యూరియా ఏదయా..!

ABN , First Publish Date - 2022-07-06T05:23:21+05:30 IST

జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు సాగుచేస్తున్నారు. పంటల సాగుకు తగ్గట్టుగా యూరియాకు, డీఏపీకి డిమాండ్‌ నెలకొంది. ప్రభుత్వం నుంచి జిల్లాకు డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా, డీఏపీ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యూరియా ఏదయా..!
పలు ప్రాంతాల్లో నిల్వ ఉన్న యూరియా

- జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టు లేని ఎరువుల నిల్వలు

- కొన్ని సొసైటీల్లో నో స్టాక్‌.. లోడ్‌ వచ్చిందంటే అర గంటలో ఖాళీ

- సొసైటీలు, ప్రైవేట్‌ డీలర్ల వద్దనే అరకొరగా యూరియా, డీఏపీ

- జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన యూరియా 12,244 మెట్రిక్‌ టన్నులు

- డీఏపీ 1,507 మెట్రిక్‌ టన్నులు

- ప్రస్తుతం 8,380 మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాలో స్టాక్‌

- సొసైటీల వద్ద ఎరువుల కోసం రైతుల బారులు


కామారెడ్డి, జూలై 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు సాగుచేస్తున్నారు. పంటల సాగుకు తగ్గట్టుగా యూరియాకు, డీఏపీకి డిమాండ్‌ నెలకొంది. ప్రభుత్వం నుంచి జిల్లాకు డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా, డీఏపీ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీలు ప్రైవేట్‌ డీలర్ల వద్ద సైతం ఎరువుల నిల్వలు అరకొరగా ఉంటున్నాయి. ప్రాథమిక సహకార సంఘాలకు యూరియా లోడ్‌ వచ్చిందంటే చాలు రైతులు ఎగబడి తీసుకెళ్తుండడంతో ఆ లోడ్‌ అర గంటలోనే ఖాళీ అయిపోతుండడంతో ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జిల్లాలో ఏదో ఒకచోట యూరియా కోసం రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన యూరియా నిల్వలు అయిపోవడంతో ఎరువులను తెప్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 1500 మెట్రిక్‌ టన్నుల డీఏపీ వచ్చింది. ఆ యూరియా మొత్తం ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రస్తుతం 8 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాకు వచ్చిన 13వేల మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో వర్షాకాలం సీజన్‌లో 67వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అధికారులు నిర్ధేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రావడమే కాకుండా ఈ స్టాక్‌ పూర్తిగా అయిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 5.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాశాఖ అంచనా వేసింది. అయితే ఈ పంటల సాగుకు తగ్గట్టుగా 67వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కానుంది. అదేవిధంగా 8,716 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం కానుంది. ఇప్పటి వరకు వచ్చిన 12,224 మెట్రిక్‌ టన్నుల యూరియాను, 1,507 మెట్రిక్‌ టన్నుల డీఏపీని ఆయా సొసైటీలకు ప్రైవేట్‌ డీలర్లకు సరఫరా చేశారు. ఈ ఎరువుల నిల్వలు కూడా దాదాపు అన్ని సొసైటీల్లో అయిపోయాయి. ప్రస్తుతం కేవలం 8,382 మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

పీఏసీఎస్‌, ప్రైవేట్‌ డీలర్ల వద్ద అరకొర యూరియా

జిల్లాలో ఈ వర్షాకాలంలో విస్తారంగానే పంటలు సాగు కానున్నాయి. ఇప్పటికే లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటలైన సోయాబీన్‌, పత్తి, మొక్కజొన్న, కందులు, మినుములు, పెసర్లతో పాటు మరో 20వేల ఎకరాలలో వరి పంట వేశారు. దీంతో రైతుల నుంచి యూరియా, డీఏపీ ఎరువులకు డిమాండ్‌ వస్తోంది. ఎరువుల నిల్వలు సరిపడా లేకపోవడంతో డీఏపీని రైతులు వాడుతున్నారు. ప్రైవేట్‌ డీలర్ల వద్ద డీఏపీ ధర ఎక్కువగా ఉండడంతో సహకార సంఘాలను ఆశ్రయిస్తున్నారు. ప్రాఽథమిక సహకార సంఘాలు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద సైతం అరకొరగానే ఎరువుల నిల్వలు ఉన్నాయి. చాలా మంది రైతులు ముందస్తుగానే యూరియాను పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేసి తరలించేశారు. యూరియా తక్కువ ధర ఉండడంతో రైతుల నుంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. వరి మొక్కజొన్న, పత్తి, సోయా తదితర పప్పు దినుసు పంటల సాగు కోసం రైతులు ఎక్కువ మొత్తంలో యూరియాను ఉపయోగిస్తుండడంతో సొసైటీలు, డీలర్ల వద్ద స్టాక్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో కొరత ఏర్పడుతోంది. 

అధికంగా వినియోగించడంతోనే కొరత

జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న, పత్తి, సోయా, పెసర, కందులు, మినుము లాంటి పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తుంటారు. ఇప్పటికే లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. మొక్కజొన్న, పత్తి, సోయా పప్పుదినుసు పంటలకు సైతం ఎకరానికి మూడు నుంచి నాలుగు యూరియా బస్తాలు వాడుతున్నారు. ఒక బస్తా వాడితే చాలంటున్నారు. ఇలా జిల్లాలో రైతులు యూరియా తక్కువ ధరలకు వస్తున్నాయి కదా అనే భావనతో పంటలకు మోతాదుకి మించి యూరియాను వాడుతుండడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. మరికొందరు రైతులు అవసరం లేకున్నా అధిక మొత్తంలో కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకుంటున్నారు. దీంతో జిల్లాలో యూరియా నిల్వలు తగ్గిపోతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.


సొసైటీలకు సరఫరా చేస్తున్నాం

- భాగ్యలక్ష్మీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కామారెడ్డి

జిల్లాలో సరిపడా యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం 8,382 మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ అందుబాటులో ఉంది. వీటితో పాటు కాంప్లెక్స్‌, ఎంవోపీ ఎరువులు కూడా ఉన్నాయి. ఈ యూరియాను ఇప్పటికే ఆయా సొసైటీలకు సరఫరా చేశాం. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు సైతం పంటలకు అవసరం మేరకే యూరియాను ఉపయోగించాలి. కొందరు అవసరం కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Updated Date - 2022-07-06T05:23:21+05:30 IST