ముదిరిన వాట్సాప్‌ ‘గ్రూపు’ వివాదం.. భగ్గుమన్న మహిళా కార్పొరేటర్

ABN , First Publish Date - 2021-07-30T19:52:59+05:30 IST

ఈ నేపథ్యంలో సీసీఎస్‌ గ్రూపు అడ్మిన్‌ పద్మారెడ్డిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ, తనపై తప్పుడు ప్రచారం

ముదిరిన వాట్సాప్‌ ‘గ్రూపు’ వివాదం.. భగ్గుమన్న మహిళా కార్పొరేటర్

  • స్వలాభం కోసం పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారు
  • ‘సీసీఎస్‌’ వాట్సాప్‌ గ్రూపుపై భగ్గుమన్న కార్పొరేటర్‌

హైదరాబాద్ సిటీ/కుషాయిగూడ : చర్లపల్లి డివిజన్‌లో కొన్ని నెలలుగా సాగుతున్న ‘సీసీఎస్‌ వాట్సాప్‌ గ్రూపు’ వివాదం, గురువారం కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బట్టబయలు చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివిధ విభాగాల అధికారులు, కాలనీల అసోసియేషన్‌ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు దాదాపు మూడు వందల మందితో ఓ వ్యక్తి ‘చర్లపల్లి కాలనీల సమాఖ్య’ (సీసీఎస్‌) పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపు, డివిజన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి ఒక వర్గం, కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి (మాజీ మేయర్‌ రామ్మోహన్‌) మరో వర్గంగా విడిపోయి ఆధిపత్య పోరును సాగిస్తోన్నారు. 


ఈ నేపథ్యంలో సీసీఎస్‌ గ్రూపు అడ్మిన్‌ పద్మారెడ్డిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ, తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని కార్పొరేటర్‌ శ్రీదేవి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన గ్రూపు అడ్మిన్‌ ఎంపల్లి పద్మారెడ్డి సమస్యలను పరిష్కరించాలని తనుకున్న పరిచయాలతో ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేవాడు. కొన్ని రోజులు సజావుగానే సాగిన వాట్సాప్‌ గ్రూపు వ్యవహారాలు, అక్రమ నిర్మాణాల వైపు మళ్లడంతో వివాదాస్పదమైంది. గత రెండు, మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక విభాగం రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజుకుంది. సదరు ఇంటి యజమాని వద్ద ఎమ్మెల్యే వర్గం డబ్బులు తీసుకున్నారని కార్పొరేటర్‌ వర్గం, అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలకు పాల్పడడంలో కార్పొరేటర్‌ హస్తం ఉందని ఎమ్మెల్యే వర్గం పరస్పరం వాట్సాప్‌ చాటింగ్‌లలో ఆరోపణలు చేసుకున్నారు.


అప్రదిష్ట పాలు చేస్తున్నారు: కార్పొరేటర్‌ శ్రీదేవి 

తమ స్వలాభం కోసం కొందరు వ్యక్తులు తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్‌ శ్రీదేవి ఆరోపించారు. గురువారం చర్లపల్లి సిరి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్‌ పరిధిలోని 52 కాలనీల అసోసియేషన్‌ ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అండదండలతో మాజీ వార్డు సభ్యుడు జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి, సీసీఎస్‌ వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ ఎంపల్లి పద్మారెడ్డిలు తనను అప్రదిష్ట పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా ముసుగులో మాజీ విలేకరి పద్మారెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. న్యాయపరమైన సలహాలతో ఆయనపై కోర్టులో దావా వేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ సింగిరెడ్డి ధన్‌పాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు విద్యాసాగర్‌, అనిల్‌, శ్రీకాంత్‌, కనకరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T19:52:59+05:30 IST