నేరేడుపళ్ళు తినడం వల్ల లాభాలు..

ABN , First Publish Date - 2020-08-06T23:27:05+05:30 IST

మార్కెట్లో నేరేడుపళ్ళు దొరుకుతున్నాయి. వీటిని తినడం వలన ఉపయోగాలేమిటి?

నేరేడుపళ్ళు తినడం వల్ల లాభాలు..

ఆంధ్రజ్యోతి(06-08-2020)

ప్రశ్న: మార్కెట్లో నేరేడుపళ్ళు దొరుకుతున్నాయి. వీటిని తినడం వలన ఉపయోగాలేమిటి?


- కొమురయ్య, సింగరేణి

 

డాక్టర్ సమాధానం: నేరేడుపళ్లు జూన్‌, జులై, ఆగస్టు (ఆషాఢ, శ్రావణ) మాసాలలో విరివిగా లభిస్తాయి. నేరేడుపళ్లను ఆయుర్వేదంలో వివిధ రుగ్మతలకు మందుగా వాడేవారు. కృత్రిమ ఇన్సులిన్‌ను కనుక్కోక ముందురోజుల్లో వీటిని మధుమేహానికి చికిత్సలో వినియోగించేవారు. విటమిన్‌ ’సి‘, ఫోలిక్‌ యాసిడ్లతో పాటు, పొటాసియం, జింకు, ఇనుము లాంటి అనేక ఖనిజాలు కూడా నేరేడు పళ్లలో పుష్కలంగా లభిస్తాయి. నేరేడుపళ్లకే ప్రత్యేకమైన రంగు రుచి వాటిలో ఉండే ఆంథోసైయానిన్లు, ఫ్లావనాయిడ్లు, టెర్పిన్లు అనే రసాయనాల కారణంగా వస్తాయి. ఈ రసాయనాలే నేరేడుపళ్లకు వైవిధ్యభరితమైన సూక్ష్మజీవనాశక, వైరస్‌ నాశక లక్షణాలతో పాటు, వాపును తగ్గించే గుణాలు, క్యాన్సర్‌ నిరోధక, ఎలర్జీ నిరోధక, వృద్ధాప్య నిరోధక గుణాలు ఉన్నాయి. నేరేడుపళ్లకు ఉన్న రోగనిరోధక లక్షణాలు, కాలేయాన్ని కాపాడే లక్షణాలు, నీళ్లవిరేచన నిరోధక లక్షణాలు శాస్త్రీయ పరిశోధనలలో రుజువయ్యాయి. ఈ పళ్లను నేరుగా తినడంతోపాటు, వాటితో జ్యూస్‌, జామ్‌ తదితర రకాల తినుబండారాలు కూడా చేసుకోవచ్చు. నేరేడు గింజలు వేసి కాచిన నీళ్లను తాగితే రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిసెరైడ్స్‌ను తగ్గిస్తుందని కూడా కొన్ని  పరిశోధనలు చెబుతున్నాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-08-06T23:27:05+05:30 IST