ఈ నిషేధంతో సాధించేదేమిటి?

ABN , First Publish Date - 2022-01-20T05:50:34+05:30 IST

చింతామణి నాటకం తలచుకోగానే గుర్తొచ్చేది వేశ్యల వెంటబడి ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకునే దురలవాటు మీద పోరాటమే గాని, ఆ నాటకంలోని ఒక పాత్ర కులం కాదు. కాళ్ళకూరు నారాయణరావు (1871–1927) చాలా గొప్ప సామాజిక సంస్కర్త...

ఈ నిషేధంతో సాధించేదేమిటి?

చింతామణి నాటకం తలచుకోగానే గుర్తొచ్చేది వేశ్యల వెంటబడి ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకునే దురలవాటు మీద పోరాటమే గాని, ఆ నాటకంలోని ఒక పాత్ర కులం కాదు. కాళ్ళకూరు నారాయణరావు (1871–1927) చాలా గొప్ప సామాజిక సంస్కర్త. 1920లలోనే సమాజంలో మార్పు కోసం వరకట్న దురాచారం మీద పోరాడే ‘వరవిక్రయం’, వేశ్యాదుర్వ్యసనాన్ని చీల్చి చెండాడే ‘చింతామణి’ నాటకాలు రాసిన సాహిత్యవేత్త.


వేశ్యా లంపటం మీద ఆ నాటి రచయితలు ధ్వజమెత్తారు. కన్యాశుల్కం మీద గురజాడ విజృంభించినట్టే వేశ్యావృత్తికి వ్యతిరేకంగా అనేకమంది రచయితలు నాటకాలు రాసి ప్రదర్శించారు. కందుకూరి వీరేశలింగం 1893లో ‘వేశ్యాకాంతలు’ అనే నాటకం రాశారు. అంతకు ముందు ‘కౌతుక వర్థని’, ‘వేశ్యాప్రియ ప్రహసనము’ అనే నాటకాలు రాశారు. పనప్పాకం శ్రీనివాసాచార్యులు 1900లో ‘కనకాంగి’ నాటకం, 1900లో మంత్రి ప్రగడ భుజంగరావు ‘వారకాంత’ అనే నాటకం, కొలచం శ్రీనివాసరావు 1914లో ‘నాచ్చి పార్టీ’, ద్రోణంరాజు సీతారామారావు 1915లో ‘వేశ్యా మధురము’ అనే పేరుతో నాటకాలు రాశారు. 1917లో ‘వేశ్యా లంపటము’ అని బుద్ధరాజు ఈశ్వరప్ప పంతులు, ‘వేశ్యాహిత బోధిని’ అని 1917లో ద్రోణంరాజు సీతారామారావు రాశారు. తిరుమల రాఘవాచార్యులు 1918లో ‘వేశ్యామృతము’, 1919లో మలకపల్లి పెద శేషగిరిరావు ‘శ్రీ చింతామణి విలాసము’ అనే నాటకాల్ని రాశారు. 1920లో ‘చింతామణి’ నాటకాన్ని కాళ్లకూరు నారాయణరావు, 1922లో ‘వేశ్యా ప్రభోదము’ను దువ్వూరి జగన్నాథరావు రచించారు. ఇంకా ఆ తరువాత చింతామణి లేక లీలాశుక, బిల్వమంగళ అను చింతామణి నాటకం. కాంతామతి, వారకాంత, వ్యభిచారిణి, నవరస చింతామణి, ముద్దుల మోహనాంగి, వేశ్యాసహవాస ఫలితము, ప్రభోధ చింతామణి, వైశ్యవేశ్యా వధ, బోగము మేళము, కపట వేశ్యానాటకము, మంగతాయి, వైజయంతీ విలాపము, బిల్వమంగళ, వేశ్యాకామకాత్తోరము, విలాసవారకాంత, సానికొంప, నిష్ఫలం వంటి అనేకానేక నాటకాలు 1947 వరకు వేశ్యావృత్తి ఇతివృత్తంగా వచ్చాయి. కాని అన్నింటిలోకెల్లా కాళ్ళకూరి వారి ‘చింతామణి’ మాత్రమే వందలాది ప్రదర్శనలతో చాలా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ నాటకానికి ఇదివరకు ఉన్న ప్రాచుర్యం, ఆకర్షణ, ఆదరణ ఇప్పుడు లేదు. సామాజిక మాధ్యమాలలో కూడా అటువంటి గొప్ప నాటకాలకు పురాతత్వ విలువ తప్ప మరేదీ ఇప్పుడు ఉందనుకోలేం.


ఒక కులంవాళ్లను పనిగట్టుకుని నేరజాతి వారని తిడుతూ అవమానిస్తూ నిర్హేతుక నిందలు వేస్తే ప్రశ్నించడంలో తప్పు లేదు. ఆర్యవైశ్యుల మనోభావాలే కాదు ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకూడదు. ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం నిర్మాణాత్మకంగా విమర్శించుకోవాలి. ఎవరి మనోభావాలకు దెబ్బ తగిలినా ఆ పాత్ర కులం వారి సంఘాలు కలిసికట్టుగా నిషేధాన్ని కోరడం వారి ప్రాథమిక హక్కు, సందేహం లేదు. సుబ్బిశెట్టి పాత్ర వల్ల తమ కులం వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆర్యవైశ్య సంఘాలవారు బాధపడుతున్నారు. చింతామణి సినిమా తీస్తానని, అందులో సుబ్బిశెట్టి పాత్ర తానే వేస్తానని దివంగత దాసరి నారాయణరావు ప్రకటించినప్పుడు ఆర్యవైశ్యులంతా ఆయన్ని ఆ పని మానేయాలని కోరారు. ఎవరు అడిగినా కాదనని భోళా శంకరుడైన దాసరి అందుకు అంగీకరించి ఆ సినిమా తీయలేదు. 


నూతన్, దిలీప్‌కుమార్ నాయికానాయకులుగా నటించిన హిందీ సినిమా ‘కర్మ’లో విఖ్యాత తెలుగునటుడు సత్యనారాయణ విలన్ వేషం వేశారు. తెలుగు వాళ్లను టెర్రరిస్టుగా చూపుతారా అని కోపించిన తెలుగు సంఘం ఒక రిట్ పిటిషన్‌లో ఆ పాత్ర రూపు, భాష మార్చాలని కోరింది. కన్యాశుల్కం నాటకంలో టీనేజి ఆడపిల్లలను దారుణంగా అమ్ముకునే అగ్రహారిక బ్రాహ్మణ దుర్మార్గాన్ని గురజాడ అప్పారావు ఎండగట్టారు. ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్న గొప్ప నాటకమది. అదృష్టవశాత్తూ బ్రాహ్మణ కులసంఘాలు ఈ నాటకాన్ని నిషేధించాలని కోరడం లేదు. కళలను, కథలను విమర్శలను కులమతభాషావర్గాల కోణం నుంచి చూసి బాధపడుతూ పోతే అసలీ సమాజంలో విమర్శ బతుకుతుందా?


కాళ్ళకూరు నారాయణరావు సామాజిక సమస్యలపై చైతన్యం కలిగించారనే విషయం మరిచిపోతే ఎలా? తన పేరుతో ఉన్న నాటకంలో చింతామణి ఒక అందమైన వేశ్య, కథానాయిక, సంస్కారమున్న విద్యావతి. భవానీ శంకరుడు ఆస్తులన్నీ చింతామణికి సమర్పించుకుని జులాయిగా తిరుగుతూ ఉంటాడు. చింతామణి అమ్మ శ్రీహరి. చింతామణి తల్లి డబ్బును హరిస్తుంది కనుక శ్రీ (సంపద) హరి (హరించేది) అనీ చింతామణి అయితే పూర్తిగా మనుషుల్నే హరిస్తుంది కనుక నరహరి అని ఈ నాటకంలోనే ఒక డైలాగ్. వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. డబ్బు తెస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది. భవాని శంకరుడి డబ్బు మొత్తం లాగేసిన తరువాత శ్రీహరి అతన్ని వెళ్లగొడుతుంది. బిల్వమంగళుడు ఈ నాటకంలో కథానాయకుడు. మంచివాడు, విద్యావంతుడు ఆస్తిపరుడైన బిల్వమంగళుడిని తన దగ్గరికి తీసుకురావాలని భవానీ శంకరుడిని చింతామణి అడుగుతుంది. అతడిని చింతామణి ఇంటికి తీసుకువెళతాడు భవాని. చింతామణి తన పనులు సరైనవి కావని బిల్వమంగళుడి వద్ద చింతిస్తూ ఉంటుంది.


ఈ పాత్రల మధ్య సుబ్బిశెట్టి పాత్రతో కొంత ఉపకథ నడుస్తూ ఉంటుంది. భవానీ శంకరుడి వలెనే చింతామణి మీద మోజుతో సుబ్బిశెట్టి కూడా చాలా నష్టపోతాడు. చివరకు పెసర పునుకులు, మసాలా వడలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు. భవాని శంకరుడు బ్రాహ్మణుడు కాబట్టి, నీళ్ళకావిళ్ళు మోసే వృత్తితో పొట్టబోసుకుంటూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటుమామిడితోట నీవు కోరగనే రాసి ఇచ్చినాను’ అంటూ పద్యాలు పాడుకుంటూ ఉంటాడు. నాటకం రాసిన తొలినాళ్లలో లేని మోటు సరసాలు, అసభ్య ద్వంద్వార్థ సంభాషణలను నాటకంలో జొప్పించడం వల్ల సుబ్బిశెట్టి, శ్రీహరి, చింతామణి పాత్రల హావభావాలు, మాటలు మితిమీరి అసభ్యత, అశ్లీలత స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకం. అసలు సందేశం ఎటో పోయి, ఈ చెత్తమాటలు మిగిలిపోయేవి. సామాజిక పరివర్తన సంగతి దేవుడెరుగు, సంస్కార పతనానికి దారితీసే చెత్త మాటలు జనంలోకి వెళ్ళిపోయేవి.


సహజంగా శాంతికాముకులైన ఆర్యవైశ్య మహాసభ, తదితర సంఘాలవారు సుబ్బిశెట్టి ద్వారా ఈ చెత్తమాటలు చెప్పించడం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది సమంజసమే. కేవలం సుబ్బిశెట్టి పాత్రద్వారా ఆ కులాన్నే కాదు, ఆ మాటలు రాయని కాళ్లకూరి నారాయణరావును కూడా ఈ అసభ్యపు మాటలు అవమానిస్తున్నాయి. సినిమాలకు సెన్సార్ ఉంది. సెన్సార్ కమిటీ ఇటువంటి అశ్లీలపు మాటలను తొలగించడం సమంజసమనే మనం అంగీకరిస్తున్నాం కూడా. కాని మొత్తం సినిమానే నిషేధించమని అడగడం లేదు కదా. ఇప్పటి అశ్లీల అసభ్య పోర్న్ వీడియోల విశృంఖల స్వైరవిహారంతో పోల్చితే సుబ్బిశెట్టి వెకిలి మాటలు ఏపాటి?


చింతామణి నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే దిశ వైపు కాకుండా వ్యసనాల వైపు మళ్లిస్తున్నదని కనుక దాన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించి నిషేధించింది. ఎవరైనా ఈ నాటకం వేస్తే చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరించారు. ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నదా, నాటకంలో జొప్పించిన ద్వంద్వార్థపు మాటలు పెడదోవ పట్టిస్తున్నాయా? అని ఆ నేతలూ, ప్రభుత్వంలోని పెద్దలూ ఆలోచించాల్సింది. ప్రజాప్రయోజనం పరిరక్షణకు, పబ్లిక్ ఆర్డర్ కాపాడడం కోసం తప్ప భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద నిషేధాలు విధించే అధికారం ప్రభుత్వాలకు లేదు. విధిస్తే అది అధికార దుర్వినియోగమే అవుతుంది. చింతామణిని నిషేధించి ఏ పబ్లిక్ ఆర్డర్ సాధించారు? ఏం ప్రజాప్రయోజనం సాధిస్తారు? ప్రజాదరణ పొందిన ఒక ఉత్తమ నాటకాన్ని మొత్తంగా నిషేధించడం అనాలోచిత చర్య. ఒరిజినల్ చింతామణి (కాళ్ళకూరి నారాయణరావు రచన)లో సుబ్బిశెట్టి పాత్ర సంభాషణలకు అదనంగా ఏ చెత్త డైలాగ్ జొప్పించినా దాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. టీవీ చానెల్స్‌లో అర్థరాత్రి ప్రసారమయ్యే పాటలు, ఇంటర్నెట్‌లో ప్రవహిస్తున్న అశ్లీలత, సినిమాల్లో ఐటంసాంగ్స్ టిక్కెట్ ధర ఎంతైనా పెట్టి చూడవచ్చు కాని చింతామణి నాటకం చూడడానికి వీల్లేదంటే మనం ఏ యుగంలో ఉన్నట్టు, ఎంత ముందుకు వెళ్లినట్టు? బ్రాహ్మణసంఘాలు వద్దంటే కన్యాశుల్కం నాటకాన్ని కూడా నిషేధిస్తారా? ప్రతి సినిమాలో, నాటకంలో ఏదో ఒక కులంవాడు విలన్ పాత్ర- పోషించక తప్పదు. అప్పుడు సృజనాత్మక సాహిత్యం కళలు సినిమాలు వదులుకుందామా? విమర్శ మీద దాడులు చేసేవారు విచక్షణతో వ్యవహరించాలి. రచనలమీద నిషేధాలు విధించే ముందు ఏం నిషేధిస్తున్నామో ఆలోచించుకోవాలి.


నిజానికి ఆర్యవైశ్యులు గానీ, ప్రభుత్వం గానీ ఈ నిషేధంపై అంతగా ఆనందపడేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు, అంటే నిషేధించిన తరువాత, చింతామణిని ఎందుకు నిషేధించారు అనే గూగుల్ వెతుకులాట మొదలవుతుంది. మౌసులన్నీ చింతామణి మీద మోజుపడుతూ ఉంటాయి. పాత వీడియోలు, చింతామణి ఏ అశ్లీల సంభాషణల వల్ల నిషేధానికి గురైందో తెలుసా అని వివరించే యూట్యూబ్‌లు సోషల్‌మీడియా షోలు వైరల్ అవుతాయి. వాటికి లక్షలాది మంది లైకులు, వ్యూలు నమోదవుతాయి. అన్ని కులాల యువతీయువకులు లోతుగా ఏదో తెలుసుకోవడానికి కృషి చేస్తారు. చింతామణికే కాదు సుబ్బిశెట్టికి కూడా ఈ నిషేధంతో మంచిరోజులు వచ్చాయి. నిషేధం కోరినవారు, విధించినవారు, యూట్యూబులు చేసినవారు, చూసినవారు, విన్నా వినిపించినా, మాట్లాడినా, లైక్‌ కొట్టినా మరోసారి చింతామణి విజృంభణను చూసి తరిస్తారనేదే ఈ నిషిద్ధ చింతామణి ఫలశ్రుతి. 

మాడభూషి శ్రీధర్

Updated Date - 2022-01-20T05:50:34+05:30 IST