వైఎస్ షర్మిలకు టచ్‌లోకి వచ్చిన కీలక నేతలు.. త్వరలోనే...!?
ABN , First Publish Date - 2021-02-19T20:40:23+05:30 IST
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ..
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీపై ఎలాంటి చర్చ జరుగుతోంది? రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీని షర్మిల పార్టీ ఢీకొడుతుందా? ఆమె వెంట నడవాలనుకునే రాష్ట్రంలో ఉన్న క్యాడర్‌కు ఆమె ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందన ఎలా ఉంది? తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఆమె కార్యాచరణ ఎలా ఉంది? అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.
రకరకాలుగా విశ్లేషణలు
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. ఆమె పార్టీ పెడితే నిలబడుతుందా? ఇప్పటికే పార్టీ పెట్టి కొన్నాళ్లకే జెండా పీకేసినట్లుగా..షర్మిల పార్టీ చాపచుట్టేస్తుందా? రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీలను ఢీకొడుతుందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను కాదని..టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి క్రమంలో షర్మిల పార్టీ పెడితే పరిణామాలు ఎలా ఉంటాయని రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
జగన్ జైలుకు వెళ్లిన సమయంలో..
తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ప్రజల నుంచి మద్దతు సరే..కానీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ క్యాడర్ ఆమెతో కలిసివస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆమె పార్టీ స్థాపిస్తే ఆమె వెంట ఎవరెవరు వస్తారు? ఆ పార్టీలోకి వెళ్తే తమ భవిష్యత్ ఏమిటి అని ఆలోచినస్తున్న వారికి షర్మిల టీమ్ చెబుతున్న మాటలు నమ్మకాన్ని నింపుతున్నాయట. అయితే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు షర్మిల దగ్గర ప్రస్తావించారట. ఈ సందర్భంగా వైసీపీ బలోపేతం కోసం తాను చేసిన కృషి ఏమిటో వారికి వివరించారట షర్మిల. జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన సమయంలో.. అప్పటికీ ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ వెళ్లూనుకోని పరిస్థితి. జగన్‌కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
నేను పడిన కష్టం తెలుసు..
జగన్‌ను జైలుకు పంపడంతో ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్న సమయంలో..తాను రంగ ప్రవేశం చేసినట్లు షర్మిల చెప్పారట. వైసీపీ శ్రేణులను అయోమయం ఆవరించిన సందర్భంలో నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపాననీ..ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన సంగతి గుర్తుచేస్తున్నట్లు టాక్. ఉప ఎన్నికల్లో విజయంతోనే ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీకి అసలైన పునాది ఏర్పడిందని షర్మిల వారికి చెబుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత షర్మిల చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆ పార్టీకి మైలేజ్ తెచ్చిందని చెబుతున్నారు. ఇలా వైసీపీ బలోపేతం కోసం జగన్ మోహన్ రెడ్డితో పాటు అదే స్థాయిలో షర్మిల తన భాగస్వామ్యం ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న ప్రతిఒక్కరూ తమ హోదాల వెనుక షర్మిల కష్టం ఉందని మరిచిపోకూడదంటున్నారు. ఇవాళ పదవుల్లో ఉన్న కొందరు నాయకులకు ఆ విషయం తెలియకపోయినా.. మొదట్నుంచీ వైసీపీలో పనిచేసిన నాయకులకు నేను పడిన కష్టం తెలుసని షర్మిల గుర్తుచేస్తున్నారట.
షర్మిలకు టచ్‌లోకి ముఖ్యనేతలు!?
తెలంగాణలో పార్టీ పెట్టాలన్న తన ఆలోచనకు అన్న జగన్‌తో ఉన్న విభేదాలకు ఏమాత్రం సంబంధం లేదనీ షర్మిల క్లారిటీ ఇస్తున్నారట. తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్ణయించుకున్నాకే పార్టీ ఏర్పాటుకు సంకల్పించినట్లు చెప్పారట. ఏపీలో వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి బలమైన పునాది పడేందుకు ఎలా కృషి చేశానో..తెలంగాణలో కూడా అదే స్థాయిలో జనంలోకి తీసుకెళ్తానని..పార్టీలోకి వస్తామనే వారికి భరోసా ఇస్తున్నారట షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో మేం చూసిన మాట తప్పని నైజం షర్మిలలో కూడా చూశామని ఆమెను కలిసి బయటకు వచ్చిన పలువురు నాయకులు..కొత్తగా షర్మిల వైపు చూడాలనుకుంటున్నవారికి చెబుతున్నారట. పార్టీ ప్రకటన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులే కాకుండా అధికార పార్టీలోనూ కొంతమంది ముఖ్యనాయకులు ఆమెతో టచ్‌లోకి వచ్చారట.
హాట్.. హాట్ టాపిక్‌గా!
షర్మిల ఖమ్మం మీటింగ్ తర్వాత సదరు నాయకులు నేరుగా షర్మిలతో కలిసి అడుగులు వేయబోతున్నారట. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి కీలక ప్రణాళికలకు షర్మిల తుది రూపం దిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కొత్త పార్టీని బలోపేతం చేసే క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ఎవరితోనైనా, ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగానే ఉన్నానని షర్మిల చెబుతున్నట్లు సమాచారం. పార్టీ పెట్టకముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న షర్మిల.. పార్టీ ఏర్పాటు తర్వాత ఎలా దూసుకెళ్తారన్నది పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.