వాట్సాప్‌ బ్రో!.. వాట్సాప్‌ కొత్త విధానంపై ఆందోళన

ABN , First Publish Date - 2021-01-11T07:19:08+05:30 IST

నాలుగైదు రోజులుగా వాట్సాప్‌ గ్రూపుల్లో కనిపిస్తున్న మెసేజ్‌లివి. తిండి, నీరు మనకు ఎలా నిత్యావసరాలో.. ఈ టెక్‌ యుగంలో వాట్సాప్‌ కూడా అలాగే మనలో చాలామందికి నిత్యావసరంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

వాట్సాప్‌ బ్రో!.. వాట్సాప్‌ కొత్త విధానంపై ఆందోళన

  • వినియోగదారుల సమాచార సేకరణ
  • ఫేస్‌బుక్‌ అనుబంధ యాప్‌లతో షేరింగ్‌
  • బిజినెస్‌ చాట్లను వ్యాపారుల నుంచి మాత్రమే
  • తీసుకునే అవకాశం ఉందంటున్న వాట్సాప్‌
  • తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
  • ప్రత్యర్థి యాప్‌ సిగ్నల్‌ వైపు అత్యధికుల చూపు
  • వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లను కట్టడి చేయండి
  • లేదా నిషేధించండి.. కేంద్రానికి కెయిట్‌ లేఖ


‘‘నేను ఈ నెలాఖరు దాకానే వాట్సాప్‌లో ఉంటా. సిగ్నల్‌ యాప్‌కి మారిపోతున్నా. వచ్చే నెల నుంచి ఆ యాప్‌లోనే అందుబాటులో ఉంటా’’

‘‘మన గ్రూప్‌ మొత్తాన్నీ సిగ్నల్‌ యాప్‌లోకి షిఫ్ట్‌ చేద్దాం. యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ లింకు ఇది. అందరూ ఈ గ్రూప్‌లో మీకు కావాలనుకున్న ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను ముందే సేవ్‌ చేసి పెట్టుకోండి’’

..నాలుగైదు రోజులుగా వాట్సాప్‌ గ్రూపుల్లో కనిపిస్తున్న మెసేజ్‌లివి. తిండి, నీరు మనకు ఎలా నిత్యావసరాలో.. ఈ టెక్‌ యుగంలో వాట్సాప్‌ కూడా అలాగే మనలో చాలామందికి నిత్యావసరంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాట్సా్‌పను డిలీట్‌ చేయడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. దీనికి కారణం.. ఇటీవలే ఆ యాప్‌ తన ప్రైవసీ పాలసీకి (గోప్యత విధానాలకు) చేసిన మార్పులే! వాట్సాప్‌ వినియోగదారుల సమాచారాన్ని సేకరించి, ఫేస్‌బుక్‌కు ఇవ్వడమే ఈ కొత్త విధానం.


గతంలో ఇలాంటి మార్పులను అంగీకరించాలా వద్దా అనే ప్రత్యామ్నాయం వినియోగదారులకు ఉండేది. కానీ, వాట్సాప్‌ దాన్నిప్పుడు తప్పనిసరి చేసింది. కొత్త పాలసీని ఫిబ్రవరి 8లోగా అంగీకిరించి, ఆమోద ముద్ర వేయాలని.. లేదంటే ఆ రోజు నుంచి యాప్‌ పనిచేయదని తేల్చిచెప్పేసింది. ఈ బెదిరింపుతో చిర్రెక్కిన వినియోగదారులు..


వాట్సాప్‌ యాప్‌కే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఎప్పటి నుంచో ఫేస్‌బుక్‌పై గుర్రుగా ఉన్న టెస్లా చీఫ్‌ ఈలన్‌ మస్క్‌.. ఇదే అదను అన్నట్టుగా వాట్సా్‌పకు ప్రత్యామ్నాయం సిగ్నల్‌ యాప్‌ అని, దాన్ని అందరూ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ప్రకటించడంతో సిగ్నల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు పోటెత్తుతున్నాయి!


ఒకదశలో ఓటీపీలు పంపించలేక సిగ్నల్‌ యాప్‌ చేతులెత్తేయాల్సి వచ్చిందంటే వాట్సా్‌పకు ఎంత గడ్డు పరిస్థితి ఎదురుకాబోతోందో అర్థం చేసుకోవచ్చు!! ఇంతకీ వాట్సాప్‌ తన గోప్యతా విధానాలకు చేసిన మార్పుచేర్పులేమిటి? వాటి వల్ల నిజంగానే వినియోగదారుల సమాచారానికి గోప్యత లేకుండా పోతుందా? వినియోగదారులు ఎందుకు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు? చూద్దాం..


ఏమిటీ కొత్త విధానం?

వాట్సాప్‌ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌, దాని అనుబంధ ఉత్పత్తులు/యా్‌పలతో పంచుకుంటున్నట్టు వాట్సాప్‌ తన కొత్త పాలసీలో ప్రకటించింది.


ఫేస్‌బుక్‌ అనుబంధ ఉత్పత్తులు అంటే?

మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, పోర్టల్‌ బ్రాండెడ్‌ డివైసెస్‌, ఆక్యులస్‌ ప్రొడక్ట్స్‌, ఫేస్‌బుక్‌ షాప్స్‌, స్పార్క్‌ ఏఆర్‌ స్టూడియో, ఆడియెన్స్‌ నెట్‌వర్క్‌, ఎన్‌పీఈ టీమ్‌ తదితరాలు.


ఏ సమాచారాన్ని పంచుకుంటుంది?

మన ఫోన్‌ నంబర్‌, వాట్సాప్‌ ఖాతా క్రియేట్‌ చేసినప్పుడు మన గురించి మనం ఇచ్చిన ప్రాథమిక సమచారం, వాట్సా్‌పను ఎంత తరచుగా వాడతాం? వాట్సాప్‌లో ఏయే ఫీచర్లను మనం వాడతాం? మన ప్రొఫైల్‌ పొటో, స్టేటస్‌, మన గురించి మనం ఇచ్చే సమాచారం(అబౌట్‌), మన ఫోన్‌ ఏ కంపెనీది? ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ను వాడతాం?

మన ఐపీ అడ్రస్‌ ఏమిటి? మన వాట్సాప్‌లో ఎన్ని గ్రూపులున్నాయి? గ్రూపుల పేర్లేమిటి? వాటి ప్రొఫైల్‌ పిక్చర్లు, లొకేషన్‌ (అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాం? వంటివి).. తదితర వివరాలను సేకరించి వాటిని ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సంస్థలు/యాప్‌లు/ఉత్పత్తులు వాడుకోవడానికి ఇస్తుంది. 


మన చాట్‌లు కూడా చూస్తుందా?

వాట్సాప్‌లో మనం పంపే సందేశాలు, ఫొటోల వంటివి చూడబోమని, ఎవరితోనూ పంచుకోబోమని వాట్సాప్‌ హామీ ఇస్తోంది. అయితే.. ‘‘వాట్సా్‌పలో మీరు ఏదైనా వ్యాపార సంస్థకు మెసేజ్‌ చేస్తే, మీరు షేర్‌ చేసే సందేశాలు అదే వ్యాపారంలో ఉన్న చాలా మందికి కనిపించే అవకాశం ఉంది’’ అని వాట్సాప్‌ స్పష్టంగా తన కొత్త విధానంలో పేర్కొంది. అది కూడా ఆయా వ్యాపారసంస్థల పాలసీపై ఆధారపడి ఉందని చెబుతోంది.


అంటే.. ఆయా సంస్థలు తమ సమాచారాన్ని ఫేస్‌బుక్‌లాంటి థర్డ్‌పార్టీ యాప్‌లతో పంచుకునే విధానాన్ని అవలంబిస్తే దాంతో తమకు సంబంధం లేదన్నది వాట్సాప్‌ వాదన. వాట్సా్‌పలో మనం ఏదైనా వ్యాపారసంస్థతో చాట్‌ చేస్తే ఆయా సంస్థల నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఆ చాట్లను, చాట్లలోని వివరాలను పొందే అవకాశం ఉంది. అందుకే కొత్త విధానాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారమే అయినా సరే.. మన సందేశాలను వేరేవాళ్లు చూసే అవకాశం ఇవ్వడమేమిటన్నది వారి అభ్యంతరం.


అలాగే.. మనం ‘‘వాట్సాప్‌ పే’’ద్వారా చెల్లింపులు చేస్తుంటే పేమెంట్‌ అకౌంట్‌ వివరాలు, లావాదేవీ వివరాలను, షిప్పింగ్‌ వివరాలను, ఎంత మొత్తం లావాదేవీ జరిగింది తదితర అంశాలను కూడా సేకరిస్తుంది. దీనిపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


కొత్త పాలసీని అంగీకరించాలా వద్దా?

వాట్సాప్‌ సేవలు కావాలనుకుంటే కొత్త పాలసీని తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. అనుమతించనివారి వాట్సాప్‌ సేవలు ఫిబ్రవరి 8 నుంచి నిలిచిపోతాయి. 


పొరపాటున ఆమోదించి.. ఆపై వద్దనుకుంటే?

ఇప్పటికే పొరపాటున అనుమతించేసి... మీ సమాచారాన్ని వాట్సాప్‌ ఇతరులతో పంచుకోకూడదని మీరు ఇప్పుడు భావిస్తుంటే గనక.. ఆ అనుమతిని రద్దుచేసి, ఖాతాను డిలీట్‌ చేయడానికి వాట్సాప్‌ 30 రోజుల గడువు ఇచ్చింది. ఆ లోగా మీ అనుమతిని ఆప్ట్‌ అవుట్‌ చేసి ఖాతాను డిలీట్‌ చేసేస్తే మీ సమాచారాన్ని ఆ సంస్థ ఎవరితోనూ పంచుకోదు.


వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే సరిపోతుందా?

సరిపోదు. మీ ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ను తెరిచి.. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ విభాగంలో.. ‘డిలీట్‌ మై అకౌంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు వాట్సా్‌పలో మీ ఖాతా డిలీట్‌ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌లో వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే సరిపోతుంది. మీరు ఇప్పటికే ఇతరులకు పంపిన మెసేజ్‌లు వారి ఫోన్లలో మాత్రం అలాగే ఉంటాయి.

- సెంట్రల్‌ డెస్క్‌


వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లను కట్టడి చేయండి

కేంద్రానికి కెయిట్‌ లేఖ

న్యూఢిల్లీ, జనవరి 10: వాట్సాప్‌ కొత్త పాలసీ నేపథ్యంలో.. ఆ యాప్‌తోపాటు, ఫేస్‌బుక్‌ను కూడా దేశంలో నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కెయిట్‌) కేంద్రానికి లేఖ రాసింది. ‘‘కొత్త విధానంతో వినియోగదారుల వ్యక్తిగత, చెల్లింపుల సమాచారాన్ని, వారి ఫోన్లలోని కాంటాక్ట్‌ నంబర్లను, లొకేషన్‌ను, వినియోగదారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వాట్సాప్‌ సేకరించనుంది. ఆ సమాచారాన్ని దేనికైనా వాడుకోవచ్చు’’ అంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాసిన లేఖలో కెయిట్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

వాట్సాప్‌ తన కొత్త విధానాన్ని ఆపాలని.. లేదా నిషేధం విధించాలని డిమాండ్‌ చేసింది. ఫేస్‌బుక్‌కు భారత్‌లో 20 కోట్ల మంది వినియోగదారులున్నారని.. వారందరి డేటాను యాక్సెస్‌ చేయడానికి అనుమతిస్తే అది ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరించింది.


Updated Date - 2021-01-11T07:19:08+05:30 IST