బడ్జెట్‌తో జిల్లాకేదీ ప్రయోజనం?

ABN , First Publish Date - 2021-05-21T07:14:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా చేకూరే ప్రయోజనాలేవీ కనిపించలేదు.

బడ్జెట్‌తో జిల్లాకేదీ ప్రయోజనం?

సాగునీటి పథకాలకు విదిలింపులే!

కాన్సెప్ట్‌ సిటీగా తిరుపతి 


తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా చేకూరే ప్రయోజనాలేవీ కనిపించలేదు. సాగునీటి పథకాలకు షరా మామూలుగానే స్వల్ప విదిలింపులతో సరిపెట్టారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు మొత్తంమీద గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించినా అందులో జిల్లాకు రానున్నది రూ. 525 కోట్లు మాత్రమే. అలాగే గాలేరు -నగరి ప్రాజెక్టు విషయానికొస్తే గతేడాది కేటాయింపులతో పోలిస్తే సగానికంటే తక్కువ నిధులే ఇచ్చారు. తిరుపతిని కాన్సెప్ట్‌ సిటీగా ప్రకటించినా విధి విధానాలేమిటో, దీనికి నిధుల కేటాయింపులేమిటో అన్నది వివరించలేదు.కొత్త బడ్జెట్‌లో జిల్లా ప్రయోజనాలేవీ పెద్దగా నెరవేరేలా కేటాయింపులు లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.


హంద్రీ-నీవాకు రూ. 525 కోట్లు

జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుగా ఓ వెలుగు వెలగాల్సిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు అంటే అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కలిపి రూ. 742.48 కోట్లు కేటాయించగా వాస్తవానికి విడుదల చేసింది మాత్రం రూ. 298.49 కోట్లే. దాంట్లో సింహభాగం అనంతపురం జిల్లాలోనే ఖర్చు చేశారు. జిల్లాకు వచ్చిందేమీ లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1042 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో రూ. 516.81 కోట్లు అనంతపురం జిల్లా పరిధిలో ఖర్చు చేయాల్సి వుంది. ఈ జిల్లాకు దక్కనున్నది రూ. 525 కోట్లు మాత్రమే.ఇందులో కూడా ఎంత మొత్తం విడుదలవుతుందనేది ఆర్థిక సంవత్సరం ఆఖరికి గానీ తెలియదు. జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల్లో 2018 నుంచీ ఎలాంటి పురోగతి లేదు. అప్పటి నుంచీ కాలువల పనులు గానీ, వాటి కింద పొలాలకు నీరందించేలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ గానీ నిర్మాణం కాలేదు. కనీసం ఇపుడున్న కాలువల్లో అడపాదడపా వచ్చే నీటిని చేరువలోని చెరువులకు మళ్ళించే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలువల్లో వచ్చే కొద్దిపాటి నీటిని చూసి మురవడం తప్ప జిల్లాకు ఒరుగుతున్నదేమీ లేదు. తాజా బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తుంటే మరో దశాబ్దమైనా ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.


గాలేరు-నగరికి స్వల్ప నిధుల విదిలింపు

గాలేరు-నగరి ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్‌లో రూ.1173.80 కోట్లు కేటాయించారు. అయితే చివరికి విడుదలైంది రూ. 564.54 కోట్లు మాత్రమే. ఈ నిధులన్నీ కూడా కడప జిల్లాలోనే ఖర్చయ్యాయి. పథకం ప్రధానంగా ఆ జిల్లాలోనే పూర్తయింది. ఈ జిల్లాలో అసలు పనులే జరగడం లేదు. కడప జిల్లా నుంచీ ప్రధాన కాలువ జిల్లాలోకి రావడానికి శేషాచల పర్వత శ్రేణి అడ్డుగా వుండడంతో అటవీ శాఖ అనుమతులు రాలేదు. వాటికోసం ప్రయత్నించే నేతలు కూడా జిల్లాలో కనిపించడం లేదు. ప్రస్తుతం కొత్త బడ్జెట్‌లో రూ. 250.15 కోట్లు అంటే గతేడాది ఇచ్చిన నిధుల్లో సగానికంటే తక్కువగా కేటాయించారు. ఇందులో విడుదలయ్యేది ఎంతో ఏడాది ముగిస్తే కానీ తెలియదు. ఆ నిధులు ఎన్నొచ్చినా ఈ జిల్లాలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అటవీ శాఖ అనుమతులు పెండింగ్‌లో వుండడం, నిధుల కేటాయింపులు ఈ రీతిలో వుండడంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికైనా పూర్తవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


ఎస్‌ఎస్‌ కెనాల్‌కు రూ. 57 కోట్లు... కృష్ణాపురం రిజర్వాయర్‌కు రూ. 6 కోట్లు

నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచీ ఈ జిల్లాలోని స్వర్ణముఖి నదిని అనుసంధానించే సోమశిల-స్వర్ణముఖీ లింక్‌ కెనాల్‌కు గతేడాది కంటే నిధుల కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయి. గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ. 10.10 కోట్లు కేటాయించగా ప్రస్తుత నూతన బడ్జెట్‌లో రూ. 57.05 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్‌ పనులన్నీ ఈ ఏడాది మొదలు పెట్టే అవకాశం ఏర్పడనుంది. ఆ మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రధానంగా మేలు చేకూరనుంది. అలాగే జిల్లాలోని కృష్ణాపురం రిజర్వాయర్‌ అభివృద్ధికి రూ. 6.12 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లో కూడా రూ. 6.60 కోట్లు కేటాయించగా అందులో విడుదలైంది రూ. 4.44 కోట్లు మాత్రమే. ఇపుడు కేటాయించిన నిధుల్లో ఎంత విడుదలవుతుందో వేచి చూడాల్సి వుంది.


కాన్సెప్ట్‌ సిటీపై స్పష్టత లేని ప్రకటన

రాష్ట్రంలో తిరుపతి, అనంతపురం, విశాఖపట్టణం నగరాలను కాన్సెప్ట్‌ సిటీలుగా ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో ప్రకటించింది. తొలి దశలో ఈ మూడు నగరాలను కాన్సెప్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. ఆర్థిక, ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు వ్యూహాత్మక దృష్టిని తీసుకురావడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నగరాలు ప్రభుత్వ తోడ్పాటుతో, ప్రైవేటు రంగం నేతృత్వంలో ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకమైన, సమగ్రమైన నమూనాలుగా వుంటాయని వివరించింది. మొదటి దశలో ఒక్కో కాన్సెప్ట్‌ సిటీకి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున అభివృద్ధి చేయడానికి ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొంది. ఇంతవరకూ బాగానే వున్నా అసలు ఈ కాన్సెప్ట్‌ ఏమిటన్నది జిల్లా ప్రజలకు అంతుబట్టడం లేదు. పరిశ్రమలకు కేటాయిస్తారా? లేక వ్యాపార సంస్థలకు అప్పగిస్తారా? ఏ రీతిలో అభివృద్ధి పరుస్తారు? అందులో ప్రజలకు కలిగే మేలేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వ ప్రకటనలో కనిపించలేదు. దీంతో ప్రస్తుతానికి ఇదో అస్పష్ట ప్రకటనగా మారింది. మొత్తంమీద నూతన బడ్జెట్‌తో జిల్లాకు పెద్దగా ప్రయోజనాలు చేకూరేలా కనిపించడం లేదు.


వెటర్నరీ వర్శిటీకి రూ. 146కోట్ల కేటాయింపు  

రాష్ట్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెంటర్నరీ యూనివర్శిటీకి రూ. 146కోట్లు కేటాయించినట్లు కంప్ర్టోలర్‌ డాక్టర్‌ సర్జన్‌రావ్‌ తెలిపారు. వర్శిటీ ఉద్యోగుల జీతాలు, కంటెంజెన్సీ కింద రూ. 104కోట్లు, మౌలిక వసతులు, పరిశోధన పరికరాల కొనుగోళ్ళకు ఆర్‌ఐడీఎఫ్‌ కింద రూ. 42కోట్లు కేటాయించినట్లు తెలిపారు.గతేడాది రూ. 124కోట్లు కేటాయించగా ఈ ఏడాది మరో రూ. 22కోట్లు పెంచి రూ.146కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-05-21T07:14:07+05:30 IST