వర్సిటీలు, కళాశాలలు మూస్తామని చెబుతూ.. బడులను ఎలా తెరుస్తారు?

ABN , First Publish Date - 2022-01-29T13:54:50+05:30 IST

ఓవైపు విశ్వవిద్యాలయాలు, అనుబంధ వసతి గృహాలు, కళాశాలలను మూసివేయాలనే ఆలోచన చేస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను ఏ ప్రాతిపదికన తెరుస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు కోటిమంది వరకు హాజరయ్యే మేడారం సమ్మక్క- సారక్క జాతర సందర్భంగా కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ..

వర్సిటీలు, కళాశాలలు మూస్తామని చెబుతూ.. బడులను ఎలా తెరుస్తారు?

ఇందుకు ప్రాతిపదిక ఏమిటి?

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ప్రశ్న

నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం

మేడారంలో కొవిడ్‌ కట్టడి ఎలా..?

పిల్లల వైద్య సదుపాయాలపైనా అఫిడవిట్‌కు ఆదేశం


హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఓవైపు విశ్వవిద్యాలయాలు, అనుబంధ వసతి గృహాలు, కళాశాలలను మూసివేయాలనే ఆలోచన చేస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను ఏ ప్రాతిపదికన తెరుస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు కోటిమంది వరకు హాజరయ్యే మేడారం సమ్మక్క- సారక్క జాతర సందర్భంగా కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని ఆదేశాలు జారీచేసింది. కొవిడ్‌ టెస్టులు, చికిత్స, మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం  శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రైవేటు ల్యాబుల్లో చేసే కొవిడ్‌ టెస్టుల వివరాలు రోజువారీ కేసుల వివరాలకు కలపడం లేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. కేసుల లెక్కల్లో పారదర్శకత లేదని.. పిల్లల చికిత్సకు నిలోఫర్‌ ఒక్కటే ప్రత్యేక ఆస్పత్రిగా ఉన్నదని తెలిపారు.


జ్వర సర్వేలో పంపిణీ చేసిన మందులను పిల్లలకు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌   ప్రమాదకరం కాదని.. ఐసొలేషన్‌ అవసరం లేదనే భావన ప్రజల్లో పెరిగిపోయిందని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పాఠశాలలను తెరిచే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేస్తామన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ నిర్ణయాల వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పిస్తామని తెలిపారు. మరోవైపు పిల్లల వైద్యానికి సంబంధించి నిలోఫర్‌ సహా అన్ని ఆస్పత్రుల్లో  ఏర్పాట్లు చేశామని.. విచారణకు హాజరైన ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. దాదాపు 6 వేల బెడ్స్‌   అందుబాటులో ఉన్నాయని చెప్పారు. చిన్నారులు కొవిడ్‌కు గురైన ఉదంతాలు చాలా తక్కువని.. గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క చిన్నారి చికిత్స కోసం చేరారని పేర్కొన్నారు. జ్వర సర్వేలో 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని.. దాదాపు 77 లక్షల ఇళ్లను కవర్‌ చేశామని పేర్కొన్నారు. కాగా వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. పిల్లల చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు.. పాఠశా లలు తెరవడం, మేడారం జాతర తదితర అంశాలపై వచ్చే విచారణ నాటికి అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశాలిచ్చింది. 


సంతల్లో జనం గుమిగూడినట్లు కనిపించలేదు: సీజే సతీశ్‌చంద్రతాను హైదరాబాద్‌లో ఒంటరిగా తిరుగుతూ అన్నీ పరిశీలిస్తానని.. వారపు సంతల్లో జనాలు భారీగా ఒక్కచోట చేరిన ఘటనలు కనిపించ లేదని చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ పేర్కొన్నారు. సంతల్లో పేదలు, రోజుకు చాలా తక్కువ మొత్తంలో సంపాదించుకునే వారు కూరగాయలు విక్రయిస్తారని.. వాటిని రద్దు చేయడం వల్ల వారి ఉపాధి పోతుందని తెలిపారు. అయితే కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామన్నారు. చీఫ్‌ జస్టిస్‌ నివాసం ఉండే కాలనీలో సైతం సంత జరుగుతున్నదని.. సంతల వల్ల కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నదని న్యాయవాదులు ప్రస్తావించగా.. ‘‘పేదవాళ్లు కూడా బతకాలి కదా.. సంతల్లో భారీగా గుంపులు లేవనడానికి నేనే సాక్షి. నా భద్రతపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-01-29T13:54:50+05:30 IST