అగ్రవర్ణ పేదలకు ఏమిటీ అన్యాయం?

ABN , First Publish Date - 2020-07-01T07:08:43+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పే ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ దృష్టికి అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయం రాకపోవడం దురదృష్టకరం. అగ్రవర్ణ పేదవర్గాలకు ఆసరా...

అగ్రవర్ణ పేదలకు ఏమిటీ అన్యాయం?

అన్ని వర్గాల సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పే ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ దృష్టికి అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయం రాకపోవడం దురదృష్టకరం. అగ్రవర్ణ పేదవర్గాలకు ఆసరా అందించేందుకు 2019 లో నరేంద్రమోదీ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ నియామకాలలో, పలు రాష్ట్రాల్లో ఇది అమలవుతున్నది. కాని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంగా దీనిపై నిర్ణయం తీసుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇ.డబ్ల్యూ.యస్‌. రిజర్వేషన్‌ అమలు చేయకపోవడం వల్ల దాదాపు 15000 మంది నిరుద్యోగులు ఇప్పటికే అవకాశాలు కోల్పోయారు. 2019 ఆగస్టులో గ్రామ సచివాలయ నోటిఫికేషన్‌లో 10% రిజర్వేషన్‌ అమలు చేయనందువల్ల 13000 మంది విద్యార్ధులు నష్టపోయారు.


ఎ.పి.పి.యస్‌.సి. 2019 జనవరి నుండి ఇ.డబ్ల్యూ.యస్‌. అమలు చేయకపోవడం వల్ల పంచాయితి సెక్రటరీ-3, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులలో అగ్రవర్ణ పేదలు నష్టపోయారు. వైద్య ఆరోగ్యశాఖలో ప్రకటించిన 6000 ఉద్యోగాలలో ఆరువందల ఉద్యోగాలు కోల్పోతున్నారు. సమన్యాయం చేయాల్సిన హైకోర్టు సైతం ఆఫీసు సబార్డినేట్‌ & డ్రైవర్స్‌ 111 ఉద్యోగాలలో 10% రిజర్వేషన్‌ అమలు చేయకపోవడం దురదృష్టకరం. గ్రామసచివాలయంలో మిగిలిన 17, 000 ఉద్యోగాలకు ఇ.డబ్ల్యూ.యస్‌. అమలు చేయకుండానే ఆగస్టులో పరీక్ష నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది సరికాదు. రాష్ట్రంలో రాబోవు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, యస్‌.ఐ.,కానిస్టేబుల్స్‌, టీచర్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ వంటి నియామకాల్లో 10% ఇ.డబ్ల్యూ.యస్‌. రిజర్వేషన్‌ అమలు చేసి అగ్రవర్ణ పేదలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం రిజర్వేషన్లు అమలు చేసి 18 నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చోటు కల్పించకపోవడం అన్యాయం. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇందులోనుంచి కాపులకు 5% కేటాయించి అగ్రవర్ణ పేదల అవకాశాలకు కొంతమేరకు గండికొట్టింది. రాష్ట్రంలో 10% ఇ.డబ్ల్యూ.యస్‌. రిజర్వేషన్‌ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అగ్రవర్ణ పేదలకు న్యాయం జరిగేలా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాము. 

డి.ఆర్‌.వి. పవన్‌ కుమార్‌,  నాగార్జున విశ్వవిద్యాలయం

Updated Date - 2020-07-01T07:08:43+05:30 IST