జనతా కర్ఫ్యూలో పాటించిన స్ఫూర్తి ఏమైంది?

ABN , First Publish Date - 2020-03-24T09:01:07+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంటే కొందరు మాత్రం రోడ్లపై తిరుగుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వైద్య

జనతా కర్ఫ్యూలో పాటించిన  స్ఫూర్తి  ఏమైంది?

స్టేజ్‌-3 పరిస్థితి రానివ్వొద్దు

ఇళ్లలో ఉండకుండా రోడ్లపైనా?

వారం రోజుల పని ముఖ్యమా? 

మీకు ప్రాణం ముఖ్యమా?

విదేశాల నుంచి వచ్చి దావత్‌లకా?

చికెన్‌ కోరుతున్న కరోనా బాధితులు

ఆస్పత్రులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు కావు 

ఫీవర్‌, సీసీఎంబీలో ట్రయల్‌రన్‌ 

కిట్లు రాగానే పరీక్షలు చేపడతాం

మంత్రి ఈటల స్పష్టీకరణ

ప్రైవేటు యాజమాన్యాలతో భేటీ

ఇళ్లలో ఉండమంటే.. రోడ్లపై తిరుగుతారా!: ఈటల


హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంటే కొందరు మాత్రం రోడ్లపై తిరుగుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పినా.. బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. వారం రోజుల పని ముఖ్యమా? లేక ప్రాణం ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా చూపించిన స్ఫూర్తి అంతలోనే ఏమైందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం స్టేజ్‌-2లో ఉందని, స్టేజ్‌-3కి రానివ్వొద్వని విజ్ఞప్తి చేశారు. కరోనా ఉన్నవారు తమకు తెలియకుండానే వందల మందికి అంటించే ప్రమాదముందని, ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.


కరోనా కట్టడికి ప్రైవేటు ఆస్పత్రుల సహాయం కూడా తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిబ్బంది కూడా సెలవులు పెట్టవద్దని, వారి రాకపోకల కోసం ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇంకా 99 మంది అనుమానితులు ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉన్నవారి గురించి ఆలోచిస్తుంటే విదేశాల నుంచి వచ్చిన వారు ధావత్‌లంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ఈ పది రోజులు ఎంతో క్లిష్టమైనవి..

విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందిని గుర్తించామని మంత్రి ఈటల చెప్పారు. కరోనా బాధితులు చికెన్‌, మటన్‌ కావాలంటూ అడుగుతున్నారని, దవాఖానాలు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు కావనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అవసరమైన వసతులన్నీ కల్పిస్తామని, కొంత అడ్జస్ట్‌ చేసుకోవాలని సూచించారు. ఈ పది రోజులు చాలా క్లిష్టమైనవని, ప్రపంచ యుద్థం కంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామని వ్యాఖ్యానించారు.  గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఫీవర్‌ హాస్పిటల్‌, సీసీఎంబీలో ట్రయల్‌రన్‌ చేశారని, కిట్లు రాగానే పూర్తిస్థాయిలో ఈ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

Updated Date - 2020-03-24T09:01:07+05:30 IST