హాల్‌‘మార్క్‌’ ఏదీ?

ABN , First Publish Date - 2021-08-12T05:08:53+05:30 IST

శ్రావణ మాసం వచ్చేసింది. ఓ వైపు వరలక్ష్మీ వ్రతాలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఈ క్రమంలో జిల్లాలో బంగారం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా, బంగారం క్రయవిక్రయాల్లో కొందరు వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారా? ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఆభరణాలు విక్రయించాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో చాలా షాపుల్లో హాల్‌మార్క్‌ అనేది కనిపించడం లేదని తెలుస్తోంది.

హాల్‌‘మార్క్‌’ ఏదీ?
నరసన్నపేటలో హాల్‌మార్కు లేని బంగారం దుకాణం

బంగారం షాపుల్లో అమలుకాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు

కానరాని బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఆభరణాలు

బిల్లుల్లో నమోదుకాని సమగ్ర వివరాలు

మోసపోతున్న కొనుగోలుదారులు 

(నరసన్నపేట)

శ్రావణ మాసం వచ్చేసింది. ఓ వైపు వరలక్ష్మీ వ్రతాలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఈ క్రమంలో జిల్లాలో బంగారం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా, బంగారం క్రయవిక్రయాల్లో కొందరు వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారా? ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఆభరణాలు విక్రయించాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో చాలా షాపుల్లో హాల్‌మార్క్‌ అనేది కనిపించడం లేదని తెలుస్తోంది. కొనుగోలు చేసే సమయంలో ఆభరణంలో ఎంత శాతం బంగారం ఉంది అని వినియోగదారునికి స్పష్టంగా తెలిసేందుకు వీలుగా ప్రభుత్వం బీఐఎస్‌ హాల్క్‌మార్క్‌ ఉన్న ఆభరణాలను మాత్రమే విక్రయించాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం ఉన్న నగలను మాత్రమే విక్రయించాలని.. దానికి బీఐఎస్‌ హాల్‌మార్కు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన పాటించకుంటే ఆభరణం ధరకు ఐదు రెట్లు జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. సాధారణంగా 91.6 కేడీఎం ఆభరణాల్లో మాత్రమే బంగారం ఎంత శాతం ఉంటుందో వినియోగదారులు గుర్తించగలుగుతారు. మిగతా ఆభరణాల విషయంలో వ్యాపారులు చెప్పిందే మాట. ఆభరణాలు మార్చే సమయంలో అనుకున్న మేర బంగారం శాతం లేక చాలామంది నష్టపోతుంటారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు మూకుతాడు వేసేందుకు హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది. 


 జిల్లాలో ఇదీ పరిస్థితి

 శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస-కాశీబుగ్గ, బ్రాహ్మణతర్లా, సోంపేట, ఇచ్ఛాపురం, రాజాం, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, ఆమదాలవలస, రణస్థలంలో బంగారం దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 600 షాపులు ఉండగా..ఒక్క శ్రీకాకుళం, నరసన్నపేటలోనే 400 దుకాణాలున్నాయి, నరసన్నపేటలో ఏడు హోల్‌సేల్‌ షాపులు సైతం ఉన్నాయి. ప్రస్తుత శ్రావణ మాసం వేళ.. బంగారు ఆభరణాల విక్రయాలు ఊపందుకున్నాయి. కాగా, చాలావరకూ షాపుల్లో హాల్‌మార్క్‌ లేకుండా బంగారం క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బిస్కెట్‌ బంగారం ఎక్కువగా చలామణిలో ఉంటుంది. అభరణాలు తయారుచేసినా.. చేయించినా బంగారం ఎంత శాతం ఉన్నదో తెలుసుకునేందుకు హాల్‌మార్క్‌ను ముద్రించాలి. కానీ ఎక్కడా ముద్రించిన దాఖలాలు లేవు. నరసన్నపేటలో అయితే కొందరు వ్యాపారులు డమ్మీ ముద్రలు వేసి బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీఐఎస్‌ ముద్ర వేయించిన ఆభరణాలకు ఒక ధ్రువీకరణ పత్రం వస్తుంది. అవగాహన లేక వినియోగదారులు అంకె ఉన్న ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. బిల్లుల్లో కూడా సరైన వివరాలు నమోదు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంగారం క్రయ విక్రయాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-12T05:08:53+05:30 IST