకు నరేంద్రమోదీ ప్రదర్శిస్తున్న గజకర్ణ గోకర్ణ విద్యలను తిప్పిగొట్టగల వ్యూహరచన కాంగ్రెస్ చేయకలేకపోవడం కూడా ఇంకొక కారణం. 2019 ఎన్నికల్లో రెండవసారి పరాజయం చెందడం మాత్రమే కాదు, కనీసం వంద సీట్లు కూడా దాటకుండా కేవలం 52 సీట్లకు పరిమితం కావడం కాంగ్రెస్‌ను కుదేలు చేస్తే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని రాహుల్ అస్త్రసన్యాసం చేయడం పార్టీని మరింత నైరాశ్యంలో ముంచేసింది. దీనికి తోడు పులిమీద పుట్ర లాగా భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు ఆ పార్టీ ప్రభుత్వాలను కుప్పకూల్చడం, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం, సీనియర్ నేతల్ని సైతం ఆకర్షించడంతో పాటు కాంగ్రెస్ పునాదులను దెబ్బతీసేందుకు రకరకాల ఆయుధాలు ప్రయోగించడంతో పార్టీ అగమ్యగోచర పరిస్థితిలో పడింది.


ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుత్సిత రాజకీయాలు ఆ పార్టీ వ్రేళ్లను చెదపురుగులుగా ఎప్పుడూ పట్టి పీడిస్తుంటాయి. పైకి ఆ పార్టీని గాంధీ కుటుంబం నడిపిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అక్కడ నేతలు ఒకర్ని మరొకరు తొక్కేందుకు, ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక పదవి కోసం వందలాది మంది పోటీ పడుతుంటారు. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని అమలు చేయకుండా ఉండేందుకు, చేసినా సాధ్యమైనంత మేరకు ఆలస్యం చేసేందుకు రాజకీయాలు సాగుతుంటాయి. ఏఐసిసి ముందు స్వీట్లు పంచిపెడుతూ, డప్పులు వాయిస్తూ వంధిమాగధత్వాన్ని నిస్సిగ్గుగా ప్రకటించేందుకు కార్యకర్తల్ని ప్రోత్సహించిన నేతలే తాము అనుకున్నది జరగకపోతే వెన్నుపోట్లకు సిద్ధపడిన సంస్కృతి కూడా కాంగ్రెస్‌లో మనకు కనపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఒక పార్టీ కాదు, రకరకాల ముఠాల, వర్గాల, దళారుల కూటమి.


సోనియాగాంధీ చేతుల నుంచి రాహుల్ గాంధీ చేతుల్లోకి పగ్గాలు వచ్చే నాటికే కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి నెలకొంది. 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటికీ అప్పటికి రెండేళ్ల నుంచే కాంగ్రెస్ భవిష్యత్ పై కారుమేఘాలు కమ్ముకున్నాయి. అనారోగ్యంతో ఉన్న సోనియా సుదీర్ఘ కాలం విదేశాల్లో ఉన్న సమయంలో ఒక స్తబ్ధత నెలకొన్నది. నిజానికి అప్పటికే రాజకీయాల పట్ల నిరాసక్తంగా ఉన్న రాహుల్ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి ప్రదర్శించలేదు. దేశ రాజధాని అంతటా ప్రభుత్వ అవినీతిపై అన్నాహజారే ప్రభృతుల నిరసన ప్రదర్శనలు ముమ్మరంగా సాగుతున్నాయి. వామపక్షాలతో సహా మొత్తం ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్‌లో సభను స్తంభింపచేసిన రోజులవి. నాడు సుష్మాస్వరాజ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వామపక్షాలు కూడా హాజరు కావడంతో బిజెపి మహదానందం పొందింది. ఏమైతేనేం, సరైన సమయంలో మోదీ అనే మహాపురుషుడు రంగప్రవేశం చేయడం, బిజెపి అన్ని ఆయుధాలు ప్రయోగించి ఉవ్వెత్తున ప్రజాప్రభంజనాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం, అన్ని శక్తులూ వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆ సుడిగాలిలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. చరిత్రలో ఒక్కొక్కరూ ఒకో కాలంలో తమ పాత్ర పోషిస్తారు. మోదీ ఆవిర్భావంతోనే సోనియా పాత్ర ముగిసింది. పైగా ఆమె అనారోగ్యం దాచుకుని పార్టీని ఏదోరకంగా కాపాడేందుకు శాయశక్తులా పని చేయవలిసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం ఏమి చేయగలరు? నెహ్రూ మరణానంతరం ఇందిరకు, ఇందిర మరణానంతరం రాజీవ్ గాంధీకి, పివి తర్వాత సంధి దశలో సోనియాగాంధీకి పార్టీ, పగ్గాలు చేపట్టే అవకాశం లభించినట్లు రాహుల్ గాంధీకి అవకాశం రాలేదు. మోదీ ప్రభంజనం వెలుగులో కాంగ్రెస్ పార్టీయే అవసాన దశకు చేరుకుంటుందా అన్న తరుణంలో రాహుల్ గాంధీకి అవకాశం లభించింది. పైగా సోనియా, ఆమె చుట్టూ ఉన్న నేతలు నిర్ణయాలు కొన్ని సకాలంలో తీసుకోనందువల్లో, లేక బెడిసికొట్టినందువల్లో రాష్ట్రాల్లో కూడా పార్టీ దెబ్బతిన్న రోజులవి. ఒకవైపు ఎదురుగా మహాకాయుడైన మోదీ, మరో వైపు కుళ్లిపోతున్న పార్టీ వ్యవస్థ రాహుల్ ఎదుర్కోవాల్సి వచ్చింది.


అయినా రాహుల్ తప్పటడుగులతోనే తన పని ప్రారంభించారు. యువకావేశంలో కొంత సాహసంగా కూడా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయన మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఒక ఆర్డినెన్స్ ప్రతిని చించేయడం అందులో ఒకటి. అనర్గళంగా మాట్లాడేందుకు కూడా ఆయన కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భాషను సమయోచితంగా ప్రయోగించే లౌక్యం ఆయనకు తొలి రోజుల్లో అబ్బలేదు. క్రమంగా స్వీయ లోపాలనుంచి బయటపడే ప్రయత్నం చేసినా, గత నేతల కంటే భిన్నమైన, స్వచ్చమైన ఆలోచనలున్నా, దేశ సమస్యల గురించి అధ్యయనం చేసినా ఆయన తన భావాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ను మార్చుకోవడం సాధ్యపడలేదు. దేశంలో రాజకీయ సామాజిక మార్పులు ఉధృతంగా సంభవిస్తూ పార్టీని అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సిన తరుణంలో రాహుల్ వేయాల్సిన అడుగులు వేయలేకపోయారు. తనకంటూ టీమ్ ఏర్పరచుకున్నప్పటికీ మళ్లీ చుట్టూ అదే పాత నేతలు, అవే విషవలయాలు. ఒక వైపు సోనియా, ఆమె చుట్టూ స్వలాభాల కోసం మార్పును అడ్డుకునే నేతలు, మరో వైపు వివిధ రాష్ట్రాల్లో పాతుకుపోయిన పార్టీ వ్యవస్థల నేపథ్యంలో రాహుల్ అంతర్గత, బహిర్గత పోరాటాలు చేసి విఫలమైన తరుణంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.


గత ఏడాదిన్నరగా పార్టీలో నాయకత్వంపై చర్చ జరుగుతూనే ఉన్నది. రాహుల్ గాంధీ స్థానంలో మరొకరు ప్రత్యామ్నాయం లభించలేక మళ్లీ సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కాని సోనియా ఆరోగ్యంగా ప్రజల్లో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే తమకు కనపడే నేత కావాలంటూ 23 మంది నేతలు ఎట్టకేలకు ధైర్యంగా లేఖ రాయడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఇది 23 మంది నేతల సమస్య కాదు, మొత్తం పార్టీలో ఉన్న నేతలందరి సమస్య. కాని కాంగ్రెస్ పార్టీని ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు? గాంధీ కుటుంబం కాకుండా మరెవరికైనా పార్టీని నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్నదా? బిజెపిలో ఆడ్వాణీ విఫలమైన తర్వాత గుజరాత్ నుంచి మోదీని రంగంలోకి దించారు. అలా రాష్ట్రాలనుంచి నాయకులను పైస్థాయికి ప్రోత్సహించగలిగిన సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేనందువల్లే అది ఒక కుటుంబాన్ని నమ్ముకోక తప్పలేదు. అదే జరిగి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ దుస్థితిలో ఉండేది కాదు. అందుకే వర్కింగ్ కమిటీ ఏక గ్రీవంగా సోనియా-రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికి ఆరునెలల్లో నాయకత్వ సమస్యను పరిష్కరించే అధికారం అప్పగించింది. అంత మాత్రాన ఏఐసిసి సదస్సులో గాంధీ కుటుంబానికి చెందని వారిని నాయకుడుగా ఎన్నుకోవడం సాధ్యపడే అవకాశాలు లేవు. పోనీ ఏఐసిసి సభ్యులంతా రాహుల్‌ను నేతగా ప్రతిపాదిస్తే ఆయన అందుకు అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఆయన తనకు అనుగుణంగా పార్టీని స్వేచ్ఛగా నిర్మించగలుగుతారా? పార్టీలో పేరుకున్న రుగ్మతలను దూరం చేయగలరా? ఆ తర్వాత దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం దిశగా ప్రజలు ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయా? చెప్పడం కష్టం. మోదీకి ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు కనీసం బలమైన ప్రతిపక్షమైనా జాతీయ స్థాయిలో ఏర్పడాలని కోరుకోవడం ఆత్యాశ కాదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)