సమైక్యత దినోత్సవం అర్థమేంటి?

ABN , First Publish Date - 2022-09-18T10:40:57+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవానికి అర్థమేంటో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..

సమైక్యత దినోత్సవం అర్థమేంటి?

  • కేసీఆర్‌ రాష్ట్ర చరిత్రను వక్రీకరిస్తున్నారు
  • కేంద్రం నిర్ణయంతో ఆయనలో ఆందోళన
  • దారుసలాంతో చర్చించి ‘సమైక్యత’ ప్రకటన:సంజయ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవానికి అర్థమేంటో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి, తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అభాసుపాలు చేసేందుకే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం నిర్వహించారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. ఈ జాతీయ సమైక్యత దినోత్సవం ఇన్నాళ్లూ ఎందుకు జరపలేదని నిలదీశారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత కేసీఆర్‌.. దారుసలాం నాయకత్వంతో చర్చించి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారని సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడి, అమరులైనవారి త్యాగాలను కేసీఆర్‌.. ఒవైసీ కుటుంబానికి దాసోహం చేశారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించడం సిగ్గు చేటని విమర్శించారు.


నేడు రాష్ట్రమంతటా ఆందోళనలు..

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ నిజాం పేరును ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. శనివారం రాత్రి జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వారిని కూడా ముఖ్యమంత్రి స్మరించలేదని పార్టీ నేతలు ఆరోపించారు. మజ్లిస్‌ నేత ఒవైసీ ఒత్తిడితోనే కేసీఆర్‌ ఈ వైఖరిని ఆనుసరించారని వారు విమర్శించారు. కాగా,  దేశంలో రాబోయే 25 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉద్ఘాటించారు.  శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బస్తీ సంపర్క్‌ అభియాన్‌ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని జూమ్‌ సమావేశం ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. 

Updated Date - 2022-09-18T10:40:57+05:30 IST