Advertisement
Advertisement
Abn logo
Advertisement

విడాకులే శరణ్యమా?

ఆంధ్రజ్యోతి(04-08-2020)

ప్రశ్న: డాక్టర్‌! మా అమ్మాయికి ఇటీవలే పెళ్లైంది. అల్లుడిది సంప్రదాయ కుటుంబం. అతను మంచివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను లైంగిక జీవితంలో చొరవ తీసుకోవడం లేదనీ, తమ అభిప్రాయాలూ, అభిరుచులూ కలవడం లేదనీ, అలాంటి వ్యక్తితో జీవితం కొనసాగించలేననీ మా అమ్మాయి అంటోంది. స్నేహితురాళ్ల వైవాహిక జీవితాలతో తనది పోల్చుకుని నిరుత్సాహపడుతోంది. అంతిమంగా విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. దాంతో అల్లుడిని వైద్యులకు చూపించాం. అతనిలో శారీరకపరమైన లోపం లేదని తేలింది. అలాంటప్పుడు మంచివాడైన అల్లుడిని వదులుకోవడం మాకు ఇష్టం లేదు. వీరి మధ్య సఖ్యత కుదిర్చే మార్గం లేదా? మందులతో ఉపయోగం ఉంటుందా?


- ఓ సోదరి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: అభిరుచులు, ప్రవర్తనలు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఏర్పడతాయి. మీ అల్లుడు సంప్రదాయ కుటుంబంలో, కఠినమైన కట్టుబాట్ల మధ్య పెరిగినట్టు అర్థమవుతోంది. మీ అమ్మాయి సిటీలో, స్వేచ్ఛగా పెరిగింది. కాబట్టి వీళ్లిద్దరి ఇష్టాఇష్టాల్లో, అభిప్రాయాల్లో, అభిరుచుల్లో తేడాలు ఉండడం సహజం. లైంగికపరమైన అంశాల్లో కూడా ఇద్దరి ఆలోచనలూ విభేధించవచ్చు. మీ అల్లుడికి ఉన్న ఇన్హిబిషన్స్‌ వల్ల అమ్మాయితో లైంగికంగా చొరవ చూపించలేకపోయి ఉండవచ్చు. ఆమె దూకుడుగా వ్యవహరించడంతో అతను మరింత బెరుకుగా వెనుకంజ వేస్తూ ఉండి ఉండవచ్చు. ఈ ధోరణితో మీ అమ్మాయి విసుగుచెంది విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని ఉంటుంది. అయితే విడాకులు తీసుకుని, మరో పెళ్లి చేసుకున్నా, అతనితో అన్ని అంశాలూ మ్యాచ్‌ అవుతాయని చెప్పలేం కదా? అలాంటప్పుడు మంచివాడైన భర్తని దూరం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మ్యారేజ్‌ కౌన్సెలర్ల చేత ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించండి. కోరికలు పెరిగే మందులు ఉన్నా అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే! సమస్య అతని శరీరంలో లేదు కాబట్టి మనసు మార్చి, అమ్మాయికి తగ్గట్టు నడుచుకునేలా కౌన్సెలింగ్‌ చేయాలి. కౌన్సెలింగ్‌తో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి అమ్మాయికి తగ్గట్టు నడుచుకునే వీలుంది. అలాగే మీ అమ్మాయి, సాటి స్నేహితురాళ్ల లైంగిక జీవితాలతో తన జీవితాన్ని పోల్చుతూ, అతన్ని అవమానించడం మానుకోమని చెప్పండి. పెరిగిన వాతావరణంతో భర్తకు అలవడిన ప్రవర్తనా తీరును అర్థం చేసుకుని, అతనిలో క్రమేపీ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించమనండి. అతను భయానికి లోను కాకుండా సున్నితంగా నచ్చచెప్పే ప్రయత్నం చేయమనండి. ఇలా నడుచుకుంటే క్రమేపీ ఇద్దరి మధ్యా సఖ్యత పెరిగి వారి మధ్య దూరాలు మాయం అవుతాయి.


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)


Advertisement
Advertisement