కొత్తగా కొన్న సిమ్‌ను ఫోన్‌లో వేయగానే వచ్చిన మెసెజ్‌ను చూసి షాక్.. ఫ్రెండ్‌కు చూపిస్తే పక్కా స్కెచ్.. రూ.16 లక్షలు..

ABN , First Publish Date - 2021-08-10T22:52:30+05:30 IST

ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

కొత్తగా కొన్న సిమ్‌ను ఫోన్‌లో వేయగానే వచ్చిన మెసెజ్‌ను చూసి షాక్.. ఫ్రెండ్‌కు చూపిస్తే పక్కా స్కెచ్.. రూ.16 లక్షలు..

ఇంటర్నెట్ డెస్క్: ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇక్కడ నివసించే గౌరవ్ గుప్తా అనే వ్యక్తికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక ఖాతా ఉంది. తన ఆధార్‌కు లింక్ అయిన నంబరునే ఆ బ్యాంకులో ఇచ్చాడతను. అయితే కొంతకాలంగా రీచార్జ్ చేయకపోవడంతో ఆ నంబర్ బ్లాక్ అయిపోయింది. ఈ విషయం తెలిసి తన బ్యాంకు ఖాతాకు ఇచ్చిన మొబైల్ నంబరును మార్చాలంటూ అతను దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ పని జరగలేదు. ఈలోగా ఢిల్లీకి చెందిన విపిన్ రాఠోర్ అనే వ్యక్తికి ఈ మొబైల్ నంబర్ ఎలాట్ అయింది.


కొత్తగా తీసుకున్న సిమ్ నంబరుకు బ్యాంకు ఖాతాకు సంబంధించిన మెసేజ్ రావడంతో విపిన్ ఆశ్చర్యపోయాడు. సైబర్ నేరాలు చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన మిత్రుడు భాను ప్రకాష్ శర్మకు ఈ విషయం చెప్పాడు. ఆ మెసేజ్ చూడగానే భాను మదిలో ఒక ప్లాన్ మెదిలింది. దాని ప్రకారం, గౌరవ్ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేయాలని అనుకున్నాడు. దీనికి సహకరిస్తే విపిన్‌కు రూ.8లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత అదే నంబరుతో ఉన్న ఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి దీపక్ అనే యువకుడితో రూ.1.3లక్షల డీల్ చేసుకున్నాడు. అనంతరం యూట్యూబ్‌లో చూసి మొబైల్ నంబరుతో ఆధార్ ఎలా తీసుకోవచ్చో తెలుసుకున్నాడు.


అంతా అనుకున్నట్లే జరిగింది. గౌవర్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసి, దానిపై విపిన్ ఫొటో తగిలించారు. ఈ డాక్యుమెంట్లన్నీ బ్యాంకుకు చూపించి కొత్త డెబిట్ కార్డు తీసుకున్నారు. అది చేతికి రాగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.16 లక్షలను త్రిలోక్ శర్మ అనే యువకుడి ఖాతాకు పంపారు. ఆ తర్వాత ఈ సొమ్మును అందరూ పంచుకున్నారు. తన వద్ద ఉన్న డబ్బుతో త్రిలోక్ శర్మ.. ఒక పాత ఆర్టిగా కారు కూడా కొనుక్కున్నాడు. తన ఖాతాలో ఇలా భారీమొత్తంలో డబ్బుపోవడంతో గౌరవ్ పోలీసులను ఆశ్రయించాడు. జూలై 31న కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాలా కష్టం మీద జరిగిన మోసాన్ని కనిపెట్టారు. భాను ప్రతాప్ శర్మ, త్రిలోక్ శర్మ, దీపక్, విపిన్ రాఠోర్‌ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా భాను ఇంతకు ముందు కూడా చాలా మోసాలు చేసినట్లు తేలింది. డాభాలు, రెస్టారెంట్లకు ఫుడ్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ గూగుల్ యాడ్స్ ఇచ్చిన భాను.. అతని సోదరుడితో కలిసి రూ.కోటిపైగా మోసాలకు పాల్పడినట్లు తేలింది.

Updated Date - 2021-08-10T22:52:30+05:30 IST