..దీని మర్మమేమి రామా!

ABN , First Publish Date - 2021-09-12T04:59:59+05:30 IST

..దీని మర్మమేమి రామా!

..దీని మర్మమేమి రామా!
నిత్యకల్యాణ మండపం పక్కన నేరుగా నగదుకే లడ్డూలను విక్రయించే ప్రసాదం కౌంటర్‌ ఇదే..

భద్రాద్రిలో ప్రసాద పంపిణీలో లోపిస్తున్న పారదర్శకత

ప్రధాన కౌంటర్‌లో నగదుతోనే లడ్డూ విక్రయాలు

అమలుకు నోచుకోని కంప్యూటరైజ్డ్‌ టికెట్ల జారీ

అమలుకు నోచుకోని ‘విజయవాడ’ విధానం 

భద్రాచలం, సెప్టెంబరు 11: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో లడ్డూల విక్రయాల్లో అవకతవకులు తరచూ జరుగు తూనే ఉన్నాయి. దశాబ్ధాలుగా ఇలా జరుగుతున్నా అధికారులు పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాల్లో లడ్డూ ప్రసాద విక్రయాలు, ఆర్జిత సేవల్లో కంప్యూటర్‌ ఆధారిత టికెట్ల జారీ విధానం అమలవుతోంది. భద్రాద్రి దేవస్థానంలోనూ గతంలో కొంతకాలం ఈ విధానం అమలైనా తరువాత ఈ విధానానికి స్వస్తి చెప్పారు. దీంతో అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని దేవస్థానం ఉద్యోగులే చెబుతుండడం గమనార్హం. భద్రాద్రి రామాలయంలో తరచూ వందలు, వేల సంఖ్యలో లడ్డూలు మాయం కావడం, లడ్డూల లెక్కల్లో అవకతవకలు జరగడం ‘ఆంధ్రజ్యోతి’తో పాటు పలు పత్రికల్లో తరచూ కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా తాత్కాలికంగా తప్పులను సరిదిద్దిమే తప్పించి శాశ్వత దిద్దుబాటుపై దృష్టిసారించడం లేదు. దీంతో మళ్లీ అదే తప్పులను పునరావృతమవ్వడం దేవస్థానంలో రివాజుగా మారింది. గతంలో దేవస్థానంలో ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు రీసైక్లింగ్‌ అయిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి వాటిని అరికట్టేం దుకు కంప్యూటరైజ్డ్‌ టికెట్ల జారీ విధానం ఎంతో సురక్షితం, పారదర్శక మని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే అధికారులు ఇంతటి ముఖ్యాం శంపై దృష్టిసారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

‘విజయవాడ’ విధానం అమల్లో జాప్యమెందుకు

ఏపీలోని విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో గతంలో లడ్డూల విక్రయాలను చేపట్టేందుకు ఇడ్లీ ట్రే విధానాన్ని అమలు చేశారని, అది సత్పలితాలను ఇవ్వడం కూడా జరిగిందని పలువురు ఉద్యోగులు కూడా పేర్కొంటున్నారు. అదే విధానం భద్రాచలంలో అమలు చేయాలనే సంక ల్పంతో గతంలో దేవస్థానం ఈవో ఒకరు ఆ ట్రేలను కొనుగోలు చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆ విధానం కార్యరూపం దాల్చకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ కౌంటర్లో అన్ని నగదు విక్రయాలే 

రామాలయంలోని తూర్పుమెట్ల నుంచి బయటకు వెళ్లే మార్గంలో నిత్యకల్యాణ మండపం పక్కన ఉన్న లడ్డూ కౌంటర్లో లడ్డూ విక్రయా లన్నీ నగదుతోనే సాగుతున్నాయి. వాస్తవానికి ప్రసాదాల విక్రయాలకు తప్పనిసరిగా నగదు చెల్లించి ప్రసాదాల కొనుగోళ్లకు సంబంధిం చిన టికెట్లు తీసుకొని అనంతరం ప్రసాదాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కౌంటర్లో ఆ విఽధానం ఏదీ అమలు కావడం లేదు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే ఒకరు ఒత్తిడి మేరకే ఆ కౌంటర్‌ను నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల ఈ కౌంటర్లో 200 కల్యాణ లడ్డూలు విక్రయించగా ఆ మొత్తానికి లెక్కలు లేకపోవడంతో అధికారుల తనిఖీలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా లడ్డూ తయారీ నిర్వహించే బాధ్యులు సైతం సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తుండటం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-09-12T04:59:59+05:30 IST