కరోనా కాలంలోనూ ఇదేం తీరు?

ABN , First Publish Date - 2020-06-30T07:54:34+05:30 IST

వైరస్‌ కట్టడి విషయంలో జీహెచ్‌ఎంసీ భిన్న వైఖరి ప్రదర్శిస్తోంది. నివారణ చర్యల్లో వివక్ష చూపుతోంది. కేసులు నమోదు కాని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఇళ్లలోనూ ప్రత్యేక శానిటైజేషన్‌ చేస్తూ.. పాజిటివ్‌ వచ్చిన పేదలు, మధ్య తరగతి వర్గాలుండే బస్తీలు

కరోనా కాలంలోనూ ఇదేం తీరు?

  • వైరస్‌ కట్టడిలో సర్కారు వివక్ష
  • ప్రముఖుల విషయంలో ఒక తీరు
  • సామాన్యుల ప్రాంతాల్లో మరో తీరు
  • హోంమంత్రి కార్యాలయంలో శానిటైజేషన్‌
  • కాలనీలు, బస్తీల్లో కనిపించని చర్యలు
  • కేంద్ర బృందం రాకతో అప్రమత్తం


గ్రేటర్‌లో 3 వేలకుపైగా కట్టడి ఇళ్లు ఉన్నాయి. ఎక్క డా బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. నిత్యం 800 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో కొన్ని కాంటాక్ట్‌ కేసులు కాగా, మరికొన్ని కొత్తవి. వైరస్‌ నిర్ధారణ అయిన చాలామంది వ్యక్తుల ఇళ్ల వద్ద శానిటైజేషన్‌ సక్రమంగా జరగడం లేదు. కొన్నిచోట్ల ఎంటమాలజీ సిబ్బంది వచ్చి సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేస్తున్నారు. అదీ ఒకసారి మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో ఆ ఒక్కసారి కూడా చేయడం లేదన్న ఫిర్యాదులున్నాయి. 


అక్కడలా.. ఇక్కడిలా..?

వైరస్‌ కట్టడి విషయంలో జీహెచ్‌ఎంసీ భిన్న వైఖరి ప్రదర్శిస్తోంది. నివారణ చర్యల్లో వివక్ష చూపుతోంది. కేసులు నమోదు కాని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఇళ్లలోనూ ప్రత్యేక శానిటైజేషన్‌ చేస్తూ.. పాజిటివ్‌ వచ్చిన పేదలు, మధ్య తరగతి వర్గాలుండే బస్తీలు, కాలనీలను పట్టించుకోవడంలేదు. ఇది అంతిమంగా నగర పౌరులపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదు. వాస్తవంగా కేసులు నమోదైన ఇళ్ల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయాలి. గతంలో కాలనీ/బస్తీ, ప్రాంతం, వీధి వరకు కట్టడి చేసిన అధికారులు ఆ పరిధి మొత్తం ద్రావకం స్ర్పే చేశారు. జెట్టింగ్‌ యంత్రాలతో శానిటైజేషన్‌ చేశారు. ఇందుకోసం బృందాలు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ అమలైనన్ని రోజులు కట్టుదిట్టంగా కట్టడి చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ సడలింపులతో పాటే వాటిని వదిలేసింది. నిజానికి సడలింపుల అనంతరమే వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అదే జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో మరింత అప్రమత్తంగా పని చేయాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. చాలా కట్టడి ఇళ్ల వద్ద శానిటైజేషన్‌ సాగడం లేదు. ప్రస్తుతం ఎంటమాలజీ బృందాలే ఎక్కువ ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 35 మంది ఎంటమాలజీ సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణపైనా ఎంటమాలజీ దృష్టిసారించాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ జరగకపోవడానికి ఇదీ ఓ కారణంగా మారుతోంది.


కేంద్ర బృందం రాక.. కట్టడి మార్పు

కేంద్ర బృందం వస్తుందని తెలిసి ఒక రోజు ముందు దోమలగూడలోని ధోబీ గల్లీ వద్ద మునుపటి కట్టడి ప్రాంతం తరహాలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతో పాటు చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. ప్రవేశం లేదు(నో ఎంట్రీ) అని ఫ్లెక్సీ తగిలించారు. వైరస్‌ సోకిన వ్యక్తులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించే వెసులుబాటు కోసమే పరిమిత కట్టడి పద్ధతి పాటిస్తున్నామని చెబుతోన్న జీహెచ్‌ఎంసీ.. ఆ ఒక్క ప్రాంతంలోనే పాత తరహాలో కట్టడి ఎందుకు ఏర్పాటు చేసింది.? పరిమిత కట్టడి ఉద్దేశాన్ని కేంద్ర బృందానికి వివరించలేకనా..? తమ పనితీరుపై కేంద్ర బృందం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తారన్న అనుమానంతోనా? అన్నది ఈ చర్యతో చర్చనీయాంశంగా మారిం ది. చేస్తున్న పని నిబంధనల ప్రకారమే ఉన్నప్పుడు కట్టడి వ్యూహం ఎందుకు మార్చినట్టు..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

- హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2020-06-30T07:54:34+05:30 IST